రుద్రమదేవి

దర్శకుడు గుణశేఖర్ డ్రీం ప్రాజెక్ట్ రుద్రమదేవి.

అనుష్క, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, కృష్ణం రాజు, నిత్య మీనన్ తదితరులు నటించిన చిత్రం రుద్రమదేవి. సంగీతం సమకూర్చింది ఇళయరాజా. మాటలేమో పరుచూరి బ్రదర్స్ విపంచి రాజసింహవి.

బాహుబలి తర్వాత మరో భారీ సినిమా ‘రుద్రమదేవి’ .

సినిమా నిర్మాణానికే కాదు విడుదల కోసం కూడా చాలా కష్టపడినట్టు చెప్పుకున్న గుణశేఖర్ మంచి చిత్రాన్నే అందించారన్న మాటైతే మిగిలింది. కనుక ఆయన శ్రమ వృధా కాలేదు అని అనుకోవచ్చు.

కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడే వారసుడి కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్న వేళ గణపతి దేవుడి పాత్రలో నటించిన కృష్ణం రాజుకు ఓ అమ్మాయి పుడుతుంది. . కానీ అమ్మాయి పుడితే ప్రజలు నీరసిస్తారని, దేవగిరి సామ్రాజ్య శత్రు సైన్యం దండెత్తి వస్తుందని భయపడి మంత్రి శివదేవయ్య పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ సలహా మేరకు తనకు పుట్టింది అమ్మాయి కాదని అబ్బాయి అని గణపతి దేవుడు అబద్ధమాడి అందరినీ నమ్మిస్తాడు. ఆమెకు (రుద్రమదేవి అనుష్క) రుద్రదేవుడు అని పేరు పెట్టి కొడుకు లాగే పెంచుతాడు. యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. రుద్రదేవుడిగా చెలామణి అయిన రుద్రమదేవి పెరిగి పెద్దయిన తర్వాత ఎలా రాజ్యాధికారం చేపట్టింది అన్నదే చిత్ర కథ. ఆమె చాళుక్య వీరభద్రుడు పాత్రలో నటించిన రానా, గోన గన్నారెడ్డి పాత్రలో నటించిన అల్లు అర్జున్ సహాయంతో రుద్రమదేవి యుద్ధంలో ఎలా గెలిచింది అనే విషయాన్ని చక్కగా తెరకెక్కించారు గుణశేఖర్. ఈ చిత్రానికి అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రే అత్యంత కీలకం. అర్జున్ ను ప్లస్ పాయింట్ గానే చెప్పుకోవాలి. కానీ ఒక్క విషయం అల్లు అర్జున్ పాత్రలో తీసుకున్న శ్రద్ధ రుద్రమదేవితోపాటు ఇతర పాత్రలపైన కూడా తీసుకుని ఉంటే మరెంతో బాగుండేది అని కూడా చెప్పేవారున్నారు. గ్లామర్ విషయంలో మాత్రం అనుష్క బాగానే ఆకట్టుకుంది. అలాగే యుద్ధ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవన్న టాక్ కూడా వస్తోంది.

ఇళయరాజా స్వరపరచిన పాటలు పరవాలేదు. గ్రాఫిక్స్ – విజువల్ ఎఫెక్టుల విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టారని చూడగానే అనిపిస్తుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. మాటలు ఓకే.

మొత్తం మీద కాకతీయుల చరిత్ర తెలియని వారు చూడదగ్గ చిత్రమే రుద్రమదేవి.

Send a Comment

Your email address will not be published.