
దివ్య భారతి అలియాస్ దివ్య ఓం ప్రకాష్ భారతి 1974 ఫిబ్రవరి 25వ తేదీన మీతా, ఓం ప్రకాష్ భారతి దంపతులకు పుట్టింది. దివ్య భారతి సినిమాలో నటించడాని కోసం చదవు మానేసింది. 1990 లో తెలుగులో బొబ్బిలి రాజా సినిమాలో మొదటిసారిగా నటించింది. అప్పుడు ఆమె వయస్సు పదహారేళ్ళు. ఆ సినిమాలో హీరో వెంకటేష్. ఈ సినిమా సూపర్ హిట్టైంది. ఆ తర్వాత ఇదే సినిమాను హిందీలో రాంపూర్ కా రాజ అనే టైటిల్ తో తీసారు.
హిందీలో ఆమె నటించిన తొలి సినిమా దిల్ తో హాయ్. అది 1992 లో విడుదలైంది. ఆ తర్వాత దిల్ కా క్యా కసూర్ అనే సినిమాలో నటించింది. ఇది మ్యూజికల్ రొమాన్సు సినిమాగా తెరకెక్కింది. అయితే అనేకమంది ప్రముఖ నటులతో రూపొందిన విశ్వాత్మ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆమె మరో పదమూడు సినిమాల్లో నటించింది,. ఆ సమయంలో అందరూ ఆమెను మరో శ్రీదేవిగా చెప్పుకోవడం మొదలుపెట్టారు.
తెలుగులో ధర్మక్షేత్రం, తొలి ముద్దు, రౌడీ అల్లుడు తదితర చిత్రాల్లో నటించింది. చిరంజీవి, ప్రశాంత్ వంటి హీరోలతో నటించి గుర్తింపు పొందిన దివ్యభారతి సాత్ సముందర్ అనే హిందీ సినిమాలో ఒక పాటలో నటించిన సన్నివేశం ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ పాట సూపర్ హిట్టైంది.
వెండి తెరపై కనిపించిన తక్కువ కాలంలోనే చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించి ఆహా ఓహో అనిపించుకున్న దివ్య 1992 లో బిజీ బిజీ తారగా ఓ వెలుగు వెలిగింది. ఆ ఏడాది ఆమె నటనకు ఫిలిం ఫేర్ లక్స్ న్యూ పేస్ అవార్డ్ కూడా దక్కింది. మరోవైపు కొన్ని ఫ్లాపులు కూడా చవిచూసినా అభిమానుల గుండెల్లో మాత్రం చెరగని గూడుకట్టుకున్న తారగా నిలిచింది.
ప్రేమ పెళ్లి …..మతమార్పిడి…
అయితే దివ్య భారతి వ్యక్తిగత జీవితం మాత్రం అనుకున్నంత గొప్పగా సాగలేదని అనుకునే వారున్నారు. ఫిలిం మేకర్ సాజిద్ తో దివ్య పరిచయం కలగడానికి కారణం బాలీవుడ్ నటుడు గోవిందానే. సాజిద్ అదే పనిగా దివ్యను కలుస్తూ వచ్చాడు. అప్పటికి ఆమె వయస్సు 16 ఏళ్ళు మాత్రమే. వీరి మధ్య పరిచయం అనతి కాలంలోనే ప్రేమగా మారింది. 1992 జనవరిలో దివ్య తనను పెళ్లి చేసుకోవాలని అనుకుందని, ఈ మాట బయటకు వచ్చిన మరుసటి రోజే ఆమె చెప్పలేని ఒత్తిడికి లోనైనట్టు సాజిద్ చెప్పాడు. దానికి కారణం లేకపోలేదు. ఆమె పేరును అనేకమంది హీరోలతో కలిపి అనేక వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ వదంతులకు అడ్డుకట్ట వెయ్యడానికి గాను ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ విషయాన్ని తనతో చెప్పినట్టు సాజిద్ అన్నాడు. 1992 మే 20వ తేదీన సాజిద్, దివ్యాలు పెళ్లి చేసుకున్నారు. వీరి రహస్య వివాహానికి దివ్య సన్నిహితులు సంధ్య, ఆమె భర్త, ఓ కాజీ హాజరయ్యారు. తులసి అపార్ట్ మెంట్ లో ఈ పెళ్లి జరిగింది. అప్పుడే ఆమె ఇస్లాం మతం స్వీకరించి సనఃఅని పేరు మార్చుకుంది. “నా మాట వల్లే ఆమీ మా పెళ్లి విషయాన్ని చాలా కాలం బయటకు చెప్పలేదని” సాజిద్ చెప్పాడు.
అదంతా ఇప్పటికీ మిస్టరీయే
ఎంతో ప్రతిభ ఉన్న ఆమె జీవితం అనుకోని రీతిలో 1993 ఏప్రిల్ 5వ తేదీన ముగిసింది. వెర్సోవాలోని యారి రోడ్ లో ఉన్న ఫ్లాట్ ఐదో అంతస్తు బాల్కనీ నుంచి కింద పడి చనిపోయింది. ఆమె మరణం ఒక మిస్టరీగా మిగిలింది. ఆమె మృతిపై మీడియాలో అనేక రకాల వార్తలు వచ్చాయి. దానితో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తులు చేపట్టినా వారూ ఒక నిర్ధారణకు రాలేకపోయారు. ఈ రోజు వరకు ఆమె మరణం ఒక మిస్టరీయే. ఆమెను బాల్కనీ నుంచి కిందకు ఎవరో నేట్టేసారని కొందరంటే కాదు కాదు ఆమె జారి పడి పోయారని మరి కొందరంటారు. అది కూడా కాదు ఆమె తాగిన మత్తులో పడిపోయిందని ఇంకొందరి మాట. కానీ ఏది నిజమో ఎవరికీ తెలియదు. ఆమె చనిపోయిన రెండురోజులకు అంటే ఏప్రిల్ 7వ తేదీన ఆమె భౌతికదేహాన్ని అప్పగించిన తర్వాత అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. దాదాపు అయిదు వందల మంది ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. వారిలో అనిల్ కపూర్, గోవిందా, రాజ్ బబ్బర్, యష్ చోప్రా, జిమ్మీ నీరులా, అరుణా ఇరాని, రజా మురాద్, వెంకటేష్, హేమమాలిని, సైఫ్ అలీ ఖాన్, షారుఖ్ ఖాన్, శిల్ప శిరోద్కర్, కరిష్మా కపూర్ తదితరులు ఉన్నారు.
1998 లో పోలీసులు దివ్య భారతి మృతి కేసు దర్యాప్తును ఏమీ తేలలేదని ఫైల్ మూసేశారు.
మరణం తర్వాత విడుదలైన సినిమాలు…
ఆమె చనిపోయిన తర్వాత ఆమె స్మృత్యర్ధం రంగ్, షత్రంజ్ సినిమాలు విడుదలయ్యాయి. ఆమె స్మృత్యర్ధం ఈ రెండు సినిమాలను ఆమెకే అంకితం చేసారు. అంతేకాదు ఆమె భర్త కూడా అనేక సినిమాలను ఆమె పేరిట అంకితం చేసారు. అలాగే, ఆమె చనిపోయే ముందు లాద్ల అనే సినిమాలో 80 శాతం వరకు నటించినా ఆ సినిమాను తిరిగి శ్రీదేవితో పూర్తిగా చిత్రీకరించి ఆ సినిమాను 1994 లో విడుదల చేసారు.
ఆమె తెలుగులో మొత్తం ఏడు సినిమాలు, హిందీలో పదమూడు సినిమాలు చేసింది. తమిళంలో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ చిత్రం పేరు నిలా పెన్నే.
ఏదిఏమైనా వెండితెర ప్రపంచం ఒక అందాల తారను అర్ధంతరంగా కోల్పోవడం బాధాకరం.
– నీరజా చంద్రన్