‘రోజులు మారాయి’- నవ్వుల కోసమే!

Rojulu marayiఈమధ్యకాలంలో ప్రేమకథా చిత్రాలతో యువతను ఆకట్టుకున్న మారుతి ఇప్పుడు కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన చిత్రమే “రోజులు మారాయి”

మురళీకృష్ణ ముదిదాని తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ చిత్రానికి జి.శ్రీనివాసరావు నిర్మాత. చిత్ర సమర్పకులు దిల్ రాజ్.

నంబూరి రవి మాటలు రాసిన ఈ చిత్రంలో పార్వతీశం, చేతన్, తేజస్వి మదివాడ, కృతిక జయకుమార్, ఆలీ – వాసు ఇంటూరి తదితరులు నటించారు.

కథలోకివెళ్తే ….

పీటర్, అశ్వత్ లు మిత్రులు. పార్వతీశం పీటర్ పాత్రలోనూ, చేతన్ అశ్వత్ పాత్రలోనటించారు.
వీరిద్దరూ తాము ప్రేమిస్తున్న అమ్మాయిలపై బోలెడు ఆశలు పెట్టుకుంటారు. రంభ పాత్రలో నటించిన తేజస్వి అనే అమ్మాయి కోసం పీటర్ తన ఉద్యోగాన్నే వదులుకుంటారు. ఆధ్య పాత్రలోనటించిన కృతికకు సర్వం తానే అనుకుంటాడు అశ్వత్. ఆమెకుకావలసిన అవసరాలు అన్నీ తీరుస్తుంటాడు. అయితే అమ్మాయిలిద్దరూ వీరిని కాక కానీ వేరే వాళ్లను ప్రేమిస్తుంటారు. పీటర్, అశ్వత్ లను తమ అవసరాలకోసం అమ్మాయిలు వాడుకుంటారు.

ఇంతలో ఇలా రోజులు సాగుతుండగా అమ్మాయిలకు తమ భవిష్యత్తు తెలుసుకోవాలని ఒకరిని కలుస్తారు. వాళ్లకు కాబోయే భర్తలు పెళ్లయిన మూడు రోజులకే చనిపోతారని అతను చెబుతాడు. దీంతో పీటర్, అశ్వత్ లను పెళ్లి చేసుకుని, వాళ్లిద్దరూ చనిపోయిన వెంటనే తాము ప్రేమిస్తున్న అబ్బాయిలతో స్థిరపడిపోవాలని అమ్మాయిలు అనుకుంటారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా అమ్మాయిలు అనుకున్నట్టు కథ సాగిందా లేదా? వారిని పెళ్లి చేసుకున్నాక పీటర్, అశ్వత్ నిజంగానే చనిపోయారా? లేక అమ్మాయిలు ప్రేమించిన అబ్బాయిల విషయం ఏమిటి తదితర సంగతులు అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ చిత్రాన్నివెండితెరపై చూడాలి.

హాస్యం పండించడంలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన నటుడిగా ముద్ర వేసుకున్న పార్వతీశం నటన బాగుంది. అమ్మాయిలపై అతను వేసిన సెటైర్లు క్లిక్కయ్యాయి. తేజస్వి నటన కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా పంచ్ డైలాగులు బాగున్నాయి. నవ్వులు తెప్పించాయి. ఆలీ కామెడీ బాగులేదు. కృతిక కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదు అనిపించుకుంది.

ప్రథమార్ధంలో మంచి మలుపులతో సాగుతుంది కథ. కానీ రెండో అర్ధ భాగం చప్పగా సాగింది.

జె.బి సంగీతం ఆహాఓహో అనే స్థాయిలోలేదు.

దర్శకుడు మురళీ కృష్ణ కథను సాగించిన తీరుచూస్తుంటే మారుతి తీరులోనే సినిమాను నడిపించేడా అనిపిస్తుంది.

కాస్సేపు నవ్వుకోవడానికి ఈ చిత్రాన్నిచూడవచ్చు.

Send a Comment

Your email address will not be published.