“వంగవీటి” సినిమాగా ఓకే.!

vangaveeti movieశ్రీరామదూత క్రియేషన్స్ దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా అందించిన రాం గోపాల్ వర్మ చిత్రమే “వంగవీటి” చిత్రంలో సందీప్ కుమార్ , కౌటిల్య, శ్రీతేజ్, వంశీ, నైనా తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవిశంకర్. నిజ జీవితములో జరిగిన సంఘటనలను వెండితెరపై చూపడం రాం గోపాల్ వర్మ ప్రతిభ గురించి ఎవరూ అనుమానించవలసిన పని లేదు. తనకు తెలిసిన నిజాలను తన కోణంలో తీయడం ఆయన ప్రత్యేకత. అందుకే తాను మరొకరి అభిప్రాయంతో రాజీ పడబోను అని చెప్తూ ఉంటారు. ఎవరి అభిప్రాయం వారిది అన్న వర్మకు విజయవాడలో పుట్టి పెరిగిన క్రమంలో అక్కడి రౌడీఇజం మీద అవగాహన లేకపోలేదు. ఈ క్రమంలోనే వర్మ అక్కడి వర్గాలూ, కక్షలూ ఆధారంగా చేసుకుని వంగవీటిని ప్రేక్షకుల ముందుంచారు. కథలోకి వెళ్దాం….

ఆయన పేరు వెంకటరత్నం. అతను ఓ రౌడీ. విజయవాడ మొత్తం అతని గుప్పెట్లో ఉంటుంది. అయితే కాలక్రమంలో వంగవీటి రాధ అనే ఒ చిన్నపాటి రౌడీ. వెంకటరట్నంతో గొడవకు దిగుతాడు రాధ. రాధలోని ధైర్యాన్ని మెచ్చుకుంటూ వెంకటరత్నం అతనికి ఓ ప్రాంతాన్ని చూసుకోమని అంటాడు. కొన్నిరోజులకు వీరి మధ్య అభిప్రాయభేదాలు తారస్థాయికి చేరుతాయి. అది చివరికి వెంకటరత్నాన్ని చంపడం వరకు పోతుంది. ఈ హత్యతో రాధ రౌడీగా నలుగురి నోటా నానుతాడు.

ఇదిలా ఉండగా ఇద్దరు విద్యార్థులు రాధ అండతో చోటా నాయకులుగా ఎదుగుతారు. వారి పేర్లు గాంధి, నెహ్రు. ఇంతలో రాధను అతని ప్రత్యర్ధులు హత్య చేస్తారు. ఆ తర్వాత రాధ తమ్ముడు రంగా నాయకుడవుతాడు. మరోవైపు గాంధీ, నెహ్రు విద్యార్థి నాయకులుగా ఓ స్థాయికి చేరుకుంటారు. ఇది నచ్చని కొందరు రంగా, గాంధి మధ్య లేనిపోని గొడవలు పుట్టిస్తారు. రంగా రత్నకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. రత్నకుమారి పాత్రలో నైనా గంగూలి నటించింది. రంగా అనుచరులు పథకం ప్రకారం గాంధీని హత్య చేస్తారు. ఈ హత్య తర్వాత నెహ్రూ రంగాతో కాస్త చేతులు కలుపుతాడు. తనకున్న బలంతో రంగా ఎమ్మెల్యే అవుతాడు. కానీ నెహ్రూ తమ్ముడు మురళికి రంగాతో సయోధ్య చేసుకోవడం నచ్చదు. వంశీ చాగంటి మురళి పాత్రలో నటించాడు. ఆ సమయంలోనే ఓ కొత్త పార్టీ ఆవిర్భవించి నెహ్రూకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది. ఎన్నికల్లో నెహ్రూ గెలిచి ఎమ్మెల్యే అవుతాడు. ఇదే అదునుగా నెహ్రూ తమ్ముడు మురళి గాంధీని హత్య చేసిన రంగా అనుచరులని అంతమొందిస్తాడు. చంపేస్తాడు. అంతేకాదు, రత్నకుమారికి ఫోన్ చేసి ఆమె భర్తను హత్య చేస్తానని అంటాడు. అయితే రంగా ఏమాత్రం లక్ష్యం తప్పక మురళిని చంపించేస్తాడు. ప్రజాసమస్యలపై నిరాహార దీక్ష చేస్తున్నరంగాని ఓ మంత్రి సహకారంతో నెహ్రూ మద్దతుతో కొందరు రౌడీలు వచ్చి చంపేస్తారు.

రాధా, రంగ పాత్రలలో సందీప్, వెంకటరత్నం పాత్రలో వంశీ, దేవినేని మురళి పాత్రలో వంశీ చాగంటి, గాంధీ పాత్రలో కౌటిల్య, రత్నకుమారి పాత్రలో నైనా నటించారు. సందీప్ నటన అద్భుతం. మిగిలిన వారు కూడా పోటీ పడి నటించారు. కథానాయిక నైనా తన పాత్రకు అన్నివిధాలాన్యాయంచేసింది.

ఎడిటింగూ, మాటలూ గొప్పగా ఉన్నాయి. నటీనటులను ఎన్నుకోవడంలో వర్మ తీసుకున్న జాగర్తలతోపాటు వారిలోని ప్రతిభను రాబట్టడంలోనూ అన్ని విధాల విజయవంతం అయ్యాడు. వంగవీటి అభిమానులకు నచ్చకపోయినా సినిమా సినిమాగా చూసే వారికి ఈ చిత్రం నచ్చితీరుతుంది. ఇందులో సందేహం లేదు.

Send a Comment

Your email address will not be published.