విక్రమసింహ వాయిదా

రజనీకాంత్ ప్రధాన పాత్రలో కోట్ల రూపాయలు కుమ్మరించి ఇంతకుమునుపు మరెవ్వరూ తీయనివిధంగా మన భారతీయ చలన చిత్ర రంగంలో నిర్మించారనుకున్న విక్రమసింహ ముందనుకున్నట్టు ఈ రోజు అంటే మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. కాని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదాపడింది. గతంలోనే అయిదారు సార్లు విడుదల చేసేస్తున్నామని చెప్పి వాయిదా వేసిన ఈ చిత్రాన్ని ఈసారి తప్పకుండా వేసవి విందుగా ఈరోజు అభిమానుల ముందుకు విక్రమసింహ వచ్చేస్తున్నాడు అని ప్రకటనలు గుప్పించడమే కాకుండా ఆడియో సంబరాలలోను వక్తలు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య పనితనాన్ని ఆకాశానికేత్తేసారు. ఇంకేముంది ఇది సూపర్ డూపర్ కన్నా అతీతమని చెప్పేశారు. ప్రకటనలను కూడా హిమాలయాల స్థాయిలో ఆహా ఓహో అని గుప్పించారు. మరి కొన్ని గంటల్లో వచ్చేస్తున్నాడు విక్రమసింహ అని చెప్పి చివరి క్షణంలో విక్రమసింహ ఇప్పుడు రావడం లేదు మరికొన్ని పనులున్నాయి , బహుశా ఈ నెల 23న రావచ్చు అని ప్రకటించారు. 3 డీ టెక్నాలజీ పనులు ఇంకా పూర్తి కాలేదని, కనుక ఫిలిం రిలీజ్ వాయిదా వేయక తప్పలేదని చిత్ర యూనిట్ నుంచి ఒక సందేశం వచ్చింది.

ఆసియన్ సినిమాస్ మల్టీప్లెక్స్ చైన్ ఓనర్ల ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఇప్పుడీ సినిమా తమకో తలనొప్పిగా మారినట్టు చెప్పారు. ఆఖరి క్షణంలో వాయిదా వేయడం వల్ల ముందనుకున్న ఓపెనింగ్స్ ఇప్పుడు ఉంటుందా అనేది ఆలోచించవలసిన విషయమని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్తున్నారు…కానీ అదే రోజు నాగార్జున నటించిన మనం చిత్రం కూడా విడుదల కానున్నదని, విక్రమసింహ మీద ఇప్పటికే ఎన్నో ఆశలు పెట్టుకున్న తాము ఇప్పుడు ఏమనుకోవాలని ఆయన అన్నారు. 3 డీ సమస్య  అని అంటున్నారు కానీ అది నమ్మేటట్లు లేదని ఆయన చెప్పారు.

సౌందర్య నైపుణ్యంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆర్ధిక సమస్యలు కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. మొదటిసారిగా ఇలాంటి అత్యున్నతమైన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి సాహసించిన సౌందర్యను మాత్రమే  తప్పు పట్టడం సరి కాదని కొన్ని వర్గాల అభిప్రాయం.

Send a Comment

Your email address will not be published.