నటనలోను, వాచకంలోనూ తనకంటూ ఒక బాణీని సృష్టించుకున్న కృష్ణంరాజు మొదట్లో విలన్ పాత్రలే పోషించారు. విలన్ గా రాణించి పలువురి మన్ననలు అందుకున్న కృష్ణంరాజు అటుతర్వాత హీరోగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఆ స్థాయిలోనూ మంచి విజయాన్నే చవిచూశారు. ఈ క్రమంలో విలన్ నుంచి హీరోగా ఎదిగి రాణించగలరు అనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కృష్ణంరాజు అని చెప్పుకోవచ్చు.
ఆయన తొలిసారిగా హీరోగా నటించిన చిత్రం చిలకా గోరింకా. ఆ చిత్రంలో కథానాయకుడిగా నటించిన తర్వాత ఆయనకు తరువాత రెండు సంవత్సరాలు ఎలాంటి వేషాలు రాలేదు.
ఇంతలో డూండీ నిర్మించిన నేనంటే నేనే అనే చిత్రంలో ఆయన మళ్ళీ విలన్ గా నటించే అవకాసం వచ్చింది. అప్పుడు ఆయన ఆలోచనలో పడ్డారు. హీరోగా నటించి మళ్ళీ విలన్ గా నటించడమా అని సందిగ్ధంలో పడ్డారు. అయితే కొందరు సన్నిహితులు పరవాలేదు చెయ్యండని ప్రోత్సహించడంతో కృష్ణంరాజు సరేనని విలన్ గా నటించారు. ఆ సినిమా ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆయన అలాగే ఎన్నో సినిమాల్లో నటిస్తూ నటిస్తూ హీరో పాత్రలవైపు ప్రయాణం సాగించారు.
అంతేకాదు ఆయన కొందరు సన్నిహితులతో కలసి కృష్ణవేణి అనే సినిమా నిర్మించారు. అంతే ఆ తర్వాత ఆయన కథానాయకుడిగా వెనుతిరిగి చూడ లేదు. భక్త కన్నప్పతో ఆయన బిజీ బిజీ హీరో అయ్యారు. అంతే కాదు అవార్డులూ రివార్డులు కూడా అందుకున్నారు. ఆయన నటనను అందరూ మెచ్చుకున్నారు.