వివాదాలతో జారిపోతున్న అంజలి కెరియర్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో పదహారణాల తెలుగు పడుచు గా ప్రేక్షకుల్ని మెప్పించి మెరిపించిన కధానాయిక అంజలి. పెద్ద బావని గుడ్డిగా ప్రేమించే అందమైన అమాయక మరదలు పిల్లగా, మావయ్య గారి మాట కోసం ఆ బావని కాదని ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోడానికి సిద్దమైన గడసరి పిల్ల గా ఆ చిత్రంలో అంజలి తన నటన తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దిల్ రాజు నిర్మాణంలో మహేష్ బాబు, వెంకటేష్, సమంతా, అంజలి, ప్రకాష్ రాజు, జయసుధ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా ఘన విజయం సాధించింది.

అంజలి గోదావరి జిల్లాలకు చెందిన స్వచ్చమైన తెలుగు అమ్మాయి. సినిమాలు, నటన మీద ఉన్న ఇష్టంతో పాటు హీరోయిన్ కి కావలసిన అంద చందాలు పుష్కలం గా ఉండటంతో , హైస్కూల్ చదువుకే స్వస్తి చెప్పి ఫిలిం నగర్ కి చేరింది. అయితే ఈ తెలుగు అమ్మాయికి తెలుగు లో అవకాశాలు రాలేదు. దాంతో అంజలి కొలీవుడ్ కి వెళ్ళింది. తెలుగు అయినా తమిళ చిత్ర పరిశ్రమ అంజలిని చక్కగా ఆదరించింది. హీరోయిన్ గా అంజలికి అక్కడ మంచి అవకాశాలు లభించాయి. తమిళంలో అంజలి నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులోకి డబ్ అవడంతో అంజలి గురించి తెలుగు ప్రేక్షకులకి తెల్సింది. ముఖ్యం గా సురేష్ కొండేటి నిర్మాతగా తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ చేసిన జర్నీ సినిమాతో అంజలికి తెలుగు నాట మంచి పాపులారిటీ వచ్చింది. శర్వానంద్, అంజలి నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అంజలికి తొలిసారి తెలుగులో స్ట్రెయిట్ సినిమాలో నటించే అవకాశం లభించింది. అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

కొన్ని దశాబ్దాల తర్వాత తెలుగులో వచ్చిన మల్టీ స్టార్ మూవీ. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో అంజలి ఒక్కసారిగా తారా పధానికి దూసుకు పోయింది. వెంటనే రవితేజ, శ్రుతిహాసన్ నటించిన బలుపు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం లభించింది. ఆ సినిమా నిర్మాణ దశలో ఉండగా అంజలి జీవితంలో వివాదాలు ప్రారంభ మయ్యాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బలుపు షూటింగ్ జరుగుతుండగా అంజలి చిత్ర యూనిట్ కి, కుటుంబ సభ్యులకి కనపడకుండా అదృశ్యమయ్యారు. హీరోయిన్ అంజలి కిడ్నాప్ అయిందని ఆమె సోదరుడు, పిన్ని కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారు ఫిర్యాదు చేసిన రెండు రోజులకి అంజలీనే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనని ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పి వివాదాన్ని సర్దుబాటు చేశారు. అయితే ఇంతలోనే అంజలి తనని పెంచిన పిన్ని, బాబాయ్ లు డబ్బు కోసం వేధిస్తున్నారని, సంపాదన మొత్తం దోచుకొని, తనకి ప్రాణ హాని కూడా చేయాలని చూస్తున్నారని కేసు పెట్టింది. వీరితో పాటు తమిళ చిత్ర సీమకి తనని తొలిసారి పరిచయం చేసిన ఒక దర్శకుడిపై కూడా కేసు పెట్టింది.

అయితే అంజలి తమపై అన్యాయంగా కేసు పెట్టి తమ పరువు తీసిందని అందుకు క్షమాపణ చెప్పడం తో పాటు అంజలి నష్ట పరిహారం కూడా చెల్లించాలని ఆ దర్శకుడు, పిన్ని చెన్నైలో కేసు వేశారు. అందుకు సమాధానం ఇవ్వాలని కోర్టు అంజలి కి ఎన్నిసార్లు సమన్లు పంపినా ఆమె హాజరు కాలేదు. ఈ వివాదాల నడుమ విడుదల అయిన బలుపు చిత్ర ఫలితం అంజలిని తీవ్రంగా నిరాశ పరిచింది. పైగా సీతమ్మ వాకిట్లో ఉన్నంత ఫ్రెష్ గా బలుపు లో లేదని, గ్లామర్ తగ్గిందని అందరూ కామెంట్ చేశారు.

బలుపు తర్వాత మరో మల్టీ స్టార్ సినిమా మసాలా లో వెంకటేష్ పక్కన హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఫలితం రాకముందే మరోసారి అంజలి పిన్ని, బాబాయిలపై కేసు వేసి వివాదాల్లో ఇరుక్కున్నారు. మసాలా చిత్రం సూపర్ హిట్ కాక పోయినా ఒక మాదిరి సినిమా అని పేరు వచ్చింది. అయితే అంజలికి మాత్రం ఈ సినిమాలో ఫెయిల్ మార్కులు పడ్డాయి. మరీ లావు కావడం, ఫేసులో సున్నితత్వం లేదని ముదురుగా కనిపిస్తోందని ఎక్కువ మంది ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. అంజలి మల్లీ కోర్టు వివాదాల్లో ఇరుక్కోవడం తో ఆమెని తీసుకోడానికి నిర్మాతలు జంకుతున్నారు. సూపర్ హిట్ లు వచ్చినప్పుడు కెరియర్ ని ప్లాన్ చేసుకోకుండా వివాదాల్లో ఇరుక్కోవడం వల్లనే అంజలి సినిమా జీవితం పతనం అవుతున్నదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Send a Comment

Your email address will not be published.