వెంకటేష్ ‘గురు’

విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ఇంకొక రీమేక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

Guru movieఅతనితోపాటు రితికా సింగ్, ముంతాజ్ సర్కార్, నాజర్, జాకీర్ హుస్సేన్, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా సుధ కొంగర దర్శకత్వం వహించి కథనూ అందించారు. మాటలు హర్షవర్ధన్ రాసారు. సుధ కొంగర, సునంద, మాధవన్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. శశికాంత్ నిర్మించిన చిత్రమిది.

కథలోకొస్తే, ఆదిత్య పాత్రలో నటించిన వెంకటేష్ ఓ బాక్సింగ్ కోచ్. అతను ఏదీ దాచుకోక ముక్కుసూటిగా పోయె మనిషి.

ఈ క్రమంలో అతను తన కోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. బాక్సింగ్ సంఘంలోని రాజకీయాలతో అతనిని ఢిల్లీ నుంచి వైజాగ్ కి బదిలీ చేస్తారు. అప్పుడు తన శక్తేమిటో రుజువు చేసుకోవడానికి చూస్తున్న వెంకటేష్ కి రామేశ్వరి పాత్రలో నటించిన రితికా సింగ్ ఎదురవుతుంది.

ఆమె కూరగాయలు అమ్ముకుని రోజులు గడిపే ఓ పేద పిల్ల. అయితే ఆమెలోని ప్రతిభ పట్టుదల వెంకటేష్ గమనిస్తాడు. దానితో ఆమెకు బాక్సింగ్ లో శిక్షణ ఇస్తాడు. వీరి మధ్య ఎన్నో ఒడిదొడుకులు చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమించి వెంకటేష్ ఆమెను ఓ ఛాంపియన్ గా ఎలా తీర్చిదిద్దాడు అన్నదే చిత్ర కథ.

ఓ కోచ్ తన స్టూడెంట్ కోసం ఎంతలా తపిస్తాడు అన్నది ఈ చిత్రంలో మరోసారి చూడవచ్చు. ఈ చిత్రంలో వెంకటేష్, రితికా పాత్రలు అత్యంత ప్రధానమైనవి.

ఈ కథను ఆసక్తికరంగా నడపడంలో సుధా కొంగర విజయవంతమయ్యారు.

హీరో పాత్రను పరిచయం చేయడంలోనే సుధా ఆహా అనిపించారు. రితికా కూడా చక్కగా నటించి తన పాత్రకు అన్నివిధాలా న్యాయం చేసారు.
ప్రధమార్థంలో మలుపులు బాగున్నాయి. ద్వితీయార్దంలో కథనం కాస్త గాడి తప్పినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ఉద్వేగపూరితమైనవి. మనసుల్ని కట్టిపడేస్తాయి అనడంలో సందేహం లేదు.
తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర లేదు.

సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం బాగుంది.

హర్షవర్ధన్ రాసిన డైలాగులు చక్కగా కుదిరాయి. నిర్మాణం ఓకే. మొత్తం మీద ఓ మహిళా దర్శకత్వం (సుధ) నుంచి ఓ మంచి చిత్రం రావడం ముదావహం.
ప్రేక్షకుల మనసులను గెలవడంలో గురు శిష్యుల పాత్రల్లో వెంకటేష్, రితికా అన్ని విధాలా రాణించారు.

Send a Comment

Your email address will not be published.