వెండితెరపై "మరో సావిత్రి"

soundarya_01“కొందరి జీవితాలకు దేవుడెందుకు ఇలా అర్ధంతరంగా ముగింపు పలుకుతాడు …. తనకు ఆడుకోడానికి ఇంకెవరూ దొరకలేదా…జనంమధ్య ఉన్న ఓ అందాల బొమ్మను ఇట్టాగేనా తన దగ్గరకు తీసుకుపోవడం” అని ఇలా బోలెడు మాటలతో దేవుడిపై నానామాటలు అనుకున్నారు ఆదుర్వార్త చెవిన పడగానే అనేకులు.

ఊహకందని రీతిలో ఓ వైమానిక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ నటి సౌందర్య ఇక లేరు అన్నవార్త తెలియడంతోనే బాధపడ్డ వారెందరో లెక్కే లేదు. ఏమిటీ సౌందర్య ఇక లేదా? సౌందర్య మరణించిందా..? అని షాకయ్యారు.

ఇంతటి చేదువార్త జరిగి పన్నెండేళ్ళు దాటింది ఇప్పటికి…

“సౌందర్య”.సౌoదర్యని తెలుగిoటి ఆడపడుచుగా ఆంధ్రాభిమానులు ఆదరిoచారు.ఆమెను జూనియర్ సావిత్రి అని పిలిచే వారు. అందానికి మారుపేరైన సౌoదర్యకు “నవరసనటన మయూరి” అనే బిరుదు కూడా ఉంది.

పన్నెండేళ్ల సినీ జీవితంలో వందకు పైగా చిత్రాల్లో నటించి మంచి పాత్రలు చేసిన అందాల తారగా పేరుప్రఖ్యాతులు గడించిన సౌందర్య 1971 జూలై 17వ తేదీన జన్మించారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం భాషా చిత్రాల్లో నటించిన సౌందర్య స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే వెండితెరకు పరిచయమయ్యింది. 1992 లో ఓ కన్నడ చిత్రంలో ఆమెకు నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం పేరు గంధర్వ. అప్పుడు ఆమె ఎం బీ బీ ఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి మిత్రుడు ఒకరు సౌందర్యకు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. ఆమె చదువు మానేసి అమ్మోరు అనే చిత్రంతో విజయవంతమైన నటిగా సినీ రంగంలో ఓ వెలుగు వెలిగారు.

నిజానికి ఆమె పుట్టిపెరిగింది కర్ణాటకలో అయినప్పటికీ టాలీవుడ్ తో సౌందర్యకు ఎనలేని సంబంధం ఉంది. ఆమె తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశారు. టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇలా అగ్రశ్రేణి హీరోలతో నటించిన సౌందర్య బాలీవుడ్ లోనూ నటించకపోలేదు. అంతేకాదు నిర్మాతగా ద్వీప అనే కన్నడంలో ఒక చిత్రాన్ని నిర్మించి అందులో నటించారు కూడా. ఈ చిత్రానికి గిరీష్ కాసారవల్లి దర్శకులు. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది కూడా. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోవడంతోపాటు స్వర్ణకమలం అందుకుంది. కర్ణాటకలోనూ ఉత్తమ నటిగా, ఉత్తమ చిత్రంగా ఈ గంధర్వ చిత్రం ఆమెకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలోను ఈ చిత్రాన్నిప్రదర్శించారు. ఆమె నటించిన ఆఖరి చిత్రం ఆప్తమిత్ర కూడా విజయవంతమైంది. ఆమె సినీరంగానికి చేసిన సేవలకు గుర్తుగా కర్ణాటకలో ప్రతి ఉగాది పండగ సమయంలో ఆమె పేరిట సౌందర్య మెమోరియల్ అవార్డుని కర్ణాటాంద్ర లలిత్ కళా అకాడెమీ ఇవ్వడం విశేషం.

ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ సినీ రచయిత అయినా కేఎస్ సత్యనారాయణ్ కుమార్తె సౌందర్య దక్షిణాది భాషా చిత్రాల్లోదాదాపుగాఅందరు హీరోలతోనూ నటించారు. కమల్ హాసన్, రజనీకాంత్, మోహన్ లాల్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవిచంద్రన్, విష్ణువర్ధన్, అమితాబ్ బచ్చన్ తదితరులతో నటించిన సౌందర్య తన కెరీర్ లో ఆరు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న సౌందర్య 1994 లో అమ్మోరు, 1998 లో అంతఃపురం, 1999 లో రాజా, 2002 లో ద్వీప చిత్రాలలో ఆమెను ఈ అవార్డు వరించింది. ద్వీప చిత్రంలో ఉత్తమ నటిగానే కాకుండా ఉత్తమ నిర్మాతగా కూడా అవార్డు అందుకున్నారు. హిందీలో ఆమె అమితాబచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించారు.
హీరో విక్టరీ వెంకటేశ్ సరసన రాజా, జయం మనదేరా, పెళ్ళి చేసుకుందాం, పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలందుకున్నారు. వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపు పొందారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక నందీ అవార్డు కూడా పొందిన సౌందర్య 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేశారు. ఆ యేడాది ఏప్రిల్ 17 వ తేదీన బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి తెలంగాణారాష్ట్రంలోని కరీంనగర్‌ లో పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) గా ఎన్నికల గోదాలో ఉండిన విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరానాథ్ ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని క్షణాలకే అక్కడికి దగ్గర్లోనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణలో కుప్పకూలిపోవడంతో సౌందర్య సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం జరిగిన ఏడాది క్రితమే సౌందర్యకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీ ఎస్ రఘుతో 2003 ఏప్రిల్ 27 వ తేదీన పెళ్లయ్యింది.

సౌందర్య ‘అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ద్వారా తన భర్త, ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు కూడా చేపట్టారు. కర్నాటక, ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి పరచారు. ఒక అనాధాశ్రయాన్ని, ఒక పాఠశాల ‘అమర సౌందర్య విద్యాలయ’ పేరుతో నెలకొల్పారు. తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సౌందర్య జీవితం ఆకస్మికంగా ముగుస్తుందని ఎవరూ అనుకోలేదు.

సౌందర్య మృతి తరువాత ఆస్తుల పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో సౌందర్య 2003 ఫిబ్రవరి 15న ఒక వీలునామా రాశారని, ఆ వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చెయ్యాలని అమరనాథ్ భార్య నిర్మల 2009లో బెంగలూరు లోని మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదప్రతివాదాలు జరిగాయి. వివాదాలతో కోర్టు చుట్టూ తిరిగి . 2013 డిసెంబర్ 3 వ తేదీన రాజీకి వచ్చారు. ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి రావడంతో ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది.
———————————–
సిరి చందన

Send a Comment

Your email address will not be published.