శకుంతల కన్నుమూత

“ఈతరం సూర్యకాంతం” గా వినుతికెక్కిన తెలంగాణా శకుంతల జూన్ 13వ తేదీ రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో తన నివాసంలో గుండెపోటు రావడంతోనే నారాయణ హృదయాలయానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

మహారాష్ట్ర కుటుంబంలో పుట్టిన శకుంతల హైదరాబాద్ లో స్థిరపడి అనతికాలంలోనే నటిగా విశేష ఆదరణ పొందారు. తెలంగాణా యాసలో మాట్లాడుతూ ఆమె తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. పంచ్ డైలాగులు చెప్పడంలో ఒక వొరవడిని ప్రదర్శించి ఆమె టాలీవుడ్ లో క్యారక్టర్ నటిగా హర్షద్వానాలు అందుకున్నారు.

ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్ కాగా తల్లి గృహిణి. ఆమెకు ఒక అక్కయ్య, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు.
ఆమెకు అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ లేరు. నలుగురు అక్క చెల్లెలలో ఆమె రెండవ ఆమె. చిన్నప్పటి నుంచీ ఆమెకు భయం అంటే ఏమిటో తెలియదు. లాగూ చొక్కా వేసుకునే తిరుగుతుండే వారు. సిగరెట్ అట్టముక్కలు ఒక జేబులోను, మరొక జేబులో గోలీలు వేసుకుని అబ్బాయిలకు సమానంగా ఆడేవారు. అలాగే గిల్లీ దండా కూడా ఆడేవారు.

ఒసేయ్ రాములమ్మ, నువ్వు నేనూ, ఒక్కడు, వీడే, అహనా పెళ్ళంట, గులాబీ, భద్రాచలం, బెండు అప్పారావు ఆర్ ఎం పీ తదితర చిత్రాలలో నటించారు. తదితర చిత్రాలు ఆమెకు ఎనలేని పేరు తెచ్చిపెట్టాయి.

ఆమె తమిళంలోనూ (ధూల్ తదితర చిత్రాలు) నటించారు.

ఆమె మొదటిసారిగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఒక నాటకంలో వేసారు. ఆ తర్వాత ఆమె అనేక నాటకాలలో నటించారు.

ఆమె నటించిన తొలి చిత్రం మా భూమి. ఈ చిత్రాన్ని గౌతమ్ ఘోష్ డైరెక్ట్ చేసారు. ఆమె నటించిన ఆఖరి చిత్రం పాండవులు పాండవులు తుమ్మెద (2014). ఆమె మొత్తం 74 చిత్రాలలో నటించారు.

నువ్వు నేను అనే చిత్రంలో “నీ తల్లి” అనే డైలాగుతో ఆమె అందరి నోటా నానారు. ఇది దర్శకుడు తేజ చిత్రం.

ఆమె అటు తెలంగాణా యాసలోను, ఇటు రాయలసీమ యాసంలోను సునాయాసంగా మాట్లాడగల నటిగా వినుతికెక్కారు.

ఒక్కడు చిత్రంలో ప్రకాష్ రాజ్ తల్లి పాత్రలో ఆమె నటించారు. అలాగే నువ్వు నేను చిత్రంలో తనికెళ్ళ భరణికి సోదరిగా నటించారు. ఈ రెండు పాత్రల్లోనూ ఆమె ఎంతగా విజయవంతమయ్యారో వేరేగా చెప్పక్కరలేదు.

1980 లో ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారం లభించింది.

Send a Comment

Your email address will not be published.