శర్వానంద్, నిత్యా మీనన్ ల ఓ ప్రేమ గీతం

గమ్యం, ప్రస్థానం, సత్య 2 వంటి చిత్రాల్లో సీరియస్ రోల్స్ తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న శర్వానంద్ ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్టుతో బిజీ బిజీగా ఉన్నారు.

నిత్యా మీనన్, శర్వానంద్ జంటగా నటిస్తున్న ఒక చిత్రం షూటింగ్ శరవేగంతో సాగుతోంది. ఓనమాలు చిత్రానికి దర్శకత్వం వహించి పేరు ప్రఖ్యాతులు పొందిన క్రాంతి మాధవ్ ఇప్పుడు శర్వానంద్ నటిస్తున్న ఈ కొత్త చిత్రానికి దర్శకత్వం చేపట్టారు. ఈ చిత్రం మొదటి పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖాయం చెయ్యలేదు.

ఈ చిత్ర నిర్మాత కె ఎస్ రామారావు మాట్లాడుతూ “మా బ్యానర్ కింద చాలా కాలం తర్వాత వస్తున్న మంచి చిత్రం ఇది. దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని ఒక అందమైన ప్రేమ గీతంలా చిత్రీకరిస్తున్నారు. వైజాగ్, భీమ్లీలలో తొలి పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసాము. హీరో, హీరోయిన్లపై కొన్ని సీన్లు ప్రత్యేకించి చిత్రీకరించడానికి ఒక సెట్ ను దాదాపు యాభై లక్షల రూపాయలతో తీర్చిదిద్దాము.  ఈ చిత్రంలో అది ఒక హైలైట్ అవుతుంది. తొలి పార్ట్ చిత్రీకరణలో ఒక పాట కూడా ఉంది ” అని అన్నారు.

ఇదొక ఉన్నతమైన ప్రేమ కథా చిత్రమని, ఫ్యామిలీ సెంటిమెంటుతో కథ సాగుతుందని దర్శకుడు  క్రాంతి మాధవ్ వివరించారు. తొలి పార్ట్ చిత్రీకరణ ఎంతో తృప్తినిచ్చిందని అన్నారు.

ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

జ్ఞానశేఖర్ సినీమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

Send a Comment

Your email address will not be published.