సంపత్ నంది బిజీ బిజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నానని దర్శకుడు సంపత్ నంది చెప్పారు.

కొంత కాలం క్రితం సంపత్ నంది పేరు సినీ వర్గాల్లో మారుమోగుతుండేది. పవన్ కళ్యాన్ నటించే గబ్బర్ సింగ్ – 2 చిత్రానికి సంపత్ దర్శకత్వం వహించబోతున్నారని. ఆ ప్రాజెక్ట్ కోసం సంపత్ దీర్ఘ కాలం నిరీక్షించినా అది అనుకున్నట్టు కార్యరూపం దాల్చకపోవడంతో సంపత్ మరో దారి చూసుకోవలసి వచ్చింది.

అయితే ఆయన పవన్ తో తరచూ టచ్ లోనే ఉంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ఆయన కోసం సంపత్ ఒక స్క్రిప్ట్ కూడా తయారు చేస్తున్నారు.

రవితేజ, రాశి ఖన్నా జంటగా నటించిన బెంగాల్ టైగర్ చిత్రానికి సంపత్ దర్శకత్వం వహించారు.

పవన్ కళ్యాన్ తో టైం గడిపిన సందర్భాలతో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పిన సంపత్ నంది బెంగాల్ టైగర్ బాగా ఆడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఎనిమిది సంవత్సరాల క్రితం టాస్ అనే సినిమాకు మాటల రచయితగా పని చేసిన సంపత్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో కలిసి కొంతకాలం బెంగళూర్ లో వర్క్ చేసారు. అప్పట్లో టాస్ చిత్రం దాదాపు 95 శాతం పూర్తి అయ్యింది. అది తెలుగులోనూ, కన్నడంలోనూ విడుదల చేయాలని తలచిన చిత్రం. కానీ అది పూర్తి కాకపోవడమే కాదు కదా విడుదల కూడా కాలేదు. అప్పట్లో బెంగళూరులో ఓ గదిలో టీవీ , ఫ్యాన్ తో దాదాపు రెండేళ్ళు గడిపారు సంపత్ నంది. అందరూ వెళ్ళిపోయినా ఆఫీస్ గదిలో ఆయన ఒక్కరే ఉండేవారు. అప్పట్లోనే ఆయనకు తన గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లి కూడా అయ్యింది. తన ప్రాజెక్ట్ బయటకు రాకపోవడంతో ఆయన అత్తవారింటి వాళ్ళు చాలా ఆందోళన చెందారు.

సంపత్ నంది మొదటి చిత్రం “ఏమైంది ఈ వేళ” చిత్రం విడుదల అయ్యే వరకు దాదాపు రెండేళ్ళు ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఏమైంది ఈ వేళ చిత్రం లో బడ్జెట్ చిత్రమని, అయితే అది హిట్ కొట్టడంతో తనకు మరో ఆఫర్ వచ్చిందని, అది రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రం కావడంతో మళ్ళీ లైంలైట్ లోకి వచ్చానని సంపత్ నంది చెప్పారు.

ఇప్పుడు రవితేజ నటించిన బెంగాల్ టైగర్ చిత్రం విభిన్నమైన కొత్త సబ్జెక్ట్ అని సంపత్ అన్నారు. ఈ సబ్జెక్ట్ కి అన్ని విధాల సరిపోయిన నటుడు రవితేజ అని, ఆయన నటన అద్భుతమని సంపత్ చెప్పారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో కథానాయికలు రాశి ఖన్నా, తమన్నాలను రవితేజ ఒకేసారి పైకెత్తడం అమోఘమని, అలాంటి నటన మరెవరు చేయలేరని ఆయన నవ్వుతూ తెలిపారు.

Send a Comment

Your email address will not be published.