సకుటుంబంగా చూడదగ్గది

శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే మంచి చిత్రాలకు పెట్టింది పేరుగా అనిపిస్తుంది. అందులోను ప్రిన్స్ మహేష్ బాబు, సమంతా, కాజల్ లతో తీసిన చిత్రం “బ్రహ్మోత్సవం” గురించి వేరేగా చెప్పక్కర లేదు. ప్రణీత, సత్యరాజ్, రావు రమేష్, జయసుధ, రేవతి, నరేష్, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు. శ్రీకాంత్ అడ్డాల రచన, దర్శకత్వం చేపట్టిన బ్రహ్మోత్సవం చిత్రాన్ని పెర్ల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె నిర్మించారు. గోపీసుందర్ నేపథ్య సంగీతంతో అదరగొట్టారు.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మోత్సవం చిత్రాన్ని ఓ పండగలా చెప్పుకోలేము.

కథలోకి వస్తే, అదొక పెయింటింగ్ కంపెనీ. దాని యజమానిగా సత్యరాజ్ నటించారు. అతను ఎంతో కష్టపడి వృద్ధిలోకి వచ్చిన వ్యక్తి. వందల రూపాయల మూలధనంతో వ్యాపారం మొదలుపెట్టి కోట్ల రూపాయలు గడిస్తాడు. అతను తన భార్య సోదరులను, వారి కుటుంబాలను చేరదీసి వారికి అన్నీ తానేగా ఉంది ఆలనాపాలనా చూస్తాడు. ఎప్పుడైనా సరే తన చుట్టూ అందరూ ఉండాలనుకునే మనసు. కానీ అతని బావమరుదుల్లో ఒకరుగా నటించిన రావు రమేష్ అతనిని మరోలా అర్ధం చేసుకుంటాడు. అతనికి తన బావ దగ్గర ఉండటం ఇష్టం ఉండదు. తన కూతురిని అతని కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ ఆ కొడుకు పాత్రలో నటించిన మహేష్ బాబు మరో అమ్మాయితో కలిసి మెలసి తిరుగుతుండటం తెలిసి అతను సహించలేకపోతాడు. ఓమారు తండ్రీ కొడుకులిద్దరినీ గట్టిగా తిడతాడు. ఆ మాటలు భరించలేక ఆ తండ్రి ప్రాణం విడుస్తాడు. అయితే కొడుకు తన మామయ్యలోని అపార్థాన్ని తప్పించి తన తండ్రిలోని ఉన్నత భావాలను అతనికి చెప్పడం కోసం చేసే ప్రయత్నంగా బ్రహ్మోత్సవం చిత్ర కథ సాగుతుంది.

శ్రీకాంత్ అడ్డాల కథలు కుటుంబపరంగా సెంటిమెంట్స్ తో ముడిపడి ఉంటాయి. అందులోనూ విలువలకు ప్రాధాన్యమిస్తాయి. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ కూడా ఆ కోణంలోనే సాగే కథ. కానీ ఈసారి అడ్డాల కాస్తంత విఫలమయ్యేరా అనిపిస్తుంది. ఎంచుకున్న కథనం బాగానే ఉంది. కానీ అంచనాలకు తగినట్టు దాన్ని నడిపించడంలో ఓ మెట్టు తక్కువలోనే ఉండిపోయారు అడ్డాల. కొన్ని చోట్ల కథ చాలా నెమ్మదిగా సాగి విసుగు పుట్టించేలా ఉంది. ప్రధమార్ధంలో కొన్ని సన్నివేశాలు ఈ చిత్రానికి ఆయువుపట్టు. అలాగే
క్లైమాక్స్ కూడా బాగుంది. అయితే ఈ రెండింటి మధ్య సాగిన కథే ప్రేక్షకులను అయోమయంలో పడేసింది. ఇంటర్వెల్ తర్వాత అనుకున్నంత గొప్పగా లేకపోవడంతో సహనం నశిస్తుంది.

నటన విషయానికి వస్తే మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. అతని నటన అమోఘం. అతని సరసన కాజల్, సమంత చక్కగా ఉంది. అలాగే రావురమేష్ కూడా గొప్పగా నటించి తన పాత్రకు తగు న్యాయం చేసాడు. జయసుధ, రేవతి, తనికెళ్ల భరణి తదితరులు కూడా బాగా నటించారు.

సంగీతంతో పాటు సాహిత్యం బాగుంది. మిక్కీ స్వరపరచిన పాటలు వినసొంపుగా ఉన్నాయి.

ఈ చిత్రానికి ఓవరాల్ గా యాభై శాతం మార్కులు ఇవ్వవచ్చా అనేది ఆలోచించాల్సిందే.

Send a Comment

Your email address will not be published.