సమంతా అంటే అందరికీ ఇష్టం

Nagarjunaనాగచైతన్యతో పెళ్ళికాకముందే నుంచే సమంతా తమకు బాగా పరిచయమని, నిజం చెప్పాలంటే సమంతా తమ కుటుంబసభ్యులలో ఒకరని కథానాయకుడు అక్కినేని నాగార్జున చెప్పారు. కనుక తనకొచ్చిన మావగారనే కొత్త హోదా వల్ల తనలో పెద్దగా మార్పేమీ చోటుచేసుకోలేదని ఆయన అన్నారు. సమంతా అంటే తమ ఇంట అందరికీ ఎంతో ఇష్టమని కూడా ఆయన తెలిపారు. గతంలో సమంతా తనను నాగ్ సార్ అని పిలిచేదని, ఇప్పుడు బాబా అంటోదని అన్నారు. సమంతా తమ కుటుంబసభ్యులలో ఒకరవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అయినా నాగచైతన్య, సమంతా హ్యాపీగా ఉండడం తనకవసరమని, పిల్లల సంతోషమే తన సంతోషమని చెప్పారు.

కొడుకులిద్దరూ (నాగచైతన్య, అఖిల్) తమ కెరీర్ లో ఎంతగానే కృషి చేస్తున్నారని, వారిద్దరూ తన నీడ నుంచి ఇవతలకు వచ్చి నిలబడాలనే తపనతో శ్రమిస్తున్నారని, ఇద్దరూ మంచి కుర్రాళ్ళవడం ఆనందంగా ఉందని చెప్పారు.
తమ ముగ్గురు మధ్య కెరీర్ పరంగా ఆరోగ్యకరమైన పోటీ ఉండడం ప్రధానమని, తానిప్పుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి కొత్త ప్రాజెక్టుకోసం షూటింగ్ మొదలుపెట్టానని, మూడు నెలల క్రితం వర్మ తన దగ్గరకు వచ్చినప్పుడు పక్కా స్క్రిప్ట్ తో తన వద్దకు రమ్మని స్పష్టంగా చెప్పానని, అలాగే ఆయన స్క్రిప్ట్ తో వచ్చి మిగిలిన ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టి వర్మ తన సినిమాపై మాత్రమే దృష్టిపెట్టడం నచ్చిందని నారాగర్జున అన్నారు. ఈ కొత్త సినిమా చేయడానికి కారణం ఇలా తాను షరతు పెట్టడమే అని చెప్పారు.

తామిద్దరం కలిసి చేస్తున్న ఈ కొత్త చిత్రం వర్మకు శివ చిత్రాన్ని తలపించే రోజులు వస్తాయన్న నమ్మకం తనకుందని అన్నారు. వర్మ స్క్రిప్ట్ చూపినప్పుడు కథలో ఎన్నో ఎమోషన్స్, ఫీలింగ్స్ తనను ఈ కొత్త సినిమా చేయడానికి సమ్మతింపజేసాయని అన్నారు. ఈ చిత్రానికి శారీరకంగా ఎంతో కృషి అవసరమేమో అని అడిగిన ప్రశ్నకు నాగార్జున జవాబిస్తూ దేవుడి దయ వల్ల తాను వంద శాతం శారీరక ఫిట్ నెస్ కలిగి ఉన్నానని అన్నారు. కనుక శారీరకంగా ఎంతకైనా శ్రమిస్తానని, అందులో ఏ సమస్యా లేదన్నారు. ఇప్పుడు చేస్తున్న ఈ కొత్త చిత్రం ఒక్క షెడ్యూల్ లోనే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా అని అడగ్గా అబ్బే లేదని జవాబిచ్చారు. ఓ పది రోజుల షూటింగ్ తర్వాత బ్రేక్ ఇచ్చి తన కుమారుడు అఖిల్ తాలూకు హలో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకోవాల్సి ఉందని చెప్పారు. అలాగే ఆ చిత్రం తాలూకు మార్కెటింగ్ వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి ఉందని తెలిపారు. ఆ చిత్రానికి తానే నిర్మాత అని చెప్పారు.

ఇటీవలే నాగార్జున తన యాభై ఎనిమిదో పుట్టింరోజును కుటుంబసభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంలో తానూ, తన సోదరుడు కలిసి తమ తల్లిదండ్రులను ఎంతగానో గుర్తు చేసుకున్నామని అన్నారు. వయస్సు పెరిగే కొద్దీ మన మూలాల గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెడతామని అన్నారు. ఈ క్రమంలో తానేమీ వయోభారాన్ని పెద్ద బరువనుకోనని చెప్పారు.

నాకు జీవితం ఇప్పటికే ఎంతో ఇచ్చిందని, ఆనందంగా ఉన్నానని, తమ పిల్లలు తమ కెరీర్ లో బాగానే కొనసాగుతున్నారని, తాను చలనచిత్రరంగానికి వచ్చి ఇప్పటికే ముప్పై సంవత్సరాలుపైనే అయినా ఇంకా కొనసాగడం ఆనందమేనని, అఫ్ కోర్స్ అక్కడక్కడా కొన్ని అసంతృప్తులు ఉన్నప్పటికీ అలాంటివి లేకుంటే జీవితం బోరు కొడుతుందని, జీవితం మంచి చెడులమయమని అన్నారు.

Send a Comment

Your email address will not be published.