సవ్యసాచి ఎల్ వీ ప్రసాద్

బస్తా ధాన్యం రెండున్నర రూపాయలు కావడంతో తన తండ్రి దివాళా ప్రకటించబోతున్నారని తెలిసిన ఎల్ వీ ప్రసాద్ అన్నేళ్ళు గౌరవంగా బతికిన తమకు అది నామోషీగా భావించారు. 1930 లో మన ప్రాంతం నుంచి బయలుదేరి తిన్నగా బొంబాయి వెళ్లి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో నిలుచున్న వ్యక్తి ఆయన. రెండు భాషల సవ్యసాచిగా సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు ఎల్ వీ ప్రసాద్. అకడమిక్కుగా డిగ్రీలు లేకపోయినా గ్రామాల్లో డ్రామాల్లో నటించిన అలవాటు, సినిమాలు చూడటం, అప్పుడప్పుడు ఇంటికొచ్చి హీరోలలాగా గంతులు వేసిన ఆయన ఎలాగైనా వెండితెర చరిత్రలో నిలదోక్కుకోవాలన్న పట్టుదలతో బొంబాయి చేరుకొని ఇంపీరియల్ కంపెనీలో చేరారు. పృధ్వీరాజ్ వంటివారితో పరిచయం కలిగింది. కొద్ది రోజులకే హెచ్ ఎం రెడ్డి కూడా పరిచయమయ్యారు. అప్పట్లో తమిళంలో తీసిన సావిత్రి సినిమాలో ఎల్ వీ ప్రసాద్ ఒక వేషం వేసారు. ప్రహ్లాద్, సీతాస్వయంవరం వంటి చిత్రాల్లోను నటించిన  ఆయన తెనాలి రామకృష్ణ సినిమాతో స్థిరపడ్డారు. గృహప్రవేశం అనే చిత్రానికి హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించిన ఎల్ వీ ప్రసాద్ పల్నాటి యుద్ధం సినిమాకు దర్శకత్వ భాద్యతలు  చేపట్టారు. కొంతకాలానికి మద్రాసులో వాహినిలో చేరిన తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు. 1954 లో సొంతంగా సినిమా తియ్యాలనుకుని ఇలవేల్పు తీసారు. ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. హిందీలో ఎల్ వీ ప్రసాద్ సొంతంగా తీసిన చిత్రం శారద. ఈ చిత్రంలో రాజ్ కపూర్, మీనాకుమారీ నటించారు. ఇలా అనేక హిట్ చిత్రాలు తీసిన ఎల్ వీ ప్రసాద్ సినీ పరిశ్రమకు దక్కిన ఉన్నత వ్యక్తి.

Send a Comment

Your email address will not be published.