సాహసం శ్వాసగా సాగిపో

Sahasam-Swasaga Sagipo Movieగౌతమ్ వాసుదేవ్ మీనన్ రచనా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ ! అక్కినేని నాగచైతన్య, మాంజిమా మోహన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్
సంగీతం సమకూర్చారు. మిర్యాల రవీందర్ రెడ్డి చిత్రాన్ని నిర్మించారు.

బాబా సెహగల్, డేనియల్ బాలాజి, రాకేందు మౌళి తదితరులు నటించిన ఈ చిత్ర కథలోకి వెళ్దాం….

ఎంబీఏ పూర్తి చేసిన నాగచైతన్య తన మిత్రులతో సరదాగా కాలం గడిపేసే యువకుడిగా నటించాడు. ఇంతలో తన ఇంటికి వచ్చిన చెల్లెలి స్నేహితురాలిని చూసి మనసుపారేసుకుంటాడు చైతూ.
ఆ అమ్మాయి కొన్ని రోజులకు అతని ఇంట్లోనే పేయింగ్ గెస్టుగా ఉంటుంది. దీనితో వీరి మధ్య స్నేహంతోపాటు చనువూ పెరుగుతుంది. ఇద్దరూ అనుకుని ఓ ప్రదేశానికి వెళ్తారు కూడా. కానీ ఇద్దరూ ఇంకా ఇంకా చేరువవుదామనుకున్న తరుణంలో అనుకోని మలుపు తిరుగుతుంది కథ. ఆ క్రమంలో తెలిసిన కొన్ని విషయాలతో వారి జీవితాలలో కొత్త అలజడి మొదలవుతుంది. అయితే ఆ అలజడి కారణం ఏమిటీ…ఆ అమ్మాయి వల్ల తలెత్తిన సమస్యను చైతూ ఎలా అధిగమించాడు అన్నదే కథ. అది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.

ప్రేమ కథలు నడిపించడంలో తనకంటూ ఓ కొత్తదనాన్ని అనుసరించే గౌతమ్ మీనన్ మొదటిసారిగా రొమాన్సూ, యాక్షన్ రెండూ కలగలిపిన కథను ఈ చిత్రంలో చూపెట్టారు. ఈ చిత్రంలో దాదాపుగా మొదటి గంట పాటు ఎక్కువ సన్నివేశాలు రోమాన్సుకే కేటాయించారు. ఈ రోమాన్స్ కథనంలోనే అయిదు పాటలు చిత్రీకరించారు. సంగీతం చాలా బాగుంది. ఆ తర్వాత సినిమా కథంతా యాక్షన్ సన్నివేశాలతో సాగడంతో రోమాన్స్ మూడ్ పోయి సీరియస్ గా చూడాల్సి వస్తుంది. క్లైమాక్స్ బాగుంది.

మొదటి చిత్రాల్లో కన్నా ఈ చిత్రంలో నాగచైతన్య నటనలో కొంత పరిపక్వత కనిపిస్తుంది. అటు రోమాన్స్ యాక్షన్ సన్నివేశాలలోనూ చైతూ నటన బాగుంది.
కథానాయిక మాంజిమా మోహన్ తన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

హీరో స్నేహితుడి పాత్రలో నటినచిన రాకేందు మౌళితో పాటు బాబా సెహగల్, డేనియల్ బాలాజి తదితరులు కూడా తమ పాత్రలకు తగిన రీతిలో న్యాయం చేసారు.

పాటలకే కాకుండా ఏ ఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం చిత్రానికి జీవం పోశాయి అనడం చిన్న మాటే…అంత బాగుంది సంగీతం.

అక్కడక్కడా గౌతం మేనన్ దర్శకత్వ స్థాయి కాస్త తగ్గిందా అని అనిపించినా మొత్తంమీద ఈ చిత్రం చూడదగ్గదే!

Send a Comment

Your email address will not be published.