సినిమాయే కమల్

హ్యాపీ బర్త్డే కమల్ – 7 నవంబర్

ఆయన గురించి విడిగా పరిచయం చేయవలసిన పని లేదు. దక్షిణాదిలోనే కాకుండా భారత దేశంలోని అత్యుత్తమ నటులలో ఆయన ఒకరు. ఆయన రకరకాల పాత్రలతో ఇప్పటికే ప్రేక్షకుల మనసులు దోచుకున్న గొప్ప నటుడు. తానూ చేసే ప్రతి సినిమాతో అబిమానులకు ఏదో ఒక కొత్తదనాన్ని ఇవ్వడానికి కృషి చేసే మహా నటుడు.సినీ పరిశ్రమలోని 24 ఫ్రేముల గురించి సకల అంశాలు తెలిసిన నటుడు. ఆయన మేకప్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటారు కనుకే దర్శకత్వ బాధ్యతలు చేపట్టడానికి అంతగా మక్కువ చూపని నటుడు. అందుకే ఇప్పుడు తాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న కమల్ సినిమా చీకటి రాజ్యం సినిమాకు దర్శకత్వ బాధ్యతలు రాజేష్ ఎం. సెల్వకు ఇచ్చారు. ఆయనకు సినిమాయే ప్రపంచం. ఊపిరి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు మాటలు వస్తూ ఉంటాయి. ఆయన మరెవరో కాదు, జగమెరిగిన ఉన్నత నటుడు కమల్ హాసన్.

కమల్ హాసన్ తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, శ్రీనివాసన్.1954 నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోగల పరమక్కుడిలో పుట్టిపెరిగిన కమల్ హాసన్ ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశమంతటా సుపరిచితులే.

కమల్ చిన్నవయస్సులోనే చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. ఆయన 6 వ నటించిన తొలి తమిళ చిత్రం “కలత్తూర్ కన్నమ్మ”. ఈ చిత్రంతో ఆయనకు ఉత్తమ బాల నటుడిగా అవార్డ్ కూడా లభించింది. . చిన్నతనంలోనే శాస్త్రీయ కళలను నేర్చుకున్న కమల్ కొన్ని చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేసారు. ఆ సమయంలో సుప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కీర్తిశేషులు కె.బాలచందర్ తో కమల్ కు ఏర్పడిన అనుబంధం ఆ తర్వాత గురు-శిష్య బంధంగా మారింది. కొన్ని పాటలు కూడా పాడిన కమల్ కొన్ని చిత్రాలకు ఇటీవల పాటలకు కూడా పని చేశారు.

మహానటులు ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్, ఎస్వీఆర్ నటన, క్రమశిక్షణ తనకు స్పూర్తిదాయకమని చెప్పుకునే కమల్ తమిళంలో ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేషన్,నాగేష్, జెమినీ గణేష్ తదితర దిగ్గజాలతో బాల నటుడిగా నటించాడు.

కమల్ శ్రీదేవి తో కలిసి నటించిన 16 వయదినిలె చిత్రం ఆయనకు 23 ఏళ్ళ వయసులోనే యువ కథానాయకుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. కమల్ హాసన్, శ్రీదేవి జంట ఇరవైకిపైగా చిత్రాలు నటించారు. ఇవన్నీ విజయవంతమయ్యాయి.

1989 లో కమల్ నటించి తమిళంలో విడుదలై అన్ని విధాలా విజయవంతమైన “అపూర్వ సహొదర్గల్” చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు పది కోట్ల రూపాయలను వసూలు చేసిపెట్టడం ఒక రికార్డు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని ఒకటి కన్నా ఎక్కువసార్లు గెల్చుకున్న కమల్ తెలుగులో నటించిన సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకు వరుసగా 1983, 1985 లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడిగా అవార్డులు సంపాదించిపెట్టాయి. మరో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ బహుమతిని కూడా రికార్డు స్థాయిలో అందుకున్న కమల్ ను 1990లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతోను, 2014లో పద్మభూషణ్ తోను గౌరవించింది. 2005లో మద్రాసులోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది.

తొలుత వాణి గణపతి అనే ఆమెను పెళ్ళాడిన కమల్ ఆ తర్వాత సారిక తో కొంతకాలం జీవితాన్ని పంచుకుని శృతి, అక్షర అనే ఇద్దరు అమ్మాయిలకు తండ్రి అయ్యారు. అనంతరం సారికతో విడిపోయి మరో ప్రముఖ తెలుగు నటి గౌతమితో సహజీవనం సాగిస్తున్న కమల్ తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

తమిళంలో మొదటిసారిగా 1960లో, మలయాళంలో1962లో మొదటిసారిగా, బెంగాలీ, కన్నడం, తెలుగు, హిందీ భాషలలో 1977లో మొదటిసారిగా నటించిన కమల్ ఇప్పుడు తాజాగా చేసిన చీకటి రాజ్యం చిత్రానికి ఓ ఫ్రెంచ్ చిత్రం కథ మూలాధారం. అయితే ఆయన తెలుగులో చేసిన ఆకలిరాజ్యం చిత్రానికి మహాకవి శ్రీశ్రీ కవితే స్ఫూర్తి అని చెప్పుకున్నారు.

దేవుడంటే నమ్మకంలేని కమల్ చేసే పనినే ఇష్టదైవంగా ఆరాధిస్తారు.

మార్పు ఒక్కటే శాశ్వతమని చెప్పే కమల్ అన్ని మతాలనూ గౌరవిస్తారు. కళాకారులకు కులం, మతం వంటివి ఉండకూడదని అంటారు.

అమెరికా వాళ్ళ ప్రమాణాలకు అనుగుణంగా ఇచ్చే ఆస్కార్ అవార్డులు మనకు రావడం లేదని బాధపడటం అర్ధం లేనిదని, నిజం చెప్పాలంటే ఆస్కార్ కు మించిన చిత్రాలు మన దేశ చిత్రాలని ఆయన గర్వంగా చెప్తుంటారు.

ప్రతిభను గుర్తించి ఇచ్చే అవార్డులను తిరిగి ఇచ్చేయ్యడం సబబు కాదనే కమల్ తాను తనకిచ్చిన ఏ అవార్డు కూడా తిగి ఇవ్వనని గట్టిగా చెప్పారు.

కళాకారులందరూ ప్రాంతీయ భేదాలు పక్కన పెట్టి ఒక గొడుగు కిందకు వచ్చి ఇండియన్ యాక్టర్స్ అసోసియేషన్ గా ఏర్పడితే బాగుంటుందని అభిప్రాయపడ్డ కమల్ మున్ముందు కూడా మరిన్ని విభిన్న పాత్రలతో ముందుకు సాగాలని కోరుకుందాం…

– నీరజ చౌటపల్లి

Send a Comment

Your email address will not be published.