సుకుమార్ కోసం...

కుమారి ఎఫ్ 21 సినిమా తాను నిర్మాతగా మారిన విలక్షణ దర్శకుడు సుకుమార్ కోసం చేసానని ఆ చిత్ర కథానాయిక హీబా పటేల్ చెప్పారు.

గత కొద్ది రోజులుగా ఈ చిత్రం మీద యువతలో బోలెడంత చర్చ జరుగుతోంది. రొమాంటిక్ సన్నివేశాలపై ముఖ్యంగా చర్చ సాగుతోంది.

సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్‌పై ఈ చిత్రం తయారైంది.
జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తదితరులతో ప్రమోట్ చేసిన ఈ చిత్రం తాలూకు ఆడియో, ట్రైలర్‌‌ విడుదల అయినప్పటి నుంచి రకరకాలుగా ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బృందం ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈనాటి యువత ఆలోచనా ధోరణి గురించి ధైర్యంగా చర్చించిన సినిమా కావడం వల్ల ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిసింది.

సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హీబా కథానాయికగా నటించింది.

ఇది ఒక హీరోయిన్ చుట్టూ సాగే సినిమా అని కథానాయిక హీబా తెలిపారు. తెలుగు సినీ రంగంలో ఒక హీరోయిన్ చుట్టూ కథ అల్లడం తాను ఇదే మొదటి చిత్రమని ఆమె చెప్పారు. అదే తన కెరీర్ కు ఓ వరమని ఆమె అభిప్రాయ పడ్డారు. హీబా తెలుగులో నటించిన మొదటి సినిమా అంతగా విజయవంతం కాలేదు.

అయితే నిర్మాత సుకుమార్ తన మొదటి చిత్రం చూసి ఈ కుమారి ఎఫ్ 21 లో నటించే అవకాశం ఇచ్చారని, ఆయనకు థాంక్స్ చెప్తున్నానని హీబా అన్నారు.

తన చిత్రంలో నటిస్తావా అని సుకుమార్ గారు అడిగినప్పుడు ముందు వెనకలు ఆలోచించక ఒప్పుకున్నానని. తాను నటించడానికి ఒప్పుకున్నప్పుడు క్యారక్టర్ ఏమిటో కూడా తెలియదని హీబా చెప్పారు.

కథ చెప్పినప్పుడు అది కష్టమో సులభమో అనేది పక్కన పెట్టి నటించాలి అనే ఏకైక లక్ష్యంతో నటించినట్టు హీబా తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకులు అని తెలిసి ఎంతగానో సంతోషించానని ఆమె అన్నారు. తన కెరీర్ లో పెద్ద పెద్ద ప్రముఖ టెక్నీషియన్స్ తో కలిసి వర్క్ చేయడం మరచిపోలేనని అన్నారు.

నిజానికి ఈ చిత్రం గురించి నిర్మాత, దర్శకుడు వెల్లడించినప్పుడు మరొక కథానాయిక పేరు ప్రకటించారని, అయితే ఆ తర్వాత తనకు ఆ అవకాశం కల్పించారని ఆమె తెలిపారు. తాను సంతోషంగానే ఈ చిత్రం చేసానని అన్నారు. ఈ చిత్రం చేయడం తనకు సాహసంతో కూడిన మంచి క్యారక్టర్ అని అభిప్రాయపడ్డారు. నా క్యారక్టర్ కథాపరంగా సాహసోపేతమైనదని చెప్పారు హీబా.

ఇదొక ప్రేమకథా చిత్రమని, యువతను ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆమె అన్నారు.

తన ముందుకు ఇప్పుడు మరి కొన్ని ప్రాజెక్టులు వచ్చాయని, అయితే ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, అవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని ఆమె తెలిపారు.

Send a Comment

Your email address will not be published.