నిఖిల్ తన చివరి రెండు సినిమాలకు కాస్తంత భిన్నమైన కథనాలు ఎంచుకోవడం, అవి హిట్టవడం తెలిసిందేగా…
దానితో ఇప్పుడు అతని తాజా చిత్రం సూర్యా వెర్సస్ సూర్యా మీద ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగానే ఉండటం మామూలేగా
సినీమాటోగ్రాఫర్ అయిన కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా ఈ సినిమాలో తన ప్రతిభను ప్రేక్షకులముందు ఉంచారు.
కట్ చేసి సినిమాలోకి వెళ్తే, హీరో నిఖిల్ ఓ యువకుడు. ఓ అంతుబట్టని వ్యాధికి హీరో గురవుతాడు. తన చర్మం మీద సూర్యకిరణాలు పడటం తట్టుకోలేడు. ఎండ ఎక్కువై అందులోనే ఉంటే అతను కుప్పకూలే అవకాశం ఉందని తెలియడంతో పగలంతా ఇంటిదగ్గరే ఉంటూ ఉంటాడు. రాత్రిపూట బయటకు వస్తాడు. డిగ్రీ కోసం ఒక నైట్ కాలేజీలో చేరుతాడు. అక్కడ అతనికి కొందరు మిత్రులు ఏర్పడతారు. వాళ్ళు – తనికెళ్ళ భరణి, సత్య. వృద్ధుడి పాత్రలో భరణి, ఆటోరిక్షా డ్రైవర్ గా సత్య నటించారు. అలాగే హీరో నిఖిల్ త్రిధా చౌదరితో ప్రేమలో పడతాడు. ఒక టీ వీ షోలో చూసిన తర్వాత అతను ప్రేమకు తెర తీస్తాడు. అయితే అతనికి ఉన్న జబ్బు విషయం తెలిసి ఆమె దూరమవుతుంది. ఆ తర్వాత హీరో తన జబ్బును అధిగమిస్తాడు, మళ్ళీ తన ప్రేమను ఎలా దక్కించుకుంటాడు అనేది వెండితెరపై చూడాలి.
దర్శకుడు కార్తిక్ భిన్నమైన కథతో ముందుకొచ్చారు. దానిని ఆసక్తికరంగానే మలిచారు. ఇంటర్వెల్ ముందు వరకు కథనం నడిపించిన తీరు బాగుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత అంత ఆసక్తిగా లేదు కథ నడిపించిన విధానం. నెమ్మదిగా సాగింది. అనవసరపు సన్నివేశాలతో బోరు కొడుతుంది. మొత్తం మీదైతే ఒక ప్రేమ కథను దర్శకుడు బాగానే పండించారు అని చెప్పుకోవాలి.
నిఖిల్ నటన అమోఘం. తనలోని ప్రతిభను చక్కగా చూపించాడు. అతని నటనకు వందకు వంద మార్కులు వెయ్యవచ్చు. అతని నటన, పాత్ర సినిమాకు ప్లస్ పాయింట్.
త్రిధా కిది మొదటి చిత్రం. ఆమెను అందంగానే చూపించారు. భరణి, సత్య పాత్రలు కూడా పరవాలేదు.
నిఖిల్ తల్లిగా మధుబాల నటించారు.
సంగీతం సాధారణంగా ఉంది. వినోదానికి లోటు లేని సినిమా సూర్యా వెర్సస్ సూర్యా