అంచెలంచెలుగా అందలాలకు...

Venkaiah Naiduఒకప్పుడు వాజపేయి, అద్వానీల వాల్ పోస్టర్లు అతికించిన వ్యక్తి ఆయన. జన సంఘ్, ఆ తర్వాత జనతా పార్టీలలో నాయకులతో పాటు తిరిగిన వ్యక్తిని ఇప్పుడు ఆ నాయకులే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. ఆ అసాధారణ నాయకుడు మన తెలుగువాడైన ముప్పవరపు వెంకయ్య నాయుడు. 1949 జూలై 1 న నెల్లూరు జిల్లా చవటపాలెంలో పుట్టిన వెంకయ్య నాయుడు ఎటువంటి రాజకీయ వారసత్వం లేని నాయకుడు. క్రమశిక్షణ, నిబద్ధత ఆయన ఆలంబనలు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వెంకయ్య నాయుడు విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.

ఆంధ్ర విశ్వ విద్యాలయంలో న్యాయ శాస్త్రం చదివారు. అఖిల భారత విద్యార్థి పరిషత్తులో చేరి విద్యార్థుల అభివృద్ధి, సంక్షేమాలకు విశేష కృషి చేశారు.

విశ్వ విద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి వెంకయ్యది అలుపెరుగని రాజకీయ ప్రస్తానం. 1972 లో జరిగిన జై ఆంద్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ్ తో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాతి కాలంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్లారు. 1977 లో జనతా పార్టీ యువజన విభాగంలో అధ్యక్షుడిగా పని చేశారు. అక్కడి నుంచి రాజకీయంగా ముందుకు దూసుకు వెడుతూనే ఉన్నారు. 1978 లోనూ, ఆ తర్వాత 1983 లోనూ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యారు. అప్పుడే ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. 1998 నుంచి వరసగా రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడుగా వ్యవహరిస్తున్న వెంకయ్య నాయుడు చివరగా సమాచార ప్రసార శాఖ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పని చేస్తున్నారు.

ఆయనకు ఇద్దరు పిల్లలు, భార్య(ఉష) ఉన్నారు. నిత్యం నెల్లూరు పంచెకట్టుతో కనిపించే వెంకయ్య ఈ రెండు తెలుగు రాష్ట్రాలకే కాక, మొత్తం దక్షిణాదికి పెద్ద దిక్కుగా గుర్తింపు పొందారు.

Send a Comment

Your email address will not be published.