అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం

మెరుగుపడుతున్న తెలుగుదనం

ప్రపంచమంతా ఒక గ్రామంగా మారుతున్న తరుణంలో వలస అనేది నిరంతర ప్రక్రియగా మారింది. ఏవైనా కారణాలు కావచ్చు. వలస అనేది అనాదిగా వస్తున్న ప్రస్థానం. పూర్వం ఒక గ్రామం నుండి ఇంకొక గ్రామం, ఒక జిల్లా నుండి ఇంకో జిల్లా, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రం వలస పోవడం జరుగుతుండేది. 21 వ శతాబ్దంలో ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక దేశం నుండి ఇంకొక దేశం వెళ్ళడం షరా మామూలు అయింది. ఒకప్పుడు ప్రవాస నివాసం అనేది ఒక హోదాకి సంబందించినది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. బస్సెక్కి ప్రక్క ఊరు వెల్లోచ్చినంత సుళువుగా విదేశాలు వెళ్ళిరావడం, చాలా మంది విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇందుకు చాలా ప్రాశ్చాత్య దేశాలు వలస పద్ధతులను సరళం చేసి అవకాశాలు కల్పిస్తున్నారు.

ఐక్యరాజ్య సమితి 1990 సంవత్సరం డిశంబరు 18 వ తేదీ నాడు అంతర్జాతీయ వలస దారుల హక్కులను పరిరక్షించడానికి ఒక ఒడంబడికను చేకూర్చింది. తరువాత వివిధ తీర్మానాల తరువాత 2000 సంవత్సరంలో ఈ రోజుని అంతర్జాతీయ వలసదారుల దినంగా నిర్దేశించడం జరిగింది.

ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాల్లో గత రెండు దశాబ్దాలుగా ముఖ్యంగా కంప్యూటర్ రంగం సేవా పరిశ్రమగా తీర్చి దిద్దుకున్న తదుపరి భారతీయులకు అందునా మన తెలుగువారికి ఎక్కువ అవకాశాలు అంది రావడం జరిగింది. ఈ రెండు దేశాల్లో షుమారుగా ఒక లక్ష మంది తెలుగువారు నివసిస్తున్నారనడంలో సందేహం లేదు.

ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాలు బహుళ సంస్క్రుతులకు నిలయమన్నది నిర్వివాదాంశం. ఇక్కడున్న ఆస్ట్రేలియేతర సమాజాల్లో భారతీయులు రెండవ స్థానంలో వున్నారు. భారతీయుల్లో తెలుగువారు రెండవ స్థానంలో వుండడం విశేషం. ఐదు పదుల దాటిన తెలుగువారి ప్రస్థానం మొదట్లో వైద్య, విద్యా, పరిశోధనా రంగాల్లోని నిష్ణాతులకు పరిమితమైనా 1990 దశకంలో మొదలైన కంప్యూటర్ రంగ నిపుణలతో వలస ఎన్నో రెట్లు పెరిగిందనే చెప్పాలి.

ఇప్పుడిప్పుడే వ్యాపార, రాజకీయ రంగాల్లో కొంతమంది అడుగిడడం మరో మెట్టు ఎదిగినట్టే. తమ స్థానాన్ని పదిలపరచుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో భావి తరాల కోసం కొన్ని పనులు చేయడం ఎంతో అవసరం.

• మన సంస్కృతి భాషతో ముడి పడి ఉంది గనుక భాషాభివృద్ధికి తోడ్పడాలి. పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి అడపా దడపా కొన్ని బడులు నడుపుతున్నారే తప్ప ఒక సమగ్ర ప్రణాళిక లేదు. ఇక్కడి ప్రభుత్వాలు గ్రాంట్ల పరంగా ఆర్ధిక సహాయం అందిస్తున్నారు గనుక తెలుగు సంఘాలు మరియు ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్యతో కలిసి వీటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి
• తెలుగు భాష, పంజాబీ మరియు తమిళ భాషలలాగ కమ్యూనిటీ భాషగా గుర్తింపుకి భాషోద్యమాన్ని కొనసాగించాలి. దీనివలన ఇక్కడికి వలస వచ్చే వారికి 5 పాయింట్లు రావడమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో తెలుగుని ఒక బోధనాంశముగా ప్రవేశపెట్టే అవకాశం వుంటుంది. పిల్లలు ఉన్నత పాఠశాలల్లో తెలుగు నేర్చుకునే అవకాశం పెరుగుతుంది.
• ప్రస్తుతం భారత ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ సంభందాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చాలా వ్యాపార అవకాశాలు ఇంటి ముంగిట తొంగి చూస్తున్నాయి. ఈ రెండు దేశాల్లోని తెలుగు సమాజం ఈ అవకాశాలను బాగా ఉపయోగించుకోవాలి

Send a Comment

Your email address will not be published.