అంతా రామమయం...

అంతారామమయం ఈ జగమంతా రామమయం అంటూ అవతారమూర్తులైన సీతారాములపై ఆత్మీయ భావాన్ని తెలుగువారికి కలిగించటంలో భక్త రామదాసు కీర్తనలు, ఆయన రచించిన దాశరథీ శతకంతోపాటు ఉన్నత పాత్ర వహించాయి అనడంలో సందేహంలేదు.

చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి, శ్రీ రాముని విమల రూప సుధా రసమును రామదాసుతోపాటు తెలుగు పలక నేర్చిన, విన నేర్చిన భక్తులందరు ఆస్వాదించి తరించారు.

ప్రాచీన సంగీత సాంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా గాత్ర, వాద్య గానాలను పెర్త్ మహానగరంలోని తెలుగువారికి అందించాలని చిరు పయ్రత్నం పెర్త్ కు చెందిన సాహితీ వేదిక ‘తేటగీతి’ చేసింది. అందుకు రూపకల్పనే ‘భక్తరామదాసు వాగామృతవర్షిణి’. రామదాసు కృతులలోని నవరత్న కీర్తనలకు దీటైన దాశరథీ శతకంలోని పద్యాలను ఎన్నుకొని, సమన్వయించి కీర్తనలతోపాటు శతక సౌరభాన్ని మార్చి 1, 2014న తేటగీతి తెలుగు సంగీతాభిమానులకు అందించారు. వాయిద్య గోష్టిని కూడా ఈ సందర్భంగా తెలుగువారు రుచి చూశారు.

ఈ కార్యక్రమానికి పెర్త్ లో భారతీయ కాన్సులేట్ కు కాన్సుల్ జనరల్ గా వ్యవహరిస్తున్న శ్రీ సుబ్బారాయుడుగారు ముఖ్యఅతిధిగా విచ్చేస్తారు. వారి సతీమణి శ్రీమతి హేమగారు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారాయుడుగారు మాట్లాడుతూ, ‘తాను ఎన్నో దేశాల సందర్శించినప్పట్టికీ, పెర్త్ లో తెలుగువారు భాషపట్ల చూపుతున్న అభిమానం, జరుపుతున్న కార్యక్రమాలు మరెక్కడా చూడలేదన్నారు.’ ప్రత్యేకంగా తేటగీతి ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ, ఇటువంటి సంగీత కార్యక్రమాలు భావితరాలవారికి మన భాష పట్ల, సాహతీ, సంస్కృతుల పట్ల అవగాహన కల్పిస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో అనేకమంది పిల్లలు రామదాసు సంకీర్తనలను గానం చేశారు. అలాగే భద్రాచలంలో రామదాసు జయంతోత్సవాల రీతిలో ఇక్కడ కూడా నవరత్నకీర్తనలను ఈ సందర్భంగా పాడడం జరిగింది. అలాగే వీణ, వేణువుల మేలుకలియికకు మృదంగం, ఘటం, హార్మోనియం జోడయి వాద్యగోష్టిం చూపరులకు శ్రవణానందం కల్గించింది.

చివరగా, ఈ కార్యక్రమంలో పాల్గోన్న వారందరికి శ్రీ సుబ్బారాయుడుగారు జ్ఞాపికలను బహూకరించారు.

Send a Comment

Your email address will not be published.