అంధత్వం అడ్డు కాదు

ఆయన పుట్టు అంధుడు కావచ్చు కానీ ముందుచూపున్న గొప్పోడు
—————————————————————————–
ఆయన పేరు శ్రీకాంత్ బొల్లా . వయస్సు 24 ఏళ్ళు. ఆయన తన పనిలో ఎంతో వేగంగా దూసుకుపోతున్నారు. ఆయన రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పని చేస్తున్నారు. ఇలా విజయవంతంగా సాగిపోతున్న శ్రీకాంత్ అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. ఎందుకంటే ఆయన పుట్టు అంధుడు. కానీ గొప్ప విజన్ ఉన్న వ్యక్తి.
ఆయన కథలోకి వెళ్దాం….

మచిలీపట్నం పరిధిలోని ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు శ్రీకాంత్. ఆయన భూమ్మీద పడ్డప్పటి నుంచే సవాళ్లతో పుట్టారా అనిపిస్తుంది. అందుడిగా పుట్టిన కుమారుడు “ఉంటే ఎంత లేకుంటే ఎంత… చంపేసెయ్యండి” అని ఆయన తల్లిదండ్రులకు చెప్పారట చాలామంది. కానీ వాళ్ళందరూ అలా చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు ఆ పని చెయ్యకుండా నన్ను పెంచి పెద్ద చేయడం నా భాగ్యమని అన్నారు శ్రీకాంత్.

నిజంగానే శ్రీకాంత్ తల్లిదండ్రులకు మనం చేతులెత్తి దణ్ణం పెట్టాలి.
ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచడమే కాకుండా మంచి చదువు చెప్పించారు. సమాజానికి ఉపయోగపడేలా మంచి నడవడి నేర్పారు. ఈ రోజు ఓ సంస్థకు సి ఈ ఓ గా ఉన్నారు శ్రీకాంత్.

చిన్నప్పుడు తమ ఇంటికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకి నడిచి వెళ్ళే శ్రీకాంత్ ని క్లాసులో వెనుక బెంచీలో కూర్చోపెట్టే వాళ్ళు. అంతేకాదు తోటివారు అందరూ అతనిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు. అయినా ఈ కష్టాన్నంతా భరించి చదువుకున్న శ్రీకాంత్ పరిస్థితిని గ్రహించి ఆయన తండ్రి ఆ స్కూల్ లో లాభం లేదని, హైదరాబాదులో తన కొడుకులాంటి వారికోసం ఉన్న ఓ స్కూల్లో చేర్చారు. అంతే ఆ తర్వాత ఆయన జీవితం మలుపు తిరిగింది. బోర్డ్ పరీక్షలో 90 శాతం మార్కులు సంపాదించిన శ్రీకాంత్ కు అక్కడ మరో సమస్య తలెత్తింది. పదో తరగతి తర్వాత సైన్స్ చదువుదామనుకున్నారు శ్రీకాంత్.

అందుకు కారణం అతను అంధుడు కావడమే.
“నువ్వు అందుడివి కనుక ఆర్ట్స్ చదవాలని” సంబంధిత అధికారులు చెప్పేశారు. అయినా శ్రీకాంత్ తన పంతం మానలేదు. ప్రభుత్వంపై పోరాడారు. ఆరు నెలల పోరాటం తర్వాత ఓ జీవో విడుదల అయ్యింది. అదేమిటంటే శ్రీకాంత్ కూడా సైన్స్ దవవచ్చని. అయితే ఇక్కడ ఓ చిన్న మెలిక పెట్టారు. సైన్స్ కోర్స్ ని నీ బాధ్యత మీదే చదవాలన్నది ఆ మెలిక. అందుకు కారణం తను అంధుడు కావడమే. కానీ శ్రీకాంత్ ఏ మాత్రం బాధ పడక తనకు ఎదురైన సవాల్ ని అధిగమించి తాను చదవలేనన్న అందరి అభిప్రాయాన్ని తిరగరాసానని శ్రీకాంత్ చెప్పారు. సైన్స్ లో మంచి మార్కులతో ప్యాస్ అయిన శ్రీకాంత్ కి అక్కడితో సమస్య ఆగిపోలేదు. ఇప్పుడు ఐ ఐ టీ వారి రూపంలో మరో సమస్య తలెత్తింది. శ్రీకాంత్ ఐ ఐ టీ లో చేరుదామనుకుంటే వాళ్ళు ఆయనను చేర్చుకోవడానికి అభ్యంతరం తెలిపారు. అయితే అప్పుడు శ్రీకాంత్ వాళ్ళతో ఘర్షణ పడకుండా అమెరికాలోని ఓ పెద్ద కాలేజీకి దరఖాస్తు పెట్టుకుంటే ఎం ఐ టీ లో సీటు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అక్కడ చదువుకోవడానికి ఎంపిక అయిన మొట్టమొదటి అంధ విద్యార్ధిగా రికార్డు పుటలకెక్కారు శ్రీకాంత్. ఒక ప్రొఫెసర్ శ్రీకాంత కి రెండు పేజీల ఉత్తరం రాస్తూ ఆయన ప్రతిభను పొగిడారు. ఎం ఐ టీ లో బ్యాచులర్ కోర్స్ చేసిన శ్రీకాంత్ ఆ తర్వాత ఏం చెయ్యాలి అనుకున్నారు. ఆయనలో ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అమెరికాలో ఉద్యోగం చేయకూడదనుకుని శ్రీకాంత్ తిన్నగా భారత దేశానికి వచ్చేసారు.

స్వదేశం చేరుకున్న శ్రీకాంత్ హైదరాబాదులో ఓ సంస్థ నెలకొల్పారు. వికలాంగులైన పిల్లలను చేరదీసి వారికి అవసరమైన సహాయం అందించడమే ఆ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఆయనతో మరికొందరు చేతులు కలిపారు. ఈ సంస్థ మూడు వేల మందికిపైగా ఆశ్రయమిచ్చి చదివించడమే కాక పునరావాసం కల్పించడం అమోఘం. అయితే అక్కడితో ఆగని శ్రీకాంత్ బృందం ఓ సంస్థ స్థాపించి అందులోకి 150 మందిని తీసుకుని వారికి ఉపాధి కల్పించింది.

శ్రీకాంత్ కు పనే దైవం. అదే జీవితం. ప్రతీరోజు ఎప్పుడు పని మొదలు పెడతారు అన్నది విషయం కాదు. ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత తన కార్యాలయం చుట్టూ తిరుగుతూ పని చేసే యంత్రాల చప్పుళ్ళతో అన్నీ గ్రహిస్తారు. యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేవో అన్నది అవి పని చేసేటప్పుడు వచ్చే శబ్దాలను బట్టి గ్రహిస్తారు. సరిగ్గా పనిచేయని యంత్రాలను వాటి నుంచి వచ్చే శబ్దాలతో గుర్తించి సమస్యను పరిష్కరించడంలో శ్రీకాంత్ దిట్ట.

భారత మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం హైదరాబాద్ వచ్చినపుడు ఒక సందర్భంలో “జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నావు?” అన్న ప్రశ్నకు “మొదటి భారత అంధ అధ్యక్షుడిగా” కావాలని కోరుకుంటున్నట్లు శ్రీకాంత్ చెప్పడం జరిగింది.

మూడేళ్ళ క్రితం ప్రారంభించిన శ్రీకాంత్ సంస్థ ఇప్పుడు ఎంతో గొప్పగా నడుస్తోంది. శ్రీకాంత్ సంస్థ వ్యవస్థాపకుల్లో స్వర్ణలత ఒకరు. ఆమె శ్రీకాంత్ మెంటర్ కూడా కావడం గమనార్హం. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారిలో ఎస్ పీ రెడ్డి ఒకరు. ఆయనే ఈ సంస్థకు డైరెక్టర్ కూడా. శ్రీకాంత్ పనితనం తెలిసి ఆయనకు మార్కెట్ లో ఏ వస్తువుకి మంచి గిరాకీ ఉందన్నది బాగా తెలుసునని, ముందుచూపున్న మనిషి అని ఎస్ పీ రెడ్డి చెప్పారు. ఈ సంస్థలో మరో పెట్టుబడిదారు రవి మందా.

శ్రీకాంత్ నిర్వహిస్తున్న బోల్లంట్ ఇండస్ట్రీ ఉత్పత్తి చేసేది ప్రధానంగా ఎకో -ఫ్రెండ్లీ , డిస్పోసబుల్ కన్స్యూమర్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్.

జయహో శ్రీకాంత్.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.