అక్షర క్రాంతి

ఆస్ట్రేలియా అంతటా ఈ సంవత్సరం తెలుగు అక్షరాలు దివ్వెల్లా వెలిగిపోతున్నాయి.  ప్రతీ నగరంలో ఉన్న బడులు అభివృద్ధి పధంలో నడిపిస్తూ క్రొత్త బడులను కూడా ప్రారంభించడం ఎంతో ముదావహం.
తెలుగు అక్షరం పెళ్లి పందిరిలో పరదాల చాటున పరవశంతో ముసి ముసి నవ్వుల ముద్ద మందారంలా ధవళ కాంతుల నడుమ మేని బంగారు ఛాయతో పదహారణాల పల్లె పడుచులా ఒళ్ళంతా సింగారించుకొని నవ యవ్వన నృత్య కళా కారిణిగా  తాండవం చేస్తుంది.  అక్షరమెప్పుడూ మన పక్షమే అన్న నమ్మకాన్ని గట్టిపరుస్తోంది.  ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయమనే నమ్మకం అక్షరానికుంది.
మొన్న మెల్బోర్న్  కాన్బెర్రా, నిన్న పెర్త్, నేడు సిడ్నీ, రేపు అడిలైడ్ – అన్ని కేంద్రాల్లోనూ తెలుగు బడులు ప్రారంభించి ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు.
సిడ్నీ:
Telugu Badi Syd
సిడ్నీలో గత నెల రోజుల్లో ఏకంగా 2 కేంద్రాలు  ప్రారంభించబడ్డాయి.  ఇప్పటివరకూ కొనసాగుతున్న రెండు కేంద్రాలకు ఇవి అదనం.  ఒక్కొక్క కేంద్రంలో పిల్లలు కూడా సరియైన మోతాదులోనే నమోదు చేసుకున్నారు.  కొన్ని కేంద్రాల్లో 25 కి పైగానే పిల్లలు వస్తున్నట్లు సిడ్నీ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ శివ పెద్దిభొట్ల గారు చెప్పారు. నిన్న స్త్రాట్ ఫీల్డ్ లో జరిగిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు  జోడి మేకై తెలుగు బడిని ప్రారంభించారు.  ఈ సందర్భంగా $500.00 మూల ధనం కూడా ఇవ్వడం జరిగింది.

పెర్త్:
Telugu Badi _WA

పెర్త్ నగరంలో గత సంవత్సరం ప్రారంభించిన తెలుగుబడి దిగ్విజయంగా నడపబడుతూంది.  వారికి వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వం నుండి షుమారు $13,000 మూలధనం మంజూరయ్యింది.
అడిలైడ్:

Telugu Badi SA

అడిలైడ్ లో వచ్చే ఆదివారం క్రొత్తగా తెలుగు బడిని మొదటిసారిగా ప్రారంభిస్తున్నట్లు శ్రీ సత్యనారాయణ శీలం గారు తెలిపారు.
పర భాషా సంస్కృతితో సహజీవనం చేస్తూ మన భాషను కాపాడుకోవాలన్న తపనతో స్వచ్చంద కార్యకర్తలు తమవంతుగా ముందుకొచ్చి భావి తరాల వారికి అనిర్వచనీయమైన తెలుగు అక్షరాన్ని బహుమతిగా అందివ్వడానికి ముందుకొస్తున్నారు.  ఈ విషయం ఎంతో శ్లాఘనీయం.
తెలుగు గురించి:
తెలుగు లిపి ప్రపంచ భాషల్లో రెండవ స్థానం సంపాదించుకుంది.  భారత దేశంలో తెలుగును మాట్లాడే వారు (మూడవ స్థానం) హిందీ, బెంగాళీ తరువాత తెలుగువారే (74 మిల్లియన్లు).  భారత ప్రభుత్వం 2009 లో తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించింది.  చరిత్ర ఘట్టాల్లో తెలుగు మాతృ భాష కాని వారు ఎంతోమంది మహానుభావులు శ్రీ కృష్ణ దేవరాయలు (16 వ శతాబ్దం), C P బ్రౌన్ (19 వ శతాబ్దం) ఎన్నో గ్రంధాలు, నిఘంటువులు వ్రాసి మన భాష ఔచిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.  ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ గా ఘనతి కెక్కిన మన భాష UNESCO వారు మృత భాషల్లో చేర్చారని బాధ పడాల్సిన పని లేదు.  ఎందుకంటే తెలుగు భాష మునుపెన్నడూ లేనంతగా మళ్ళీ తన ఉనికిని కాపాడుకోవడానికి నడుం కట్టింది.  అందుకు విదేశాల్లోని తెలుగువారందరూ ఏకమై తమ పోరాటాన్ని సాగిస్తున్నారు.  ఈ ప్రక్రియ కొన్నాళ్ళు సాగితే తెలుగు భాష విదేశాల్లోనే ఎక్కువ ప్రాచుర్యం పొంది ఆంగ్ల భాషతో పోటీ పడే రోజు రాకపోదు.

Send a Comment

Your email address will not be published.