అక్షర శిల్పి ఆచార్య ఆత్రేయ

తెలుగు సినీ రంగంలో మనసుపై  వందకుపైగా పాటలు రాసిన ఏకైక కవి ఆచార్య ఆత్రేయ ఆత్మకథ అసంపూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ కథ పూర్తి చేసినట్లైతే గొప్ప పద్య కావ్యం మన ముందుండేది. ఆత్మకథను కొందరు నీతి కొరకు, కొందరు ఖ్యాతి కొరకు, కొందరు పాడు పొట్టకు, కూటి కొరకు, ముక్తి కొరకు, ఆవేశ విముక్తి కొరకు, ప్రేమ కొరకు, ప్రేయసి మురిపెమ్ము కొరకు కొందరు రాస్తే నేను నాలోని నిజం కోసం రాస్తున్నానని ఆత్మకథ యోగ్యతాపత్రంలో చెప్పుకున్నారు ఆత్రేయ. ఈ  జీవిత కథను ఆయన ……

“ఈ పున్నెము నా తల్లిది
నా పూర్వులదేను గాన నమ్రత తోడన్
నా ప్రతిభ కాదు కాదని
ఈ పొత్తము వారికిత్తు నిహపరగతికై”  అంటూ అంకితమిచ్చారు.

ఆత్మకథలో అమ్మ మీద పదిహేడు పద్యాలు రాసిన ఆత్రేయ తమ తల్లి సీతమ్మను చల్లని తల్లిగా అభివర్ణించారు. పుట్టినిల్లు, పగ-బాలి, భ్రాంతి, క్షమ, విద్యాబుద్ధులు, తొలి గాయం అనే శీర్షికలతో సాగించిన  ఆత్మకథలో తాను పుట్టిపెరిగినతీరును, చవిచూసిన సంఘటనలను చక్కటి చిక్కటి పద్యాలలో పొందుపరిచారు. బడి జీతానికి డబ్బులిస్తే కాఫీ హోటళ్లకు ఖర్చు చేసెయ్యడం, పుస్తకాలకోసం ఇచ్చిన డబ్బుని సిగరెట్లకు ఖర్చుపెట్టేయడం, వెచ్చాల కోసం ఇచ్చిన డబ్బులో కొంత తస్కరించినట్లు రాసుకున్న ఆయన ఇలాంటి పనుల వల్ల వాటిని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు ఆడటం, పట్టు బడటం, తిట్లు తినడం, ఒట్లు వెయ్యడం, గాలి తిరుగుళ్ళతో చదువు గంగపాలు అయినట్లు ఆయన రాసుకున్నారు.

సీతమ్మ, కృష్ణమాచార్యుల దంపతులకు 1921 మే 7వ తేదీన నెల్లూరు జిల్లా మంగలంపాడులో పుట్టిన ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహా చార్యులు. వీరిది ఆత్రేయ గోత్రం. తమ పేరులోని ఆచార్య కు గోత్ర నామమైన ఆత్రేయను కలిపి కలం పేరుగా చేసుకుని ఆచార్య ఆత్రేయగా వినుతికెక్కారు.

టీచర్స్ ట్రైనింగు వరకు చదువుకున్న ఆత్రేయకు నాటక రంగం పుట్టిల్లు. సినీ రంగం అత్తారిల్లు. ఆయన రాసిన అనేక నాటకాలలో  ఎన్జీవో కు విశేష ఆదరణ లభించింది.

1951 లో  ప్రకాష్ ప్రొడక్షన్ పై కె ఎస్ ప్రకాశ రావు దర్శకత్వం వహించి నిర్మించిన దీక్ష చిత్రంలో ఆత్రేయ తొలి సినిమా పాటను రాసారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగంలో ఉండి నాలుగు వందల చిత్రాలకు సాహిత్యాన్ని అందించిన కవి ఆత్రేయ.

ఆయన రాసిన మొదటి పాట ….”పోరా బాబు పో, పోయి చూడు ఈ లోకం పోకడ.

ఇక ఆయన రాసిన చివరి పాట …”ఈ మువ్వల గానం మన ప్రేమకు ప్రాణం. ఈ చిత్రం పేరు ప్రేమయుద్ధం. 1990 లో వచ్చింది.

ఆయన మొత్తం పద్నాలుగు వందల పాటలు రాసారు. వీటిలో ఆరు వీణ పాటలున్నాయి. 1964 లో ఆత్మబలం చిత్రం కోసం రాసిన చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలి కాడే    సరసన ఉంటే అనే పాట ఇప్పటికి ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప వర్షం పాటగా చెప్పుకోవచ్చు.

మనసు కవిగా, మన సుకవిగా ఖ్యాతి గడిచిన ఆత్రేయ మనసుపై రాసిన తొలి పాట అంతే కావాలి చిత్రంలోనిది. ఈ చిత్రం 1955 లో వచ్చింది.

మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే అని చెప్పిన ఆయన  మరొక చోట ముద్దబంతి పువ్వులో మనసు మూగదే కానీ బాసుంటది దానికి అని, మౌనమే నీ భాష ఓ మూగ మనసా అని విలువైన బరువైన తేలికైన ఇలా రకరకాలుగా మనసుపై మాటలు అల్లి మరెవరూ రాయనన్ని మనసు పాటలు రాసి  రికార్డు సృష్టించారు.

ఇక ప్రేమపైకూడా అనేక భావాలు అందించిన ఆత్రేయ నేను అనే కవితలో “ఇట్టి దినములెన్ని ఏగినవో కాని తెలియనైతి, కనులు తెరువనైతి…నాకు రెండు కలవు నాకము, నరకము కానీ రెండు కూడా కలసిపోయే వెలుగు నీడలట్లు పేనుకొంటి , పడుగుపేకలనెడు వరుస మరచి …” అని తన గురించి చెప్పుకున్నారు.

ఆయన తన జాతకాన్ని పద్యంలో రాసుకున్నారు. అందులో గ్రహాల పేర్లను అచ్చ తెలుగులో వర్ణించారు….”వింటి కైదైన మేక పోతింటి లోన, పగటి రెడును, రేరేడు, పాము తోకరక్కసుల యొజ్జ , జాబిలి రంకు కొడుకు చేరి బ్రతుకును చిందర చేసినారు..” అని రాసుకున్నారు.

ఆత్రేయ బద్ధకస్తులని ఎవరికీ ఉత్తరాలు రాయరని, రాసిన మూడు నాలుగు ముక్కలే తప్ప ఎక్కువగా రాయరని అనుకునే వారున్నారు. అయితే అప్పుడప్పుడు ఆయన సుదీర్ఘమైన లేఖలు రాయకపోలేదు.

ఒక చోట ఆయన అన్నారిట్లా… దూషణ భూషనలకు క్రుంగిపోయే మనస్తత్వం కాదని. పనినే దైవారాధనగా భావించే ఆత్రేయ పనిలో ఆత్మ వంచన చేసుకోకుండా బతకడమే దైవ భక్తి అని స్పష్టంగా చెప్పుకున్నారు. తాను మామూలు  మనిషినే, అనవసరంగా శిఖరాగ్రానికి ఎత్తి తనను ఆరాధించ వద్దని నిక్కచ్చిగా చెప్పారు. తాను మహాకవిని కాను, కాళిదాసునీ కాను, కవిత్రయ పాద దూళినీ కాను అని చెప్పిన ఆత్రేయకు టాల్ స్టాయి రచనలన్నా స్వామీ వివేకానంద మాటలన్న మహా ఇష్టం. “నాకు కావాల్సింది సన్యాసులు కారు …వీరులు, యోధులు..” అని చెప్పిన స్వామీ వివేకానంద మాటలు ఆయనను అమితంగా ఆకర్షించాయి. దైవ భక్తిని తప్పు అని అనను  కానీ ఎవరికి వారు తమ  వరకు ఉండనివ్వక దానిని దురాచారాలను, దుర్మార్గాలను, దోపిడీని సమర్ధించుకోవడానికి మాత్రం ఉపయోగించకూడదని ఆత్రేయ అన్నారు.

ఒకప్పుడు భారత జాతికి ఓ లక్ష్యం ఉండేదని, కానీ ఈరోజు లక్ష్యం ఏదీ లేదని, స్వార్ధం తప్ప. అందుకే పిరికిపందలు, వంచకులు, సంకుచిత స్వభావులు, పెదవులపై నుంచి ఉపన్యాసాలు వెళ్ళ గక్కే వెంగళప్పలు పుడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్త చేసారు.

వెయ్యికి పైగా పాటలు రాసి ఒకే ఒక్క పాటకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారమైన నందిని (1981 లో వచ్చిన తొలి కోడి కూసింది అనే చిత్రంలో రాసిన అందమైన లోకమని రంగు రంగులుంటాయని……అనే పాటకు) అందుకున్న ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13న కన్నుమూశారు.

– నీరజా చంద్రన్

Send a Comment

Your email address will not be published.