అటాయి “గీతా” మాధుర్యం

మెల్బోర్న్ వాతావరణం ఉదయం అందరికీ సానుకూలంగా ఉన్నా మధ్యాహ్నం మారొచ్చనే ఊహ అందరి మదిలో మెదులుతూనే ఉంటుంది.  అలాగే ఈ రోజు(15-11-2014) మరీ అంత అననుకూలంగా లేకపోయినా వర్షం పడి వాతావరణం చల్లబడింది.  అయితే నంది అవార్డు గ్రహీత శ్రీమతి  గీతా మాధురి గారి ఉర్రూతలూగించే గీతాలోపనలతో  కాల్ ఫీల్డ్ లోని గ్లెన్ ఐరా హాలు మరింత వేడెక్కి బయటి వాతావరణం గురించి పట్టించుకోలేదు.  షుమారు మూడు గంటలకు పైగా గీతామాధురి తనకు తానుగా కొన్ని,  స్థానిక గాయకులతో కలిసి మరికొన్ని ఎంతో మధురమైన  గీతాలను పాడి ప్రేక్షకులను మైమరిపించారంటే ఆశ్చర్యం లేదు.  శ్రీమతి గీత గారితో పాటు వారి శ్రీవారు శ్రీ నందు గారు కూడా హాస్యభరితమైన కొన్ని సన్నివేశాలను చెప్పి కార్యక్రమాన్ని  ఉల్లాసభరితంగా కొనసాగించారు.

స్వాతి కిరణం లోని “శ్రుతి నీవు కృతి నీవు” పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించి పాత క్రొత్తల మేలికలయికతో ఎన్నో మంచి పాటలు స్థానిక కళాకారులతో పాడి ప్రేక్షకుల మన్ననలను పొందారు.  మొట్టమొదటి సారిగా ఆస్ట్రేలియా వచ్చిన గీతా మాధురి దంపతులు మొదటి పర్యటనలోనే అందునా మొదటి రోజునే ఆస్ట్రేలియా తెలుగువారి మన్ననలందుకోవడం ముదావహం.

పల్లెటూరి వాతావరణాన్ని స్పురించు ఒక గీతానికి తెలుగు భాష తెలియని శ్రీ సారంగ్ (కీ బోర్డు) శ్రీ కుల్జీత్ (కన్జీరం) ఎంతో వన్నె తెచ్చారు.  సంగీతానికి భాషా పరిమితులు లేవనడానికి ఇదొక  తార్కాణం.  తెలంగాణా జానపదం “గొల్ల మల్లమ్మ కోడల” గీతానికి రంగస్థలంపై నృత్యం చేసిన ఆడపడుచులు మరియు సహాయక బృందం ఎంతో అద్భుతంగా వుంది.  పదేళ్ళ వయసున్న పిల్లలు మెడ్లీ నృత్యం ప్రేక్షకుల్ని ఎంతో అబ్బుర పరచింది.  మన తెలుగువారు కళా ప్రదర్శనలో ముందుంటారన్నది నిర్వివాదాంశం.   మెల్బోర్న్ నగరం కళలకు నిలయమని మరొక్కసారి నిరూపితమైనది.

విక్టోరియా బహుళ సంస్కృతీ సంస్థ కమీషనర్ శ్రీ చిదంబరం శ్రీనివాసన్ ఈ కార్యక్రమానికి విచ్చేసారు.  వారు తన ప్రసంగంలో మెల్బోర్న్ నగరం గత నాలుగేళ్ళుగా ప్రపంచ నగరాల్లో అన్నింటిలోకీ నివాసయోగ్య నగరంగా ఎన్నుకోబడడం ఎంతో గొప్ప విషయమని చెబుతూ ఈ నగరంలోని షుమారు 50 శాతం మంది పర దేశంలో పుట్టిన వాళ్ళేనని పరస్పర గౌరవాన్నిచ్చుకోవడంలో బహుళ జాతీయ సంస్కృతికి పట్టం గట్టడం నివాసయోగ్య నగరంగా ఎన్నుకోబడడానికి తోడ్పడుతుందని తెలిపారు.

అధ్యక్షులు శ్రీ రాజవర్ధన రెడ్డి వుల్పాల గారు మాట్లాడుతూ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.  ఇదే కోవలో ఈ కార్యక్రమం నుండి వచ్చిన డబ్బుని కొంత హూద్ హూద్ తుఫాను వలన అతలాకుతలం అయిన ఉత్తరాంధ్ర పునః నిర్మాణానికి ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం శ్రీ మురళి బుడిగె గారిని, శ్రీమతి రమారావు గూడూరు గారిని మరియు శ్రీ మల్లికేశ్వర రావు కొంచాడ గారిని వారు చేస్తున్న సంఘసేవకు ప్రత్యెక గుర్తింపుగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి శ్రీమతి సరోజ గుల్లపల్లి గారు వాచస్పతిగా వ్యవహరించి ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రేక్షకుల్లో కొంతమంది పాటలకు లయబద్ధంగా స్టేజి పై నాట్యం చేయడం గమనార్హం.

చివరిగా అటాయి కార్యవర్గం ఆర్ధిక సహాయం అందించిన వ్యాపార సంస్థలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.  వీరిలో ముఖ్యంగా మహేష్ గూడూరు, వంశి బుడిగె మరియు అమర్ వున్నారు.

Send a Comment

Your email address will not be published.