అటాయి - రాష్ట్రావిర్భావ సంబరాలు

పరదేశంలో వున్నా పరాయి సీమలో వున్నా తల్లికి బిడ్డే.  దేశ పరిధులు దాటినంత మాత్రాన తల్లి పేగు బంధం తెగిపోతుందా?  తేట తెలుగు భాషాభిమానం తరిగిపోతుందా?  మన భాష మన గర్వం.  మన మట్టి సువాసన ఎప్పుడూ  సుగంధమే.  చిన్నప్పుడు ఎడ్ల బండి వెనుక ధూళి ఎగురుతున్నా ఆ ధూళిలో కనుమరిగై పోయినా ఫరవాలేదు, అందులోనే ఆనందం, అందులోనే ఆర్ద్రత, అదే ఒక చిలిపితనం, అదే ఒక మొరటుతనం – అలాగే పెరిగాం.  ఆ వాసనలు నరనరాల జీర్ణించుకుపోయి కన్న భూమికి దూరం అనేది ఒక ఆలోచన తప్ప నిజం కాదనేది నిరూపించారు ఈ నాటి కార్యక్రమ నిర్వాహకులు.   తల్లి భాషలోని మాధుర్యానికి తన్మయత్వం తోడుగా జేసి తెలంగాణా జనపదాలు  జానపదాలుగా గొంతెత్తి పాడిన పాటగాళ్ళు,  నా తెలంగాణా కోటి రతనాల వీణని కదంత్రోక్కిన ఆటగాళ్ళు, కృష్ణ – గోదావరి నదుల సంగమంలా నృత్యం చేసిన చిన్నారులు, పల్లె పదాలను మననం చేసుకుంటూ పరవశించి పోయిన పెద్దలు – ఇలా వయసుతో పనిలేకుండా తెలంగాణా సంప్రదాయపు విలువల్ని నిలువుటద్దంలా కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించిన ఔత్సాహికులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి శోభ తెచ్చారు.      

అధ్యక్షులు శ్రీ రాజవర్ధన రెడ్డి వుల్పాల గారు స్వాగత వచనాలు పలుకుతూ తెలంగాణా అమర వీరులకు జోహార్లర్పించారు.  ఈనాటి ముఖ్య అతిధులు శ్రీ కొండా రాఘవ రెడ్డి గారికి మరియు “ఓనమాలు” మరియు “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” చిత్ర దర్శకులు శ్రీ క్రాంతి మాధవ్ గారికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం గత ఏడాది కాలంలో చేసిన సంఘ సేవా కార్యక్రమాలను వివరించారు.  ఉపాధ్యక్షులు శ్రీ అజయ్ గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

తెలంగాణా రాష్ట్ర గీతంతో పాటు పిల్లల నృత్యాలు, శ్రీమతి సుధారాణి మరియు శోభా రాణి పాడిన జానపదం,  శ్రీ వద్దేరాజు శ్రీనివాస్ పాడిన “మబ్బే మసకేసిందిలే.. “ చిత్ర గీతం, శ్రీ అమర్ పాడిన “జై జై తెలంగాణా…” గీతం ఇంకా ఎన్నో ఒళ్ళు గగుర్పొడిచే గీతాలు ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చాయి.

భువన విజయ సభ్యులు ముషాయిరీల మురళీ గారు తనదైన శైలిలో ముషాయిరీలతో పాటు ఒక జానపద గీతం కూడా పాడారు. 

ఈ కార్యక్రమానికి MTF సభ్యులందరూ విచ్చేసి సభా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

శ్రీ కొండా రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ వున్న ప్రవాసులంతా తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పరదేశంలో వున్నా మన పండగలను, ఆవిర్భావ దినోత్సవాలను ఎంతో సంతోషంగా జరుపుకోవడం ముదావహమని వర్ణించారు.  శ్రీ క్రాంతి మాధవ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకంగా వుందని తెలంగాణా ప్రజల జీవన విధానానికి సంబంధించి ఒక సినిమా ఎప్పుడైనా తీయాలని వుందని అభిలషించారు.

శ్రీ అనిల్ బైరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి ఆర్ధిక సహకారాన్నందించిన వ్యాపార వేత్తలకు మరియు స్వచ్చంద కార్యకర్తలకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.  పసందైన విందుతో కార్యక్రమం ముగిసింది.

Send a Comment

Your email address will not be published.