అణా కాణీల్లా అదృశ్యమైన పరికిణీ ఓణీలు

నా బాధల్లా అదే తనికెళ్ళ భరణి గారూ….మీరు రాసిన పరికిణీ నన్ను ఎప్పటికీ సశేషంగానే మిగిల్చింది…ఎందుకంటే నన్ను మా అమ్మ అబ్బాయిగా ఈ భూమ్మీద నిలపడమే…. అమ్మాయ్యయ్యుంటే మీరు చెప్పిన పరికిణీ నన్నూ అల్లుకునేది కదా…కానీ పరికిణీ అందాన్ని ఈనాటి అమ్మాయిలు విస్మరించడం నిజంగా బాదే.

పంజాబీ డ్రెస్సులొచ్చి పరికిణీల్ని మాయం చేసేయన్న దుగ్ధకొద్దీ పరికిణీ పదాలు రాశానన్న భరణీ గారి మాటలు చిరస్మరణీయం.

చాలా మంది ఆడపిల్లలు పరికిణీలో మరింత అందంగా ఉంటారన్న మీ సిద్ధాంతానికి నూటికి రెండొందల మార్కులు వెయ్యని మాస్టార్ని పంజాబీ డ్రెస్సుతో పోల్చాల్సిందేనని నేనంటా….

పరికిణీ మీద మీకున్న అభిమానాన్ని అందంగా వర్ణించిన తీరుకు నేను దాసోహం.

దండెం మీద ఇంద్రధనస్సుని పిండి ఆరేసినట్టుంటుంది పరికిణి అని మొదలు పెట్టిన పరికిణీ అందానికి గులాముని.

కలల పడవలకు కట్టిన తెరచాపలాటిది పరికిణీ అన్న మీ ఊహకు నేను అనంత కోటి ఆహాలు చెప్తాను…

పిందెకి దిష్టి తగలకుండా కట్టిన గుడ్డలా పరికిణీని అల్లిన మీ గుసగుసలకు నా పదనిసలు రాగాలు తీస్తాయి….

పరికిణీ ….. మాధుర్యాన్నంతా గుండెల్లో దాచుకున్న తేనే పట్టులా అన్న మీ వర్ణనను అమ్మాయిలు చదివారంటే వాళ్ళిక పంజాబీ డ్రెస్సులు, లేగ్గీలు తదితరాలపై మొగ్గుచూపుతారనుకోను….

శృంగార రసంలో నానేసి నేసిన అపారదర్శకపు అద్భుత దేవతావస్త్రం పరికిణీ అన్న మీ మంత్రం అమ్మాయిలకు వేదమవ్వాలని నా ఆకాంక్ష.

పరికిణీ ఓణీలు మోసుకొచ్చే అందాల తీరుతెన్నులను మరెవరూ చెప్పలేనంత సొంపుగా చెప్పిన మీ మాటలకు అమ్మాయిలు విలువిస్తే అచ్చతెలుగు ముద్దుగుమ్మలు మన చుట్టూతా కనిపిస్తారేమోనని నా ఆశ.

అప్పుడే మీసాలు మొలుస్తున్న కుర్రాడికి ఓణీయే ఓంకారం….పరికిణీయే పరమార్ధం అన్న మీ ముగింపు మాటలు అటు అమ్మాయిలనే కాదు ఇటు మగాళ్ళనూ ఊహాలోకాల్లోకి తీసుకుపోతుందని చెప్పడం అతిశయోక్తి కాదు.

పరికిణీ ఓణీలు కల్పించే అందమైన మీ మాటల్ని పెద్దలతో తప్పనిసరిగా చదివిస్తే అమ్మాయిల రూపంతో అవి బతికి బట్టకడతాయని వేరేగా చెప్పక్కర్లేదు. అణా కాణీల్లా అదృశ్యమైన పరికిణీ ఓణీలు మళ్ళీ జీవం పోసుకుంటాయని నా నమ్మకం.

అన్నట్టు ఒక్క మాట …నేను నా శ్రీమతిని మున్ముందుగా చూసింది పరికిణీ ఓణీలోనే…..ముప్పైరెండేళ్ళ క్రితంనాటి మాటది. ఆ క్షణాలను ఎప్పుడు మరచిపోలేను.

భరణీ గారి పరికిణీ పుస్తకం నా అల్మారాలో ఎప్పుడూ ముందు వరసలోనే ఉంటుంది……

అలాగే ఈ పరికిణీ కవితా సంపుటిలోనే చీరను మోస్ట్ సెక్సియస్ట్ డ్రెస్ ఇన్ ది వరల్డ్ అని మీరన్న మాటను మరచిపోయే ప్రసక్తే లేదు. శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంత రసాలతో అల్లిన మీ పదబంధ “చీర”కట్టుమీద ఒట్టేసి చెబుతున్నా…. నేను మీ భావ సౌందర్యానికి, మీ అక్షర సౌమ్యతకు దాసుడినే….

– యామిజాల జగదీశ్
(భరణీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఈ నాలుగు మాటలు రాసాను.
తప్పులుంటే మన్నించాలి భరణి గారు….ఎందుకంటే నాకున్న అక్షర జ్ఞానం బహుతక్కువ)

Send a Comment

Your email address will not be published.