అత్యంత వైభవంగా దీపావళి

అత్యంత వైభవంగా దీపావళి

అడిలైడ్ నగరంలో తెలుగు వారి నుడికారానికి శ్రీకారం చుట్టి 8 వసంతాలు గడిచాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిన్న మొన్ననే ఇక్కడ తెలుగువారి సందడి మొదలయ్యిందనుకుంటాం. ఈ 8 వత్సరాల ప్రయాణంలో ఎన్ని దీపావళి కాంతుల పండు వెన్నెలలు, ఎన్ని ఉగాది సంబరాల పంచాంగ శ్రవణాలు, ఎన్నెన్ని వినాయక ఉత్సవాలు, ఎన్నెన్ని తెలుగువారి వాకిళ్ళలో ముగ్గుల గొబ్బెమ్మలతో సంక్రాంతి పర్వదినాలు. అడిలైడ్ నగరం ప్రకృతి అందాలకు పెట్టిన పేరు. ఆ అందాన్ని ఆస్వాదించి దానికి అనుగుణంగా తెలుగువారి సత్సంప్రదయాలు ముద్దు ముద్దుగా చిట్టడుగులు వేస్తూ తమ ప్రయాణంలో ముచ్చటగా ఎనిమిది వసంతాలు నింపుకొని యుక్త వయస్సుకు దగ్గరౌతూ “మేము సైతం” ఆస్ట్రేలియాలో తేనెలూరించే తెలుగు భాషకు పట్టం కడతామని నిగూఢమైన పట్టుదలతో ముందుకు సాగుతున్నారు సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారు. శ్రీ యార్రా ఆదిరెడ్డి గారి అధ్వర్యంలో ఈ నెల 11 వ తేదీన దసరా దీపావళి పండుగను షుమారు 500 మంది అభిమానుల మధ్య జరుపుకోవడం ముదావహం. అందునా అందరూ సనాతనమైన వస్త్రాలను ధరించి ఈ పండుగకు మరింత శోభను తెచ్చారు.

సాయంత్రం 7 గంటలకు ఎప్పటిలాగానే భారత దేశం నుండి వచ్చిన పెద్దవారితో దీప ప్రజ్వలన చేయించడంతో కార్యక్రమం మొదలైంది. తొలుత శ్రీమతి అనుష ప్రేంచంద్ (వీరు భారత దేశంలోని చాలా టీవీ ఛానల్ లో విలేఖరిగా పని చేసారు) తెలుగు సంఘం గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు. తదుపరి సంగీత నృత్య విభావరి, టాలీ వుడ్, బాలీ వుడ్ నృత్యాలు, చిన్న పిల్లల కార్యక్రమాలు ఎంతో ముచ్చటగా ప్రదర్శించ బడ్డాయి. ప్రముఖ ఇంద్రజాలకుడు స్టీవ్ చేసిన ఇంద్రజాలం అందరినీ ఆకర్షించింది.

అధ్యక్షులు శ్రీ ఆదిరెడ్డి గారు తమ కార్యవర్గ సభ్యులు ఎంతోమంది అతిధులను సాదర గౌరవంతో సత్కరించారు. ప్రత్యెక అతిధులుగా Mrs. Zoe Bettison(Multicultural Affairs Minister), Mr. Steven Marshall(State Liberal Leader), Ms. Vickie Chapman (State Deputy Leader), Mrs. Rajni Madan (Indian Australian Association of South Australia) మరియు G. Premender Reddy(Vice President, BJP Telangana) విచ్చేసారు.
శ్రీ ఆదిరెడ్డి గారు మాట్లాడుతూ తమ కార్యవర్గం సాధించిన కార్యాలను వివరిస్తూ ముఖ్యంగా తెలుగు భాషను ఆస్త్రేలియాలో కమ్యూనిటీ భాషగా గుర్తించడానికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. దీనివలన ప్రత్యక్షంగా రెండు ఫలితాలు ఉంటాయని వివరించారు.
1. తెలుగు మాట్లాడే వారు ఎవరైనా పెర్మనెంట్ రెసిడెన్సీ కి దరఖాస్తు పెట్టుకుంటే 5 పాయింట్లు వస్తాయి.
2. ఆస్ట్రేలియా బడులలో తెలుగు భాషను ఇతర దేశ భాషలు – మాండరిన్, ఫ్రెంచ్, జర్మన్ లాగా పాఠ్యమ్సమ్గా చేర్చడానికి అవకాశం వుంటుంది.
అంతే కాకుండా తెలుగు సంఘం క్రొత్తగా వచ్చే తెలుగు వారికి తగిన సహాయ సహకారం అందివ్వడం, స్థానిక సంస్థలతో కలిసి పనిచేయడం వంటి కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తుందని వివరించారు.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు తెలుగు సంఘ కార్యవర్గ సభ్యులను సత్కరించారు. తెలుగు సంఘం వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ సదా చిరస్మరణీయం అని వ్యాఖ్యానించారు.
తెలుగు సంఘం వారు భారత దేశం పై ఆసక్తిదాయకమైన ఒక వీడియో ని ప్రదర్శించడం జరిగింది.

రంగస్థలాన్ని శ్రీ అరుణ్ నాయుడు గారు అందంగా అలంకరించారు.

 

 

Send a Comment

Your email address will not be published.