అద్వితీయమీ ద్వయం

జానపదుల జనపదాల జనరంజని
జనాకర్షణతో వెలుగొందు శివరంజని
పరదేశంలో తెలుగువారి మనోరంజని
పరవశంతో తేనెలూరు తెలుంగని

సుసంపన్నమైన మేధాశక్తితో హృదయాన్ని రంజింపజేసే జనరంజకమైన భావాలకు అక్షర రూపం ఇచ్చి రేడియో శబ్ద తరంగాలపై తమదైన శైలిలో తెలుగువారి గుండెలకు చేరువౌతున్న “జనరంజని” రెండవ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో శ్లాఘనీయం. తెలుగుమల్లి మరియు భువన విజయం తరఫున సవినయంగా శుభాభినందనలు తెలుపుకుంటున్నాం.

తెలుగు వైభవం, బౌద్ధ మతం, గంగా భవాని, నిఘంటువు, తెలుగువారి చరిత్ర – ఇలా తెలుగు వారి అమ్ములపొదిలో వున్న విజ్ఞాన భండాగారం వెలికి తీసి ప్రతీ వారం ఒక్కొక్క విషయంపై ఎంతో పరిశోధన చేసి మన భాషా సంస్కృతుల వైభవాన్ని కూలంకుషంగా మనకు అందించిన సాహితీ సమారోహం ఈ జనరంజని. ఇందులోని సభ్యులు ఒక్కొక్కరు తమ తమ వృత్తుల్లో నిష్ణాతులు. అందరూ ఎవరి పనిలో వారు తీరిక లేకుండా ఉన్నా వారికున్న పరిధుల్లో సమయాన్ని చిక్కుంచుకుని ప్రతీ వారం ఒక గంటకి సరిపోయే కార్యక్రమాన్ని రూపొందించి గత రెండేళ్లుగా ప్రసారం చేయడం సామాన్యమైన విషయం కాదు. అందులోనూ నాణ్యతలో పొరబాటున కూడా రాజీ పడకుండా యోగ్యత గల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న ఈ జనరంజనికి నమఃస్సుమాంజలి.

ఖండమైనట్టి ఈ ఎడారి దేశంలో సాహితీ వ్యవసాయం సేద్యం చేస్తున్న జనరంజని సభ్యులు ఒక అఖండమైన జ్యోతి ప్రజ్వలనకు శ్రీకారం చుట్టారు. ఆంధ్ర దేశంలోనే కకా వికలమైపోతున్న మన భాషకు అక్షర సుమాలతో నివాళులర్పిస్తున్నారు. పరభాషా సంస్కృతితో సహజీవనం చేస్తూ మన భాషకు పట్టం కడుతున్నారు. “మనం” అన్న పదంలో మన భాషే పాశం అని మన వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు. భాషోద్యమానికి నడుం కట్టేరు. భాషా పరిరక్షణలో భాగస్వామ్యులయ్యారు. తెలుగుతల్లి ఒడిలో సేద దీర్చుకుంటున్నారు. తెలుగువారి మదిలో తరించిపోతున్నారు. భాషామతల్లికి పూలబాట వేస్తున్నారు. మన భాష మన గర్వం అంటున్నారు. దేహాలు పరదేశంలోనున్నా మనసు మాత్రం మాతృ దేశంలోనే అంటున్నారు.

సిడ్నీ కాలమానం ప్రకారం ప్రతీ సోమవారం రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు అంతర్జాలంలో www.2nbc.com ఈ కార్యక్రమాన్ని వినవచ్చు.  జనరంజని వారి వెబ్సైటు (www.janaranjani.com.au) లో అంతకు ముందు కార్యక్రమాలు కూడా వినవచ్చు.

గత రెండేళ్లుగా ఎన్నో వ్యయప్రయాసలకు ఎదురొడ్డి క్రమం తప్పకుండా ప్రతీ సోమవారం తమ రేడియో కార్యక్రమాలని నిర్వహించడం ఒక తెలుగువాడిగా అభినందించాల్సిందే. అయితే ఈ కార్యక్రమం వినే శ్రోతలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. మరెంతోమంది వ్యాపార సంస్థలు ముందుకు వచ్చి ఆర్ధికంగా అడుకోగలరని జనరంజని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా పుట్టినరోజు సందర్భాలు, పెళ్లి సంవత్సరీకాలు ఇంకా మరెన్నో సందర్భాలను పురస్కరించుకొని ప్రకటనలిచ్చి కొంత మేర ఆర్ధిక సహాయన్నందివ్వగలరని శ్రోతలకు మనవి చేసుకుంటున్నారు.

ఈ జనరంజని కార్యక్రమంలో భువన విజయం కూడా పాలుపంచుకొని ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు జనరంజని సభ్యులకు మరియు వారి రధసారధి శ్రీ దూర్వాసుల మూర్తి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. బహుముఖ ప్రజ్ఞాశాలురైన మీ చేతుల్లో మరిన్ని జనాకర్షణీయ కార్యక్రమాలు తెలుగువారికి అందివ్వగలరని ఆశిస్తూ…

తెలుగుమల్లి

Send a Comment

Your email address will not be published.