అధిష్టానానికి కిరణ్ కొరకరాని కొయ్యేనా

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి…. గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కి కొరకరాని కొయ్య కూడా. మన రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసిన ఏ నాయకుడూ ఇంత వరకూ అధిష్టానం మాటతో బహిరంగంగా విభేదిస్తూ ఇంత తాపీగా, ప్రశాంతంగా పని చేసుకు పోలేదు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి అకాల మరణంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య రాష్ట్రాన్ని పరిపాలించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పదే పదే తన అసమర్ధతని నిరూపించు కోవడంతో కాంగ్రెస్ అధిష్టానం తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని మార్చింది. అప్పటి వరకూ స్పీకర్ గా పని చేస్తున్న ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్యమంత్రి గా నియమించింది.

రోశయ్యని తొలగించిన పక్షంలో ముఖ్యమంత్రి పదవికి అర్హులైన ఎంతోమంది సీనియర్ మంత్రులు ఉండగా కనీసం ఒక్కసారి కూడా మంత్రి గా పని చేయని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం పట్ల ఎంతో మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే కిరణ్ రెడ్డి తండ్రి పాత తరం కాంగ్రెస్ నాయకుడు కావడం, మంత్రిగా పలు బాధ్యతలని సమర్దవంతంగా నిర్వహించి ఉండటంతో పాటు ఢిల్లీలో కొంతమంది కేంద్రమంత్రుల సహకారంతో కిరణ్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం దక్కింది. మొదట్లో తడబడినా నిదానంగా రాష్ట్ర పరిస్థితుల్ని చక్క దిద్దడంతో పాటు ఆయన రాష్ట్రముపై పట్టు కూడా సాధించాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో జరిగిన ఎన్నో ఉద్యమాల్ని శాంతియుతంగా అణచి వేయించారు. రాష్ట్రం లో నిరుద్యోగుల కోసం యువ కిరణాలు వంటి పధకాలతో పాటు, రాష్ట్రం లో జన్మించిన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా బంగారు తల్లి చట్టాన్ని, ఎస్.సి, ఎస్.టిలకు చట్టబద్ధత వంటి పలు అంశాలతో ప్రజల్లోకి చొచ్చుకు పోగలిగారు. సహచరులని పట్టించుకోరు, సీనియర్లని లెక్క చేయరు వంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కొద్ది కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకోగలిగారు.అధిష్టానానికి వీర విధేయ కిరణంగా పేరు తెచ్చుకున్న కిరణ్ రెడ్డి అధిష్టానం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించగానే స్వరం మార్చారు.

కాంగ్రెస్ అధిష్టానం జూలై 30 వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. అంతకంటే ముందు కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్య మంత్రి కిరణ్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి దామోదర రాజ నరసింహ, రాష్ట్ర పి.సి.సి. ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ తోనూ విడివిడిగా సంప్రదింపులు జరిపారు. అందరి వాదనలూ విన్న తర్వాత తెలంగాణని ప్రకటించారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడే సమస్యల్ని, పరిణామాల్ని విపులంగా చెప్పిన తర్వాత కూడా హైకమాండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడంతో ఖిన్నుడైన ముఖ్య మంత్రి వారం రోజుల పాటు క్యాంప్ ఆఫీసు వదిలి బైటకి రాలేదు. కనీసం సచివాలయానికి కూడా వెళ్ళ లేదు.
వారం రోజుల పాటు ఏకాంతంగా గడిపిన కిరణ్ మొదటిసారిగా ఆగష్టు మొదటి వారం చివరిలో మీడియా ముందుకు వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ని రెండు రాష్ట్రాలుగా విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించడం లేదు, అలాగని అంగీకరించడం లేదని ప్రకటించారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానానికి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడం తప్పనిసరి అయితే రాష్ట్రములోని కొన్ని క్లిష్ట సమస్యలకి ముందు సమాధానం చెప్పి తర్వాతే విభజన దిశగా అడుగు వేయాలని ఆయన హైకమాండ్ ని కోరారు.

కిరణ్ ఇచ్చిన జర్క్ తో ప్రజల మాట ఎలా ఉన్నా హైకమాండ్ కి మాత్రం దిమ్మ తిరిగి పోయింది. మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు కిరణ్ పై తిట్ల పురాణం అందుకున్నారు. ప్రజల అండదండలు లేకుండా కేవలం అధిష్టానం చలవతో ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని చేస్తున్న మనిషి అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించడమా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు కుడా అదేస్థాయిలో కిరణ్ పై విరుచుకు పడ్డారు. ఇక ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజ నరసింహ అయితే ఏకంగా సీల్డ్ కవర్ సి.ఎం. ఉంటే ఎంత ? పోతే ఎంత? అని దుమ్మెత్తి పోశారు. అంత వరకూ తెలంగాణలో కిరణ్ వర్గంగా పేరుబడ్డ మంత్రి డి.కె. అరుణ, విప్ గండ్ర వెంకట రమణారెడ్డి వంటి వారు కుడా సి.ఎం ని తీవ్రం గా విమర్శించారు. కేవలం జడ్చర్ల ఎం.ఎల్.ఎ జగ్గా రెడ్డి మాత్రమే సి.ఎం.కి మద్దతు పలికారు.

ఆ సమయం లో రంగం లోకి దిగిన దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి ని ఎవరూ విమర్శించ వద్దని హుకుం జారీ చేయడంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. ఆ తర్వాత ఎ.పి.ఎన్జీఓ ల ఆధ్వర్యంలో అశోక్ బాబు అధ్యక్షతన హైదరాబాద్ లో జరిగిన సేవ్ ఆంధ్రా సభకి సంపూర్ణ సహాయం అందించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఆంధ్రాని విడదీయడం సరికాదని, దాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటూ నేషనల్ చానెల్స్ తోనూ రాజ్య సభ టీవీ కి కిరణ్ లైవ్ ఇచ్చారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ముందూ తన సమైక్య వాదన వినిపిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారారు. లోకసభలో విపక్షాలు సైతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విషయంలో తన సొంత ముఖ్యమంత్రినే ఒప్పించ లేక పోయిందని విమర్శిస్తున్నాయి. తమకి ఎదురు తిరిగిన ముఖ్యమంత్రిని దారి లోకి తెచ్చుకోలేక, ఆయన్ని ఒప్పించ లేక కేంద్ర కాంగ్రెస్ నానా తంటాలు పడుతోంది. అయినా సర్ది చెబుతామని ఒకసారి దిగ్విజయ్ కిరణ్ రెడ్డి రాష్ట్ర విభజనకి అంగీకంరించారని ఢిల్లీలో ప్రకటించారు కూడా. అయితే కిరణ్ ఆ వ్యాఖ్యల్ని వెంటనే కొట్టి పడేశారు. పైగా కేంద్రానికి ఇక్కడ ఇంకో గడ్డు సమస్య కూడా ఏర్పడింది. అవిధేయ కిరణ్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి కొత్త వారిని తెచ్చి రాష్ట్ర విభజన చేయాలని కూడా ప్రయత్నించింది. అందుకోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు, రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని, రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ వంటి వారిని సంప్రదించింది. అయితే రాష్ట్రం లో ఉన్న క్లిష్ట పరిస్థితులు, ఎన్నికలు అతి సమీపంలో ఉండడంతో వారెవరూ ముఖ్యమంత్రి పదవి తీసుకోడానికి ఇష్టపడలేదు. ఒకవేళ ఇంకెవరికైనా బలవంతం గా ముఖ్యమంత్రి పదవిని అంట గట్టినా సీమాంధ్రలో కిరణ్ ప్రత్యేక పార్టీ పెట్టి బలపడతాడేమో అని భయం. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకూ అధిష్టానం నిర్ణయాన్ని బహిరంగం గా విభేదించి వారికి కొరకరాని కొయ్యగా మారిన ఏకైక సీల్డ్ కవర్ సి.ఎం. కిరణ్ రెడ్డి మాత్రమే.

Send a Comment

Your email address will not be published.