అధ్యక్ష పదవికి హరి గూడూరు

అవిభాజ్యపు తెలుగు వారి ఆదర్శమట
అవిశ్రాంతపు ఆలోచనలే అంతరంగమట
త్రికరణ శుద్ధిగా పనిచేయటమే వేదమట
60 వసంతాల జీవితం ధన్యమట

‘నేను’, ‘మేము’ అన్న పదాలు లేవు తన నిఘంటువులో
అంతా ‘మనమే’ అన్నదే తన పంథాలో

905754_10206985684896526_1126380346240440144_oఆస్ట్రేలియా కి 1983 లో ఉద్యోగ గుర్తింపు తో వలస వచ్చి, ఈ దేశంలో స్థిరపడాలని సంకల్పించుకున్న తొలి తెలుగు వ్యక్తి, హరి గూడూరు గారు. తెలుగు సంస్కారం, హిందూ సంప్రదాయాన్ని మరవ కూడదనే తపన కారణంగా తెలుగు సంఘం, హిందూవర్గ స్థాపన బృందాలలో పాల్గొన్నారు. చిన్న పిల్లలతో పది సంవత్సరాలు హిందూ పౌరాణిక నాటకాలు తన మిత్రులతో కలిసి వేయించారు. మెల్బోర్న్ నగరానికి భారతదేశంలో చెడు పేరు వస్తున్న కాలంలో విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలందించి రెండుదేశాల మైతృత్వాన్ని ధృడం చేయడానికి తోడ్పడ్డారు. సంఘ కృషి కి మారు పేరుగా బ్రతికే ముఖ్యులకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కలుగచేయాలన్నది ఈయన సంకల్పన.

మొదటి విడతగా నాలుగేళ్ళు సాధారణ సభ్యునిగా మెల్బోర్న్ లోని శివ విష్ణు మందిరానికి సేవలందించి అనారోగ్య కారణంగా బాధ్యతలనుండి విరమించుకున్నా లక్ష్య సాధనలో ఇంకా ఎక్కాల్సిన మెట్లు ఎన్నో తన పట్టికలో మిగిలిపోయున్నాయని శారీరికంగా బలాన్ని పుంజుకొని మానసికంగా మరింత ఎత్తుకు ఎదిగి ఈ సారి శివ విష్ణు మందిరం కార్యవర్గ అధ్యక్షులుగా ఎన్నిక కావడానికి పోటీ పడుతూ బరిలోకి దిగారు శ్రీ హరి గూడూరు గారు. ప్రతీ క్షణం ప్రజా సేవకే అంకితమైనా ఇంకా ఎన్నో సుమధురాలోచనలతో శివ విష్ణు మందిరం అభివృద్ధికి తోడ్పడి ఆస్ట్రేలియాలో ఇదొక పుణ్య క్షేత్రంగానూ, పర్యాటక కేంద్రం గానూ తీర్చి దిద్దాలన్న తన కలను సాకారం చేయాలని దీక్షతో ప్రతినబూనారు శ్రీ హరి గారు.

సుమధురాలోచనలు నిండిన మది
ప్రవాసంలో రెండు తరాల వారధి
తెలుగు సత్సంప్రదాయాల సన్నిధి
పేరులోనే వుంది తెలుగువారి పెన్నిధి

‘రమేష్ చంద్ర హరి గూడూరు’ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. “హరి గూడూరు” గా భారతదేశం నుండి వలస వచ్చిన వారికి, విక్టోరియా ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు, ముల్టీ కల్చరల్ కమిషన్ అధికారులకు సుపరిచితులే. అయితే ఇందులో ఇమిడివున్న నిగూఢమైన రహస్యం వంశ పారంపర్యంగా వస్తున్న కుటుంబ సంప్రదాయం. తాతగారి పేరును శాశ్వతం చేయాలన్న సమున్నతమైన ఆలోచనతో వారి కుటుంబంలో అందరి పేరులోనూ “హరి” వుంటుంది. అంతే కాకుండా వారందరూ హరి నామ స్మరణలో తరించి సర్వదా తమ సేవలను భగవన్నారాయాణునికే అంకితం కావాలన్న తపన. తలచుకుంటేనే మదిలో ఒక పులకింత.

ఇప్పటి తరం “ఉమ్మడి కుటుంబం” అన్న మాట విన్న వారు చాలా తక్కువ. భారతీయ కుటుంబ వ్యవస్థకు పునాది వంటిది. తాను భారతదేశంలో ఉన్నపుడు తండ్రి, పిన తండ్రి కలిసి ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండటాన్ని ఆదర్శంగా తీసుకొని పర దేశంలో తాను తమ్ముడితో కలిసి అదే పంథాలో ఒకే ఇంట్లో నివసిస్తుండడం ఎంతో కొనియాడదగినది. ఉన్నతమైన ఆదర్శ భావాలు కలిగి ఉండడం ఒక ఎత్తైతే వాటిని ఆచరణలో పెట్టి ఆదర్శ పురుషులుగా నిలవడం అనేది మరో ఎత్తు.

1983 లో ఆస్ట్రేలియా వచ్చి తెలుగు సంఘ స్థాపనకు ఎంతో కృషి చేసి పలుమార్లు వివిధ పదవుల్లో సేవలందించిన శ్రీ హరి గూడూరు గారు ధృఢ సంకల్పంతో శివ విష్ణు మందిరం కార్యవర్గ అధ్యక్షులుగా ఇంకా ఎంతో చేయగలనన్న నమ్మకంతో ముందుకెళ్తున్నారు. ఈ ఎన్నికలో మన తెలుగువారందరూ తమ సహాయ సహకారాలందించి గెలిపించాలని శ్రీ హరి గారు విన్నవించుకుంటున్నారు.
వచ్చే నెల 28 వ తేదీన జరిగే ఎన్నికలో మీ ఓట్ల ఆశీర్వాదాలు పూలవర్షంలా వెదజల్లి శ్రీ హరి గూడూరు గారిని గెలిపించాలని తెలుగుమల్లి కోరుకుంటోంది.

Send a Comment

Your email address will not be published.