అపర ఘంటసాల - రామకృష్ణ

సంగీత సామ్రాజ్యం శోక సముద్రంలో మునిగిపోయింది. తెలుగు సినిమా స్వర్ణయుగానికి చెందిన ఒక ధ్రువ తార రాలిపోయింది. అపర ఘంటసాల గొంతు మూగబోయింది. సంగీత సామ్రాజ్యంలో మాస్టారు ఘంటసాల తరువాత అంతటి ఉన్నత స్థానాన్ని సంపాదించిన గళం ఆగిపోయింది. అశేష సంగీత ప్రియుల శ్వాస ఆగినంత పనైంది.

“అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం” అని ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు.

లలిత సంగీత సామ్రాట్ గా పేరుప్రఖ్యాతులు పొందిన ఎమ్మెస్వీ (ఎం ఎస్ విశ్వనాథన్) తాను స్వరపరచి మనకందించిన పాటల్ని చెరగని గుర్తులుగా విడిచిపెట్టి వెళ్ళిన నలభై ఎనిమిది గంటలు కాకముందే ఇప్పుడు గాయకుడు రామకృష్ణ మన అందరికీ దూరమయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న “అపర ఘంటసాల” రామకృష్ణ హైదరాబాదులోని తమ నివాసంలో కన్నుమూశారు. ఈయన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, శోభన్ బాబు వంటి నటులకు పాడారు. కె.వి.మహదేవన్, పెండ్యాల వంటి సంగీతదర్శకులతో పనిచేశారు.

సినీ నేపధ్య గాయకుడిగా దాదాపు ఇరవై సంవత్సరాలు తమ పాటలతో విశేష ఆదరణ పొందిన వి. రామకృష్ణ మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అయిదు రోజులకు అంటే 1947 ఆగస్ట్ 20వ తేదీన విజయనగరంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వీ రంగశాయి, వీ రత్నం. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రామకృష్ణ గాయకుడిగా స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. తమ పిన్ని గారైన విశ్వ విఖ్యాత గాయని పీ సుశీలను ప్రేరణగా తీసుకుని అందుకు తగినట్టే ఆయన గాయకుడిగా ఎదగడానికి కృషి చేశారు కూడా. సినీ రంగంలోకి రాకముందు రామకృష్ణ ఆకాశవాణి (ఏ ఐ ఆర్) లో చిత్తరంజన్ సంగీత దర్శకత్వంలో గాయకుడిగా అనేక పాటలు పాడారు.

రామకృష్ణ తమ సంగీత బృందంలోనే సహ గాయనిగా ఉన్న జ్యోతిఖన్నాను 1977 లో పెళ్లి చేసుకున్నారు. జ్యోతి ఖన్నా దూరదర్శన్ లో అనేక పాటలు పాడిన గాయనిగా సుపరిచితులు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు సాయికిరణ్ నటుడిగా టాలీవుడ్ కు పరిచితులే. సాయి కిరణ్ నువ్వే కావాలి చిత్రంలో నటించారు. వీరి కూతురు పేరు లేఖ.

నేపధ్య గాయకుడిగా ఆయన అక్కినేని నాగేశ్వర రావుకి విచిత్రబంధం చిత్రంలో “వయసే ఓ పూల తోట” అనే పాట మొట్టమొదటగా పాడారు.

ఆయన పాడిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు….
తాతా మనవడు చిత్రంలో “అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం” (1972), “రాముడేమన్నాడోయి”, “ఎదగడానికి ఎందుకురా తొందర ఎదర బ్రతుకంతా చిందరవందర”, “మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి …”, “వోసేయి వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ నడుము ఉయ్యాలా”,
భక్త కన్నప్పలో “ఆకాశం దించాలా….నెలవంక త్రుంచాలా”, “ఎన్నియలో ఎన్నియలో చందమామ”,
“శివ శివ శంకర …”, ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు..గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు…(ముత్యాలముగ్గు)” “శ్రీమతిగారికి తీరని వేళ (శారద), మధువొలకబోసే నీ చిలిపి నవ్వు” – ఇలా ఎన్నో గుర్తుండిపోయే పాటలు పాడిన రామకృష్ణ విచిత్రబంధం, తాతామనవడు, అందాల రాముడు, భక్త తుకారాం, పల్లెటూరి బావ, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, చక్రవాకం, అందరూ దొంగలే, కన్నవారి కలలు, ముత్యాలముగ్గు, బలిపీటం, భక్తకన్నప్ప, మహాకవి క్షేత్రయ్య, సెక్రెటరి, చక్రధారి, అమరదీపం, దాన వీర శూర కర్ణ, కరుణామయుడు, యువతరం కదిలింది, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం, విశ్వనాథ నాయకుడు, బావా మరదుల సవాల్ తదితరచిత్రాల్లో పాటలు పాడారు.

సినీ గాయకుడిగా దాదాపు అయిదు వేల పాటలు పాడిన రామకృష్ణ మరెన్నో భక్తి గీతాలు ఆలపించారు. అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ కు తమ గళం అందించారు.

పిల్లనగ్రోవి పిలుపు అనే పాట రికార్డింగ్ కోసం సుశీలతో కలిసి జెమినీ స్టూడియోకి వెళ్ళినప్పుడు మొదటిసారిగా ఘంటసాలను కలవడం ఎప్పటికీ మరచిపోలేనని చెప్పుకున్న రామకృష్ణ ఓ ఫ్యామిలీ ప్లానింగ్ డాక్యుమెంటరీకి బీ.మోహన్ రాజుకు బదులు అనుకోకుండా రెండు పాటలు పాడవలసివచ్చింది. ఆ పాటలు విని అక్కినేని నాగేశ్వర రావు తన “విచిత్రబందం”లో సుశీలతో కలిసి పాడే అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం వచ్చినప్పుడు మరో రెండు నెలల్లో జరిగే పరీక్షలకు రామకృష్ణ సన్నద్ధమవుతున్నారు. అయితే అక్కినేని ఆ రెండు నెలలు ఆగి ఆ తర్వాత రామకృష్ణతో పాటలు పాడించడం ఆయన గొప్ప మనసుకు ఓ మంచి ఉదాహరణ.

రామకృష్ణ పాడిన మొదటి సినిమా పాట పల్లవి ఇలా మొదలవుతుంది….”వయసే ఒక పూలతోట…” అని. మరో పాట “చిక్కావే చేతిలో చిలకమ్మా…” అప్పట్లో ఈ రెండు పాటలూ యువతను ఉ ర్రూతలూగించింది.

మన రామకృష్ణ గొంతు నుంచి ఘంటసాల గాన మాధుర్యాన్ని వినవచ్చని అక్కినేని అంటూ ఉండేవారు.

మనసులేని దేవుడు, తెలుగు వీర లేవరా అనే పాటలకు గాను రామకృష్ణకు ఒక అభిమాని ఘంటసాల ఫోటోలను కానుకగా సమర్పించారు. అలాగే మరో అభిమాని డాక్టర్ హరిబాబు కెనడియన్ డాలర్ మీద ఆటోగ్రాఫ్ చేసి ఇవ్వడాన్ని మరచిపోలేనని రామకృష్ణ చెప్పుకునే వారు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో ఎన్ టీ రామారావు కి రామకృష్ణే పాటలూ పాడారు.

మా భువన విజయ సభ్యులు శ్రీ రఘు విస్సంరాజు శ్రీ రామకృష్ణ గారికి స్వయానా తమ్ముడు. ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ దేశాలలో శ్రీ రఘు విస్సంరాజు గారంటే ఎరుగని వారుండరు. వారి అన్నగారికి దీటుగా పాటలు పద్యాలు పాడి ఇక్కడి సంగీత ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేసారు. వారి కుటుంబానికి భువన విజయ సభ్యులందరూ ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నారు.

రామకృష్ణ భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన తన పాటలతో మన మధ్యే ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. వారి ఆత్మకు శాంతి కలగాలని భౌతికంగా దూరమైనా వారి పాటలలో ఎప్పుడూ సజీవంగా ఉంటారని వేరే చెప్పనక్కరలేదు.

Send a Comment

Your email address will not be published.