అభిమానులే అండా దండా

మా మెగా కుటుంబానికి అభిమానులే అండా దండా అని చిరంజీవి అన్నారు.

చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించే చిత్ర ప్రారంభోత్సవం ఫిబ్రవరి 27న హైదరాబాద్ లోని  రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీచి, నాగబాబు, పవన్ కళ్యాణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్, సమర్పకులు టాగూర్ మధు తదితరులు హాజరయ్యారు.

వరుణ్ తేజ్ , పూజా హెగ్డే లపై క్లాప్ కొట్టిన చిరంజీవి మాట్లాడుతూ తమ మెగా కుటుంబానికి అభిమానుల అండదండలు బాగానే ఉన్నాయని అన్నారు. ఇప్పుడు తమ కుటుంబం నుంచి మరో కొత్త హీరోగా వరుణ్ తేజ్ వెండితెరకు వస్తున్నాడని చెప్పారు. వరుణ్ తేజ్ నిజంగానే ఆరున్నర అడుగుల అందగాడని, తన కుమారుడు రామ్ చరణ్ కు ఎంతో ఇష్టమైన తమ్ముడే వరుణ్ తేజ్ అని ఆయన అన్నారు. ఇక నాగబాబు విషయానికి వస్తే మెగా అభిమానులతో అత్యంత సన్నిహితంగా మెలిగే నాగబాబు అదృష్టవంతుడని చెప్తూ, వరుణ్ తేజ్ చిత్రం హిట్టు కొట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఒళ్ళు వంచి పని చేస్తేనే విజయం దక్కుతుందని, ఎదిగే కొద్ది వొదిగి ఉండాలని తాను తమ కుటుంబ సభ్యులందరకీ ఎప్పుడూ చెప్తూ ఉంటానని చిరంజీవి అన్నారు.

వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 15న ప్రారంభమై అక్టోబర్ 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు టాగూర్ మధు తెలిపారు.

ఇలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి మాట్లాడుతుండగానే మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో చిరు సోదరుల మధ్య ఇంకా అభిప్రాయభేదాలు సమసి పోలేదని కొందరు చెవులు కొరుక్కున్నారు.

Send a Comment

Your email address will not be published.