అభివృద్ధిలో పోటా పోటీ

రాష్ట్రాలను అభివృద్ధి చేయడంలో తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు నిజంగానే తీవ్రంగా పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రాథమిక సదుపాయాల కల్పనపై పథకాలు రూపొందించిన తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు వాటికి కేంద్ర నిధుల కోసం పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, ఇతర మంత్రులను కలిసి రావడం జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు తమ తమ అధికార్లు, నిపుణులతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుండగా, తెలంగాణా మంత్రులు ఇతర రాష్ట్రాలతో పాటు, ఇతర ఆసియా దేశాల్లోనూ పర్యటిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు తమిళ నాడు, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడి అభివృద్ధి సూచికలయిన విద్యుత్ ఉత్పత్తి, నీటిసరఫరా, ప్రజారోగ్యం, రోడ్ల నిర్మాణం వంటి వాటిని పరిశీలిస్తున్నారు. “హైదరాబాద్ తిరిగి రాగానే ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తాము. ఆ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి పథకాలు రూపొందించి నిధులు సమీకరించి, అమలు చేయడం ప్రారంభిస్తారు” అని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారాయణ వెల్లడించారు. “మరో పదేళ్ళలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చడమే నా ధ్యేయం” అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పారిశ్రామికవేత్తల సమావేశంలో ప్రకటించారు.

Send a Comment

Your email address will not be published.