అమ్మ భాషకు హారతి

–మల్లిక్ రాచకొండ–
అక్షరం అక్షరం నీవెవరి పక్షం? అంటే నేనెప్పుడూ నీ పక్షమే నువ్వే నన్ను కక్ష కట్టి మరీ ప్రక్కకి నెట్టేస్తూ వున్నావు అంటుంది. అమ్మను ప్రతీ అక్షరంలో వీక్షిస్తూ తెలుగు భాషకి సేవ చేస్తున్న ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.

Mallik Rachakondaపరదేశంలో ఉంటూ తెలుగు భాషకు సేవ చేయటమే ప్రధమ కర్తవ్యంగా బాధ్యతనెరిగి ఎంతోమంది తల్లిదండ్రులకు తమ బాధ్యతను గుర్తు చేస్తూ వారి పిల్లలకు తెలుగు భాష నేర్పించడంలో గురుతర బాధ్యతను చేపట్టిన కధనం ఇది.
ఇక్కడి పిల్లల అవసరాలను, అలవాట్లను దృష్టిలో పెట్టుకొని వారికీ తెలుగు భాష సుళువుగా నేర్చోకోవడానికి వీలుగా ఆధునిక సాంకేతిక పద్ధతులను వాడి తెలుగు వాచకాలను వ్రాసి అమ్మ భాషకు హారతి పట్టిన ఒక అక్షర వైద్యుని వైనమిది.

ఆంధ్ర ప్రదేశ్ లోని అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరిలో జన్మించి M.Sc (Mahematics), M.A (Public Administration) లో పట్టుబద్రులైన శ్రీ రాచకొండ మల్లికార్జున రావు గారు సిడ్నీ వాస్తవ్యులు. మల్లిక్ గా చాలామందికి సుపరిచితులు. వృత్తి రీత్యా కంప్యూటర్ నిపుణులైన శ్రీ మల్లిక్ గారు హైదరాబాదు లోని ECIL కంపనీలో మొదట కొన్నాళ్ళు పనిచేసి ఆస్ట్రేలియా దేశం 1982 లో రావడం జరిగింది. 1993లో సిడ్నీ తెలుగు సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా తెలుగువారికి సేవలందించడం మొదలుపెట్టి అప్పటినుండి ఏదో ఒక రూపంలో సభ్యులందరికీ సహాయసహకారలందిస్తూ వున్నారు. ముఖ్యంగా పిల్లలలకు తెలుగు నేర్పించాలన్న తలంపుతో అప్పుడే ఒక తెలుగు బడిని ప్రారంభించడం జరిగింది. వృత్తి రీత్యా మళ్ళీ భారతదేశం 1998 లో వెళ్లి 2006 లో తిరిగి వచ్చారు. అప్పటి నుండి తెలుగు భాషాభిమానిగా కధలు వ్రాయడంతో వారి ప్రస్థానం మొదలిడి ఇక్కడి పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి అనువైన పాఠ్యాంశాలను న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని ఇల్లవార కమ్యూనిటీ లాంగ్వేజ్ పధకం మరియు K-10 సిలబస్ ప్రకారం వ్రాసారు.

పిల్లలకి మన భాషను నేర్పించాలన్న ఆకాంక్షతో మన దేశం నుండి చాలామంది తెలుగు పుస్తకాలు తీసుకొని వచ్చి Akshara Parichayam Stage 1 Titleఇంటిదగ్గర బోదించడం చేస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తించడం లేదు. భారతదేశంలో ఉన్న పరిస్థితులకు, పరిసరాలకు అనుగుణంగా వ్రాసిన పాఠాలు ఇక్కడ నివసిస్తున్న పిల్లలకు సరిపడవు. ఉదాహరణకు ‘అమ్మ’ బొమ్మను మల్లెపూలతో చక్కగా అలంకరించి ‘అ’ అంటే అమ్మ అని చదివిస్తాం. కానీ ఇక్కడి పిల్లలు ఎప్పుడూ అమ్మ జడలో మల్లె పూలు చూసి ఎరుగరు. చదివితే వింతగా వుంటుంది. అర్ధం కాదు కూడాను. ఇటువంటి వాటిని పరిశీలించి ఇక్కడి పిల్లల మానసిక పరిస్థితులను, ప్రవర్తనావళిని గుర్తించి అవసరమైన మార్పులు చేసి ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వ్రాయడం జరిగింది. ఈ పుస్తకాలు హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షులు శ్రీ శివా రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. పలువురు ప్రముఖులు ప్రశంసలు అందించారు. అందులో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు కూడా వున్నారు.
1. అక్షర పరిచయం
2. సంభాషణ పరిచయం
3. పద పరిచయం
4. వ్యాకరణ పరిచయం
వీటిలో తెలుగులో వున్న పదాలకు ఆంగ్లంలో కూడా ఎలా పలకాలో వ్రాసారు.

Rachakonda_formula

ఇవే కాకుండా 20 టాకింగ్ చార్ట్స్, కొన్ని ఆటలు, బడి నడపడానికి కావలసిన కొన్ని అడ్మినిస్ట్రేటివ్ మేన్యువల్స్ కూడా వ్రాసారు. వీటితో సిడ్నీ తెలుగు సంఘం అధ్వర్యంలో ప్రస్తుతం 5 తెలుగు బడులు నిర్వహించబడుతున్నాయి.

2014లో ఆస్ట్రేలియా భువన విజయం ప్రచురించిన కవితాస్త్రాలయ పుస్తకంలో శ్రీ మల్లిక్ గారు “భామనే సత్య భామనే” అన్న ఒక మంచి కధ వ్రాసారు.

అంతర్జాలంలో తెలుగు నేర్చుకోవడానికి www.letslearntelugu.com.au అనే వెబ్సైటును నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా quizlet అనే మొబైల్ అప్లికేషను ద్వారా సుళువుగా తెలుగు నేర్చుకోవడానికి సదుపాయం కల్పించారు. ఈ మొబైల్ అప్లికేషనులో ఉన్న ఎలక్ట్రానిక్ పుస్తకాలూ, చార్టులు అన్నీ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. MR_Telugu కోసం శోధిస్తే ఇవన్నీ కనపడతాయి.

మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో కొన్ని ప్రతులను అనువాదం చేసి ఇవ్వడం జరిగింది.

ముందు ముందు ఈ పుస్తకాలనుపయోగించి ఆస్ట్రేలియాలోని ప్రతీ రాష్ట్రంలో ఇతర అంతర్జాతీయ భాషల లాగానే తెలుగును కూడా పాఠ్యాంశముగా చేర్చి తెలుగు నేర్చుకోవాలన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడాలన్న తపనతో గత దశాబ్ద కాలం కృషి చేస్తున్న శ్రీ మల్లిక్ గారి కల ఫలించాలని తెలుగుమల్లి కోరుకుంటుంది. ఈ బృహత్కార్యానికి అన్ని తెలుగు సంఘాలు, సమాఖ్యలు తోడుగా నిలవాలని మనవి చేసుకుంటుంది.

దివ్యమైనది మా మాట పలుకరో నీ నోట
పరదేశీయులు కూడా కడుమేచ్చేనంట
‘ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ గా పెరుగాంచెనట
అమ్మ భాషను మించినది అవనిలో లేదంట

Send a Comment

Your email address will not be published.