అయ్యవారికి చాలు ఐదు వరహాలు...

దుర్గే స్మృతా హరసి భీతి మశేషజంతో
స్వస్తైహ స్మతా మతిమతీవ శుభాంద దాసి
దారిద్ర్య దుఃఖ భయహారిని కాత్వదన్యా
సర్పోకార కరుణాయ దయార్ద్ర చిత్తా

శ్రీ దుర్గా దేవిని ఇంద్రాది దేవతలు ఈ విధంగా కీర్తించారు.

 

ఆదిశక్తి త్రిగుణాత్మక సృష్టికి మూలం. సమస్త సృష్టికి మూలం.

జగన్మాతను ఆరాధించేందుకు అనేక సంప్రదాయాలు ఉన్నాయి. సాత్విక విధానం నుంచి తామసిక విధానం వరకు ఆరాధించే విధానాలు ఉన్నాయి.

తనను నమ్మిన వారికి ఎటువంటి కష్టాన్ని కలుగనివ్వక రక్షిస్తుంది దుర్గామాత. దుర్గము అనే రాక్షసుడిని సంహరించింది కనుక దుర్గ అనే పేరు వచ్చినట్టు చెప్తారు.

నవరాత్రుల సమయంలో దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో ఉపాసిస్తారు. వాటినే నవదుర్గలు అంటారు.

అవి….శైలపుత్రి. బ్రహ్మచారిణి. చంద్ర ఘంటా. కూష్మాండా. స్కందమాత. కాత్యాయని. కాలరాత్రీ. మహాగౌరి. సిద్ధిద.

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు శరద్ వేడుకలు జరుపుతారు. వీటిలో ముఖ్యంగా పాడ్యమి నుంచి నవమి వరకు దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు. మన దేశంలో భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా జనమంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న పవిత్రం పర్వం ఇది. నవరాత్రులలో కలశపూజ, కుమారి పూజ, సహస్రనామావళి, శ్రీ చక్ర ఆరాధన, సప్తశతీ పారాయణ ఎంతో ముఖ్యమైనవి. .

శ్రీ దేవి తన మహాలక్ష్మి అంశతో మహిషాసురుని వదించినది ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజు. అంతకుముందు ఎనిమిది రోజులు యుద్ధం చేసింది. అలాగే లలితాంబికగా భండాసుర వధ కూడా ఈ నవమినాడే జరిగింది. అందుకే పదవ రోజున విజయదశమిగా సంబరాలు చేసుకోవడం కద్దు.

శ్రీదేవి విజయగాధ స్మరణమే ఈ నవరాత్రి ఉత్సవాలు. శ్రవణా నక్షత్రం, దశమి తిది కలిసిన రోజునే విజయదశమిగా జరుపుకోవడం సహజం. అజ్ఞాతవాసంలో పాండవులు ఆయుధాలను భద్రంగా దాచి ఉంచిన శమీ వృక్షాన్ని, ఆయుధాలను విజయం కోసం పూజ చేయటం అనేది ఆ నాటి నుండి వాడుకలోకి వచ్చింది. కనుకనే విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తారు.

దసరా పండుగ అనగానే పిల్లల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా పాటిస్తున్నారో లేదో కానీ దసరా నవరాత్రి రోజులలో ఉపాధ్యాయులు తమ విద్యార్దులతో విల్లంబులు, రంగురంగుల కాగితాలతో జండాలు, కోతి బొమ్మలు తయారు చేసి దసరా పాటలు పాడుతూ గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి జయీ భవా దిగ్విజయీ భవా …అయ్యవారికి చాలు అయిదు వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు అంటూ పాడుతారు.

ఈ సమయంలో రైతులను పొగడటం కూడా ఉంటుంది. ఎందుకంటే శరదృతువులోని ఆశ్వీయుజ మాసంలో రైతులు పంట పొలాల్లో కృషి మొదలుపెట్టి నాట్లు పూర్తి చేసుకుని మంచి పంటలు పండాలని ప్రకృతిని, దేవతలను ప్ర్రార్దిస్తారు. వారి శ్రమకు జయం కలగాలని పాడిపంటలతో లోకమంతా విలసిల్లాలని కోరుకుంటారు.

పంచభూతాలకు , అష్ట దిక్కులకు సర్వప్రాణ కోటికి తిరిగి వచ్చే విజయదశమి వరకు జయం కలగాలని ప్రార్ధిస్తారు.

మన దేశంలో కలకత్తాలోనూ, విజయవాడలోని కనకదుర్గాదేవి ఆలయంలోను, మైసూరులోను దుర్గాపూజలు ఘనంగా నిర్వహిస్తారు. కలకత్తాలో సుప్రసిద్ధ కాళీమాత ఆలయం ఉంది. దీనిని కాళీఘాట్ అని కూడా అంటారు.

దసరాల సరదాలు మనలో చైతన్య శక్తిని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సాధనలో జీవితాన్ని ఓ మలుపు తిప్పుతాయి. చెడుని తొలగించి మంచిని వెలిగించే సోపానం దసరా. అందుకే మరొక్కసారి ఆ లలితాత్రిపుర సుందరి కరుణా కటాక్షాలు అందరికి కలగాలని ఆశిద్దాం.

Send a Comment

Your email address will not be published.