అరవై ఏళ్ళ "తెనాలి రామకృష్ణ"

తెలుగు చలనచిత్ర రంగంలో తెనాలి రామకృష్ణ సినిమాలు రెండు సంస్థలు నిర్మించాయి. మొదటి సారి రోహిణీ పతాకం మీద దర్శక నిర్మాత హెచ్ ఏం రెడ్డి రూపొందించారు. ఈ తెనాలి రామకృష్ణ 1941 లో విడుదల అయ్యింది. విశేష ప్రజాదరణ పొందిన ఈ చిత్రంలో ఎస్ పీ లక్ష్మణ స్వామీ ప్రధాన పాత్ర పోషించారు. ఎల్ వీ ప్రసాద్ రెండు పాత్రలు పోషించారు. ఒకటేమో మంత్రి తిమ్మరుసు పాత్ర, మరొకటి పెళ్ళిళ్ళ పేరయ్య. ఈ చిత్రంలో హాస్యం ప్రధానం.

ఇక రెండో సారి తెనాలి రామకృష్ణ చిత్రం 1956 జనవరి 12వ తేదీన విడుదల అయ్యింది. ఈ చ్గిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత బీ ఎస్ రంగా విక్రం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సమర్పించారు. ఊహించని రీతిలో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి రాష్ట్రపతి రజత పతకం దక్కింది. ఈ చిత్రం మూడు భాషల్లో విడుదల అయ్యింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం భాషలలోను ఈ చిత్రం విడుదల అవడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు తెనాలి రామ కృష్ణ పాత్రను, కృష్ణ దేవరాయలు పాత్రను ఎన్ టీ రామారావు పోషించారు. భానుమతి, జమున, సంధ్య, మిక్కిలినేని, రాజనాల, వంగర, సురభి బాలసరస్వతి తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. సి కె వెంకట రామయ్య రాసిన నాటకం ఆధారంగా చేసుకుని నిర్మించిన ఈ చిత్రానికి సముద్రాల రాఘవా చార్య మాటలూ, పాటలూ రాశారు. రంగసాని పాత్రను భానుమతి పోషించారు. తిమ్మరుసుగా చిత్తూరు నాగయ్య నటించారు. ఆ రోజుల్లో రచయితగా అంతగా పేరు ప్రఖ్యాతులు లేని అత్రేయ ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. కానీ ఆ చిన్న పాత్ర చేయడానికి ఆత్రేయ నిరాకరించారు. అది తన స్థాయికి తగిన పాత్ర కాదని వెళ్ళిపోయారు.

ఎం.ఎస్. విశ్వనాథన్, రామమూర్తి సంగీతం స్వరపరిచారు. ఘంటసాల, భానుమతి, పి. సుశీల తదితరులు పాటలు పాడారు. ఈ చిత్రంలో పద్యాలు కానివ్వండి, పాటలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి ఇవన్నీ కలిసి మొత్తం 27 దాకా ఉన్నాయి. వీటిలో మేక తోకకు మేక మేక తోకా మేక తోక మేక అంటూ తెనాలి రామ కృష్ణుడు వికట కవిత్వం గా పలికినది చిత్రానికే హైలైట్. కవితాపరమైన తెనాలి రామకృషుని కథకు కాస్త రాజకీయ వ్యవహారం కూడా జోడించడం వాళ్ళ కథ ఆద్యంతం పట్టుగా సాగి ప్రేక్షకుల మన్ననలు పొందింది.

ఈ చిత్రం ఇప్పుడు విడుదల అయినా ప్రేక్షకులను అలరించకమానదు

Send a Comment

Your email address will not be published.