అరవై ఏళ్ళ లో "రోజులు మారాయి"

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు చాలేనే ఉన్నాయి. వాటిలో ఒకటి “రోజులు మారాయి” ఈ చిత్రం 1955 లో విడుదల అయ్యింది.

తాపీ చాణక్య దర్శకత్వంలో సారధీ సంస్థ నిర్మించిన చిత్రమే రోజులు మారాయి. దర్శకుడిగా తాపీ చాణక్యకు ఇది రెండవ చిత్రం. తమిళంలో ఈ చిత్రాన్ని “కాలం మారిపోచ్చు” అనే టైటిల్ తో నిర్మించారు.

తెలుగు రైతు జీవితానికి దగ్గరగా ఉండటంతో ఈ చిత్రం ఆరోజుల్లో పెద్ద హిట్ అయ్యింది. హైదరాబాదులో రజతోత్సవం జరుపుకున్న మొదటి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. షావుకారు చిత్రంలో జానకి తొలిసారిగా ఎన్ టీ రామారావు సరసన నటిస్తే రోజులు మారాయి చిత్రంలో అక్కినేను నాగేశ్వర రావు జోడీగా మొదటిసారిగా నటించింది.

ఈ చిత్రంలో “ఆడుదుమా జోడు కలిసి పాడుదుమా…. “, అలాగే “ఏరువాక సాగారోరన్న చిన్నన్న…” పాటలు ప్రతి వారికీ నోటికి వచ్చు అనడం అతిశయోక్తి కాదు. ఈ చిత్రానికి తాపీ ధర్మా రావు నాయుడు మాటలు రాయడమే కాదు కొన్ని పాటలు కూడా రాశారు. మిగిలిన పాటలు కొసరాజు రాశారు.

వహీదా పాల్గొన్న ఏరువాక పాట సన్నివేశం తెర మీద కనిపించడంతోనే ప్రేక్షకులు డబ్బులు వెదజల్లే వారట. ఈ పాటను రాసింది కొసరాజు. ఈ పాటలో తప్పెట వాయిద్యం ఉండటం ఎంతో అవసరమని భావించి దానికోసం ఆయన ఎంతో కృషి చేసారని చెప్తుంటారు. ఆయన కోసం సారధీ వారి రైతుబిడ్డ చిత్రం నాటి తప్పెట దొరికింది. దాన్ని తీసుకుని ఈ పాట కోసం ఉపయోగించడం గమనార్హం. ఈ చిత్రానికి సంగీత దర్శకులు మాష్టర్ వేణు. “ఏరువాక” పాత ట్యూన్ ని ఎస్ డీ బర్మన్ “బొంబాయి కా బాబూ” చిత్రంలో ఉపయోగించారు.

పల్లెటూరులే మన దేశానికి వెన్నెముక ..రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే అంశం ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని నడిపించారు.

అధిక పంటలు పండించే పధకం క్రింద తీసుకున్న రెండు వందల ఎకరాలను అక్రమంగా కౌలుకిచ్చి రైతులవద్ద నుండి ధాన్యాన్ని దోచుకొంటూ ఉంటాడు సాగరయ్య పాత్రలో నటించిన సియ్యస్సార్. ఒకసారి కోటయ్య బంజరు భూమిలో కష్టపడి పండించుకున్న పంటను అక్రమ తీర్పు ద్వారా తన పాలేరుకు సగం పంట వచ్చేలా చేసుకుంటాడు సాగరయ్య. అతని అన్యాయాన్ని కోటయ్య కొడుకైన వేణు పల్లె ప్రజలతో కలసి ఎదుర్కొని అతనికి బుద్ది చెప్పడం తీసిన తీరు రక్తి కట్టింది.వేణు పాత్రలో అక్కినేని, రాధ పాత్రలో జానకి, పోలయ్య పాత్రలో రేలంగి, కరణం పాత్రలో రామనా రెడ్డి, గోపాలం పాత్రలో వల్లం నరసింహా రావు, భారతి పాత్రలో అమ్మాజీ తదితరులు నటించారు. హీరో తల్లిదండ్రులుగా హేమలత, పెరుమాళ్ళు నటన ఎంతో సహజంగా ఉంది.

– యామిజాల

Send a Comment

Your email address will not be published.