అలీ నియమనిష్టలు

దక్షిణాదిలోని బిజీ కమేడియన్లలో అలీ ఒకరు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోను నటించిన ఆయన ఇప్పటివరకు వెయ్యి చిత్రాలపైనే నటించారు.

ఆయన రంజాన్ మాసంలో పాటించవలసిన నియమాలను కచ్చితంగా ఆచరిస్తారు. అందుకనే ఆయన కనీసం పది రోజులపాటు షూటింగులకు దూరంగా ఉంటారు. ఈ విషయాన్ని ఆయన నిర్మాతలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందుగానే చెప్పి కాల్షీట్లు అడ్జస్ట్ చేసుకుంటారు. ఈ విషయంలో నిర్మాతలు తనకు ఎంతగానో సహకరిస్తారని చెప్పిన అలీ రంజాం మాసంలో ముస్లింలు సహజంగా బయటకు వెళ్ళరని, షాపింగ్ కూడా అంతగా చేయరని అన్నారు.

సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం లోపు తినడం, తాగడం, పొగ తాగడం వంటివాటికి అక్షరాలా దూరంగా ఉండే అలీ రోజుకు అయిదు సార్లు ప్రార్ధనలు చేస్తారు. ఇఫ్తార్ పార్టీలు కూడా పరిమితంగానే చేస్తారు. కేవలం మిత్రులు, కుటుంబ సభ్యుల వరకే ఈ పార్టీలను పరిమితం చేసే అలీ ఇంట్లోనే వండిన ఆహారాన్నే భోంచేస్తారు.

ఆయనకు భార్యా, తల్లీ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లి పేరు జైతూన్ బీబీ. భార్య పేరు జుబైదా సుల్తానా బేగం. పెద్ద కూతురు పేరు ఫాతిమా రమేజున్, చిన్నమ్మాయి పేరు జువారియా మీటి. కొడుకు పేరు అబ్దుల్ సుభాన్. తమ్ముడు ఖయ్యూమ్ కూడా అలీతోనే ఉంటారు. అలీ తమ్ముడు కూడా నటుడే.  ఆయన సోదరీమణులకు పెళ్ళిళ్ళు అయ్యాయి. వీళ్ళు రాజమండ్రి, విజయవాడలలో స్థిరపడ్డారు.

అలీ పెద్ద కూతురుకు పద్నాలుగేళ్ళు. ఆమె కూడా తమ మతాచారాలను పాటించడం విశేషం. తమలో పిల్లలకు పదేళ్ళు రావడంతోనే ప్రార్ధన ప్రాధాన్యం తెలియచెప్తానని, రోజా పాటిస్తారని అలీ అన్నారు.

రాజమండ్రికి చెందిన అలీ చిన్ననాడే వెండితెరకు పరిచయమయ్యారు. ఆయన సినీ పరిశ్రమకు వచ్చి ఇప్పటికే ముప్పై అయిదేళ్ళు పూర్తయ్యాయి. నటన ద్వారా తనకు ఇంత పేరుప్రఖ్యాతులు వస్తాయని అస్సలు అనుకోలేదని అలీ చెప్పారు.

ఆయన రాజమండ్రిలో తన  తండ్రిగారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల వల్ల నిర్లక్ష్యానికి గురైన ఓ నలభై మంది సీనియర్ సిటిజన్లకు నెలకు 750 రూపాయల చొప్పున ఇస్తున్నారు. అంతేకాదు, అలీ వారికి అయ్యే వైద్య ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం గమనించదగ్గ అంశం.

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అలీ నందమూరి బాలకృష్ణ తరఫున ప్రచారం చేసారు. దీనిని ఆయన సమర్ధించుకున్నారు ఇలా ….

“నాకు తెలిసిన ఇద్దరు రోగులను బాలకృష్ణ సారధ్యంలో నివహిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రికి పంపితే వారికి ఆయన ఎంతగానో సహకరించారు. ఆ ఇద్దరూ ఇప్పుడు హాయిగా ఉన్నారు. కనుక బాలకృష్ణ గెలుపుకోసం హిందూపురం  నియోజక వర్గంలో ప్రచారం చెయ్యడం సరైనదే కదా?” అని.

Send a Comment

Your email address will not be published.