ఆగిన మురళీరవళి....బాలమురళి !!

నింగికి గానగంధర్వం….

Balamurali krishna

గానగంధర్వం తనివితీరా మనకు పాటల్ని మిగిల్చి విశ్రాంతిలోకి వెళ్ళింది….

ఒకటా రెండా….ఇరవైయిదు వేలకుపైగా కచేరీలు….నాలుగు వందల సినిమాలకు పైగా సంగీత స్వరాలూ అందించిన ఘనత…

ఎవరో చెప్పినట్టు మనం త్యాగయ్యను, అన్నమయ్యను చూడలేదు. వారి కీర్తనలలో వారిని చూడటమే…అయితే ఈ వాగ్గేయకారుడైన మురళీరవళిని మనం కన్నాం…విన్నాం…

M Balamuralikrishnaపరిచయం అక్కరలేని, మాటలకు అతీతమైన స్వర సుందరుడు అయిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ నవంబర్ 22 వ తేదీన చెన్నైలోని తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు.
కొంతకాలంగా స్వల్ప అస్వస్థతతో ఉన్న ఆయన నవంబర్ 22 తేదీ మధ్యాన్నం ఫలహారం తీసుకుని కాస్సేపు విశ్రమించారు. మరికాస్సేపటికే ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకుపోవడానికి ప్రయత్నించేలోపే కన్నుమూశారు.

ఆయనకు భార్య అన్నపూర్ణమ్మ, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు.

ఆయనకు ఎంతో ఇష్టమైన రాగం మహతి. తానే కనిపెట్టిన ఈ రాగాన్నే తమ నివాసానికి, తమ కూతురికి నామకరణం చేసారు కూడా.

1930వ సంవత్సరం జూలై 6 తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా శంకరగుప్తంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన బాలమురళీకృష్ణ విశ్వవిఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు. కవి. వాగ్గేయకారుడు.

తండ్రి పట్టాభిరామయ్య దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న బాలమురళీకృష్ణ ఆరో ఏట తొలి కచేరీ చేయడం ద్వారా బాల మేధావిగా అనిపించుకున్నారు. ఆలిండియా రేడియో లో మొదటిసారిగా పదకొండో ఏట కచేరీ చేసిన ఆయనకు వీణ, వేణువు, కంజీరా, మృదంగం, వయోలిన్ తదితర వాయిద్యాలు వాయించడం వచ్చు.

ఆత్మాభిమానానికి అధికప్రాధాన్యం ఇచ్చే ఆయన కొన్నేళ్ళపాటు ఆంధ్రదేశానికి ఆమడదూరంలో చెన్నైలోనే ఉండిపోయారు. తనకు అహంకారం ఉందని ఎవరేమన్నా పట్టించుకోని ఆయన శాస్త్రీయ సంగీతాన్ని హిమాలయమంత ఎత్తుకు తీసుకుపోయిన బాలమురళి 1957లో మొదటిసారిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది తీసిన సతీసావిత్రి చిత్రంలో పోయెనయ్యో యిపుడు నను బాసి అనే గీతాన్ని ఆలపించారు. ఈ పాటను సత్యవంతుడు పాత్రధారి అక్కినేని నాగేశ్వర రావుపై చిత్రీకరించారు. వసంత గాలికి Naradaవలపులు రేగ (శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు), మమతాను బంధాల గూర్చి ఆర్ద్రత అంటే ఏమిటో తెలిసేలా ఆరుద్ర రాసిన గీతం “ఏటిలోని కెరటాలు ఎక్కడికీ పోవు… “ (ఉయ్యాల జంపాల), మౌనమే నీ భాష ఓ మూగ మనసా (గుప్పెడు మనసు చిత్రం రచన ఆత్రేయ), పాడనా వాణి కల్యాణిగా….(మేఘసందేశం) తదితర పాటలతో అలరించిన బాలమురళి సినీ ప్రస్థానంలో చెప్పకోదగ్గ అంశం ….భక్తప్రహ్లాద. ఈ చిత్రంలో ఆయన నారద పాత్ర పోషించిన బాలమురళి వరమొసగే వనమాలీ తదితర ఎన్నో హాయి గొలిపే గీతాలు ఆలపించి సంగీత ప్రియులకు విందు చేసిన మహానుభావులు బాలమురళి.

లెక్కలేనన్ని బిరుదులు, పురస్కారాలు పొందిన బాలమురళి కర్నాటక సంగీతకళాకారులలో మూడు జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర తదితర బిరుదులూ పొందిన ఆయన సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో కూడా నటించారు. ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన పొందిన ఆయన తన పదమూడవ ఏట తల్లి సూర్యకాంతాన్ని కోల్పోయారు. దానితో ఆయన అమ్మమ్మగారి ఊరైన గుడిమెళ్ళంకలో తండ్రి కనుసన్నల్లో పెరిగారు. తన దగ్గర ఓనమాలు నేర్చుకున్నప్పటికీ కొడుకులోని సంగీత ప్రతిభను గుర్తించి తండ్రి పట్టాభిరామయ్య పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్దకు శిష్యరికానికి పంపించారు.

ఆయనలోని సంగీత ప్రజ్ఞను మెచ్చి తల్లిదండ్రులు మురళీకృష్ణ అని నామకరణం చేయగా ప్రముఖ విద్వాంసులు ముసునూరి సత్యనారాయణ ఆ పేరుకు ముందు “బాల” అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలవడం మొదలుపెట్టారు.

దేశ విదేశాలలో ఇరవై అయిదు వేలకు పైగా కచేరీలు చేసిన ఆయన తన గాత్ర మధురిమతో గమకాలకు ఒ అందం తీసుకొచ్చారు. అవి ఆయన కంఠంలో అంత పొందికగా ఎలా ఒదిగగిపోయాయో చెప్పలేం. తన గాన మాధుర్యంతో అందరినీ మంత్రముగ్దులను చేసిన బాలమురళి హిందుస్తానీ సంగీతంలోని ప్రముఖ సంగీతకారులతో కలిసి పని చేయడమే కాకుండా జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకు ఆద్యులయ్యారు. ఆయన మొదటిసారిగా ఈ తరహా జుగల్ బందీ కచేరీ పండిట్ భీమ్ సేన్ జోషితో కలిసి ముంబయిలో నిర్వహించారు. జుగల్ బందీ తరహా కచేరీలు ఆయనకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ తెచ్చిపెట్టింది అనడం అతిశయోక్తి కాదు.
తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరి పీఠం ఆస్థాన విద్వాంసులుగా ఉండిన ఆయన మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొత్త రాగాలను ఆవిష్కరించారు కూడా.

నాలుగు వందల బాణీలతో డెబ్బై రెండు మేళకర్త రాగాలకు ఒక్కో కృతిని సమకూరుస్తూ కీర్తనలు రాసి స్వరపరచిన బాలమురళి సూర్యకాంతి పేరుతో ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేసారు.
తనను విమర్శించే కొద్దీ వాటి నుంచే తన సామర్థ్యాన్ని మరింత పెంచుకున్నానని చెప్పుకున్న బాలమురళికి సంగీతమే సర్వస్వం. వేదికపైకి వెళ్ళడంతోనే ఆయనలో సంగీతం ఒక ప్రవాహంలా సాగిపోయేది.
ఇంట్లో సాధన చేయడం చాలా అరుదని, అందుకే తన కచేరీలకు కుటుంబ సభ్యులందరూ హాజరవుతూ ఉంటారని చెప్తుందే వారు బాలమురళి.

భక్త రామదాసు ఆలపించిన ఏ తీరుగ నన్ను దయచూచెదవో అనే కీర్తనను ఎక్కువగా ఎంతో ఇష్టంగా ఆలపిస్తూ ఉండే ఆయన ఇక లేరన్న వార్త సంగీత ప్రియులను, ఆయన శిష్యులను శోకసముద్రంలో ముంచేసింది. ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కే. చంద్రసశేఖర రావు తీవ్ర సంతాపం తెలిపారు. విషయం తెలియడంతోనే ఎందరో ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి బాలమురళి భౌతికకాయానికి నమస్కరించి నివాళులు అర్పించారు.

ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ బాలమురళి పాటలతో మనతోనే ఎల్లకాలమూ ఉంటారు.

Send a Comment

Your email address will not be published.