ఆగిన 'లక్ష్మణ్' రేఖ

భారత దేశపు పత్రికారంగంలో ఒకే పత్రికలో అయిదు దశాబ్దాలు కార్టూనిస్టుగా పని చేసిన వారు ఒక్క ఆర్ కె లక్ష్మణ్ మాత్రమే. ఆ ఘనతను సాధించిన  ఆర్.కె.లక్ష్మణ్ రేఖ జనవరి 26న (2015) అంటే గణ తంత్ర దినోత్సవం రోజు ఆగిపోయింది. ఆయన వయస్సు 94 సంవత్సరాలు.

ఆర్ కె లక్ష్మణ్ గా సుప్రసిద్ధులైన లక్ష్మణ్ పూర్తి పేరు రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్.

1921 అక్టోబర్ 23న జన్మించిన ఆర్ కె లక్ష్మణ్  రాజకీయ వ్యంగ్య చిత్రకారులలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు.  ముంబై నుండి ప్రచురితమవుతున్న ఇంగ్లీష్ దిన పత్రిక “టైమ్స్ ఆఫ్ ఇండియా” లో ప్రతిరోజూ మొదటి పేజీలో కామన్ మాన్ రేఖతో లక్షలాది చూపుల మనసులకు దగ్గరయ్యారు. ఆయన గీసిందే రేఖ….అంతే తప్ప ఎవరో ఏదో చెప్పి గీయించడం అనేది లేదు. ఆయన రేఖను ఎవరూ కట్టడి చేసే వారు కాదు. సమాజంలోని మధ్యతరగతి వారి మనసులను ఇట్టే పట్టేసే రేఖలు ఆర్ కె లక్ష్మణ్  వి.  .

అందుకే ఆయనను Common Man  సృష్టికర్తగా అభివర్ణిస్తారు. ఆయన గీచే కార్టూన్లలో సామాన్య వ్యక్తి చూసే వారందరినీ పలకరించే వాడు. నవ్వించే వాడు. మాట్లాడే వాడు.

కార్టూన్లు వెయ్యటంలో ఉన్న ఆనందానికి మరేది సాటి అని పడే పడే చెప్పుకునే ఆర్ కె లక్ష్మణ్ తనకు ఆ కళ పుట్టుకతో వచ్చిందనే వారు.

వీరనీ వారనీ లేదు… తన భావానికి సరిపోయే రాజకీయ నాయకులందరి పైనా కార్టూన్లు వేసి రాజకీయ వేదికను సన్మార్గంలో నడిపించడానికి ఆర్ కె చేసిన కృషి అంతా ఇంతా కాదు. అందుకే ఆయనంటే రాజకీయ నాయకులకు యెనలేని గౌరవం.

ఆయన 2003లో తీవ్ర అనారోగ్యంతో  ఆసుపత్రిపాలైనప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని రాజకీయనాయకులు కోరుకున్నారంటే అది ఆయన రేఖపట్ల ఉన్న ప్రేమకు ఓ తార్కాణంగా చెప్పుకోవచ్చు.

కర్నాటకరాష్ట్రంలోని  మైసూర్ లో ఓ  తమిళ కుటుంబంలో పుట్టిపెరిగిన ఆర్ కె లక్ష్మణ్  తండ్రి ఓ పాఠశాల హెడ్మాస్టర్.  ఆ హెడ్మాస్టర్ దంపతులకు ఆరుగురు పిల్లలు. వారందరిలో కడపటి వారే ఆర్ కె లక్ష్మణ్. ఆర్ కె నారాయణ్ లక్ష్మణ్ అన్నయ్యే. సోదరుడు ఆర్ కె నారాయణ్ రాసిన కథలకు ఆర్ కె లక్ష్మణ్ బొమ్మలు వేసారు. ఆయన మొదట పెళ్లి చేసుకున్న భార్య పేరు బేబీ అలియాస్ కుమారి కమల. ఆ తర్వాత ఆమె కమలా లక్ష్మణ్ అయ్యారు. అనంతరం వీరు విడిపోయారు. ఆమె నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆర్ కె లక్ష్మణ్ పిల్లల పుస్తకాలు రాసే రచయిత్రిని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు కూడా కమలే. 2003లో ఆయనకు స్ట్రోక్ వచ్చి ఎడమ వైపు  పక్షపాతంతో బాధ పడ్డారు. ఈ అనారోగ్యం నుంచి కొంత కోలుకున్నా 2010 జూన్ 20వ తేదీన మళ్ళీ స్ట్రోక్ రావడంతో ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు.ఆ తర్వాత ఆయన వీల్ చైర్ కు పరిమితమయ్యారు.  రామ్ జెత్మలానీ వంటి ప్రముఖులు తరచూ ఆయన నివాసానికి వెళ్లి పలకరిస్తుండే వారు.

బాల్యం నుంచే బొమ్మల పుస్తకాలు చూస్తూ ఆనందించే ఆర్ కె లక్ష్మణ్  బొమ్మల కార్టూన్ పుస్తకాలను తనకు చదవటం రాకముందే చూసారు. ఆ విధంగా బొమ్మల పుస్తకాలు చూసీ చూసీ ఆయనలోను బొమ్మలు వెయ్యాలన్న ఆసక్తి పెరిగింది.  మొదట్లో  నేల పైనా, గోడల పైనా , తలుపుల పైనా  బొమ్మలు వేస్తూ వచ్చిన ఆర్ కె లక్ష్మణ్ పాఠాలు చెప్పే పంతుళ్ళపై  కూడా వ్యంగ్య చిత్రాలు వేసారు. ఎవరైనా ఏదైనా అనుకుంటారు అనే జంకూ బొంకూ ఉండేది కాదు. .

చిన్నప్పుడు ఆయన క్రికెట్ కూడా ఆడేవారు. ఆయన ఉన్న చోట స్థానికంగా ఒక క్రికెట్ టీం ఉండేది. ఆ టీం పేరు రఫ్ అండ్ టఫ్ అండ్ జాలీ. దానికి ఆయనే కెప్టన్.

ఆయన స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే తండ్రి పోయారు. అప్పుడు ఆయన చదువుసంధ్యలను అన్నయ్యలే చూసుకున్నారు.

హై స్కూల్ చదువు తర్వాత ఆయన బాంబే వెళ్లి అక్కడ జె జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదవాలనుకుని దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆయన దరఖాస్తును ఆ స్కూల్ తిరస్కరించింది. ఆయనలోని ప్రతిభ తమ సంస్థకు సరిపోదని  జె జె స్కూల్ ఆఫ్ యాజమాన్యం చెప్పింది. దానితో ఆయన మైసూరు వెళ్లి అక్కడి మహారాజ కాలేజీలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి డిగ్రీ పొందారు. ఒకవైపు కాలేజీ చదువుతోపాటు మరోవైపు ఫ్రీలాన్సర్ గా ఆయన బొమ్మలు గీస్తూ స్వరాజ్య అనే పత్రికకు కార్టూన్లు పంపిస్తూ ఉండే వారు.

అవి అచ్చయ్యేవి కూడా. వాటికి మంచి ఆదరణ కూడా లభించింది.  తన సోదరుడు ఆర్ కె నారాయణ్ కథలకు లక్ష్మణ్ బొమ్మలు గీస్తుందే వారు. అవి ది హిందూ పత్రికలో వచ్చేవి. అలాగే స్థానిక పత్రికల్లో రాజకీయ కార్టూన్లు గీస్తుండే వారు. అప్పట్లో డాక్టర్ ఎం శివరాం అనే ఆయన స్థాపించిన కొరవంజి అనే హ్యూమర్ మ్యాగజైన్ వచ్చేది. ఆ పత్రికకు ఆర్ కె లక్ష్మణ్ క్రమం తప్పక బొమ్మలు వేసేవారు.

మద్రాస్ (ఇప్పుడు చెన్నై) లోని జెమినీ స్టూడియో లో ఆయన  కొంతకాలం పని చేసారు.  ఆ తర్వాత ఫ్రీ ప్రెస్ జర్నల్ (బాంబే) లో ఆయనకు ఫుల్ టైం పొలిటికల్ కార్టూనిస్టుగా ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆయన సహా ఉద్యోగి బాల థాకరే (శివసేన అధినేత) తో పరిచయమేర్పడింది.  మరికొంత కాలానికి ఆర్ కె లక్ష్మణ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ పత్రికలో యాభై ఏళ్ళ పాటు పనిచేసారు. ఆ పత్రిక మొదటిపేజీలో ఆయన కార్టూన్ వచ్చేది.   సామాన్య మానవుడు (కామన్ మాన్) పుట్టింది అక్కడే. ఆ కార్టూన్ శీర్షిక యు సెడ్ ఇట్.

ఆయన ఒక కార్టూన్ సినిమా (నారద)కు బొమ్మలు వేసారు. ఆయన కుంచెలో జీవం పోసుకున్న కామన్ మాన్ రూపాన్ని ఆధారంగా చేసుకుని ముంబాయిలోని వర్లీ సముద్ర తీరాన ఓ  లోహ  విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. భారత దేశ చరిత్రలోనే ఒక కార్టూన్ పాత్రకు ఒక విగ్రహం ఏర్పాటు చేయడం అదే మొదటిసారి.

ఆయన ఎన్నో పుస్తకాలకు బొమ్మలు వేసారు. ప్రత్యేకించి ఆయన సోదరుడు ఆర్ కె నారాయణ్ మాల్గుడి డేస్ కథలకు ఆర్ కె లక్ష్మణ్ వేసిన బొమ్మలు మరచిపోలేనివి. ఈ మాల్గుడి డేస్ ఆ తర్వాత టీ వీ సీరియల్ గా వచ్చింది.

ఏషియన్ పెయింట్స్ కు ఆర్ కె లక్ష్మణ్ గట్టు అనే మస్కట్ సృష్టించారు. ఆ మస్కట్ కు విశేష ఆదరణ లభించింది. ఆయన కొన్ని కథలు, నవలలు కూడా రాసారు. ఆయన తన జీవిత చరిత్ర కూడా రాసారు. దాని పేరు టన్నెల్ ఆఫ్ టైం. హిందీచిత్రం మిస్టర్ అండ్ మిసస్ లోను, తమిళ చిత్రం కామరాజ్ లోను ఆయన కార్టూన్లు దర్శనమిచ్చాయి. ది స్టార్ ఐ నెవర్ మెట్ అనే సిరీస్ కి ఆయన ఫిలిం ఫేర్ మ్యాగజైన్ లో కార్టూన్లు వేసారు.

ఆయన అందుకున్న అవార్డులు లెక్కలేనన్నివి. వాటిలో బీ డీ గోయెంకా అవార్డు, దుర్గా రతన్ స్వర్ణ పతకం, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ , రాన్మాన్ మగసేసే వంటివి ఉన్నాయి. .2008లో సి ఎన్ ఎన్ ఐ బీ ఎన్ జర్నలిజంలో లైఫ్ టైం అచీవ్ మెంట్ పురస్కారంతో ఘనంగా సత్కరించింది.

2015 జనవరి 17వ తేదీన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆర్ కె లక్ష్మణ్ నిన్న (జనవరి 26) తుదిశ్వాస విడిచారు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.