ఆత్మ గౌరవం (Self Esteem)

అంటే ఏమిటి?

Confidenceఆత్మ గౌరవం, మన గురించి మనం ఆలోచించే విధానం మరియు మనల్ని మనం విలువ కట్టే పధ్ధతి.  ఇదొక జటిలమైన అంశం, అంతఃకరణంగా మదన కారకం కూడాను.  ఈ ప్రపంచంలో “నా” అవసరం వుందా లేదా వుంటే ఎంతవరకు అన్న ప్రశ్నలకు దారి తీస్తుంది.  ఆత్మ గౌరవం ఒక రకంగా మనల్ని మనం గౌరవించుకోవడంలోని అభిప్రాయం, మనల్ని మనం ఇష్టపడే ఆలోచనా సరళి.   అయితే ఆత్మ గౌరవం తగ్గు స్థాయిలో ఉన్నపుడు మనిషి ఆరోగ్యంపై, జీవితంపై ఎక్కువ ప్రభావం చూపడానికి అవకాశం వుంటుంది.

 • ఆత్మ గౌరవం ఎక్కువగా వున్న వ్యక్తి బలమైన భావ చైతన్యం, స్వాభిమానం, అతి నమ్మకం, తన గురించి తాను మంచిగా ఆలోచించడం, ఆత్మాభిమానం కలిగియుండడం జరుగుతుంది.
 • ఆత్మ గౌరవం తక్కువగా వున్న వ్యక్తి అహంభావము, అపనమ్మకము, పిరికితనము, అభద్రతా రాహిత్యము, సిగ్గుతనము, తనను తాను అసహ్యించుకోవడం, న్యూనతా భావం మొదలగునవి కలిగి వుంటారు.

గుర్తించడం ఎలా?
ఆలోచనలు:

నీ గురించి నీవు

 • తక్కువ అంచనా వేసుకుంటున్నావా?
 • ప్రతికూలాత్మకంగా ఆలోచిస్తున్నవా?
 • ఎవరితోనైనా విరుద్ధంగా పోల్చుకుంటున్నావా?
 • నిర్ణయాలు సరికావని గానీ, పని చేయలేనన్న తలంపు గానీ వస్తుందా?

స్పందన:

 • నీ యోగ్యతను నీవు తక్కువగా అంచనా వేసుకుంటున్నావా?
 • నీవు అపరాధ భావాన్ని కానీ, తలవంపు భావాన్ని కలిగియున్నావా?
 • ఆత్మ న్యూనతా భావాన్ని కలిగియున్నవా?
 • నిరుత్సాహంతో కూడిన మనో వ్యాకులంతో కూడిన ఏహ్య భావాన్ని కలిగియున్నావా?

ప్రవర్తన:

 • తలపెట్టిన పని, కార్యము చేయలేనన్న భావము కలిగియున్నావా?
 • అవకాశాలను తప్పించుకోవడానికి మార్గాలు వెదుకుతున్నావా?
 • సాధారణంగా పిరికితనం, భద్రలేమి, అపనమ్మకము కలిగియున్నావా?
 • ఇతరులతో మాట్లాడుతున్నపుడు నిన్ను నీవు కించపరచుకుంటావా?
 • ప్రశంసలు గానీ మెచ్చుకోలు గానీ అయిష్టంగా స్వీకరిస్తావా?

కారణాలు

 • బాల్యంలో తలిదండ్రులు కానీ గురువులు కానీ కర్కశ ప్రవర్తనావళి
 • బడిలో విద్వత్సంబంధమైన విషయాలలో వెనుకబడి వుండడం
 • వ్యక్తిగత సంబంధాలు తెగిపోవడం, ఆర్ధికంగా దెబ్బతినడం
 • అనారోగ్య సమస్యలతో బాధపడడం, అంగవైకల్యం
 • అనేక ఒత్తిళ్లకు, మానసిక స్తబ్దతకు గురికావడం

పర్యవసానము

 • ప్రతికూల భావాలు – చింత, వ్యాకులత, విచారము, స్తబ్దత, కోపము, సిగ్గుచేటు, అపరాధ భావము
 • ఎక్కువ శ్రమ పడడానికి అయిష్టత, అప్రేరణ భావం, అసమర్దుడను భావము కలిగియుండడం
 • వ్యక్తిగత సంబంధాలు చెడిపోవడం – ఇతరులతో తక్కువగా సంభాషించడం, క్రొత్త సంబంధాలు పెంచుకోవడానికి అయిష్టత చూపడం, మళ్ళీ పాత చేదు అనుభవాలు ఎదురుపడతాయని భయపడడం
 • ఇతరులు తనను తక్కువగా అంచనా వేస్తారన్న భయం – ఆట పాటల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనక పోవడం, తనగురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నన్న భావంతో అందరినీ కలియ జూడడం
 • క్రొత్త విషయాలు కానీ ఆలోచనలు కానీ దారి చేరకుండా చూడడం, చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న ఆలోచన రావడం
 • ప్రతికూల వాతావరణం ఆవహించి మంచి జరుగుతుందన్న ఆలోచనలకు స్వస్తి చెప్పడం
 • నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం, అన్యమనస్కంగా వుండడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం

మార్పు రావడం ఎలా?

 • నీవు సమర్ధవంతంగా నిర్వహించగల పనులను చేపట్టడం
 • చేపట్టిన పనులు విజయంతం అయితే విజయోత్సాహాన్ని ప్రకటించడం
 • ప్రతికూల ఆలోచనలను త్రిప్పికొట్టడం
 • నీవు మార్పు తీసుకురాగల విషయాల గురించి ఆలోచించడం
 • ఏ విషయాన్ని సంపూర్ణంగా చేయడానికి ప్రయత్నించనక్కర్లేదు
 • తప్పులు చేస్తే విచారించకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం
 • ఇష్టమైన పనులు చేసి అనుకూల ఆలోచనలకు అంకురార్పణ చేయడం
 • నిన్ను ప్రోత్సహించే వారితో సహవాసం చేయడం
 • స్వచ్చందంగా సహాయ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం
 • ఆరోగ్యకరమైన వ్యాయామం చేయడం ద్వారా మానసికావస్థను పెంపొందించడం

అవసరమైతే కుటుంబ వైద్యునితో గానీ, కుటుంబ సభ్యులతో గానీ, మానసిక వద్యునితో గానీ సంప్రదించాలి.

Dr.Sridevi Kolli Clinical Psychologist | Aged Persons Mental Health Team | Monash Health

Send a Comment

Your email address will not be published.