ఆది పూజ బొజ్జ గణపయ్యకే

ganesh chaturthi

వినాయకుడు, సమస్త విశ్వానికి ఆధార శక్తి గణపతి. సృష్టిలో మూలాధార క్షేత్రంలో ఉండేది విఘ్నేశ్వరుడే.

గణపతి ఓంకార రూపి. ఓంకార ఆకారాన్ని తెలియజేసే ఏనుగు మోము వినాయకుడిది.

ఆది స్వరూపమైన ఓంకారమే వినాయకుడు. అందుకే ఆదిపూజ బొజ్జ గణపయ్యకే.

చాంద్రమాన రీత్యా పౌర్ణమి రోజు పూర్వా భాద్ర లేదా ఉత్తరా భాద్ర నక్షత్రం ఉండటం వల్ల భాద్రపద మాసం అంటారు. భాద్ర పద శుద్ధ చవితి రోజున జరుపుకునే పండగే వినాయక చవితి. దేవతా గణాలలో ఆద్యుడు వినాయకుడు. వినాయకుడిని పూజించకుండా హిందువులు ఏ పనీ ప్రారంభించరన్నది అందరికీ తెలిసిందే. విఘ్నాలు తొలగి పోయేందుకు వినాయకుడిని ఆరాధించడం ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు. వేదకాలం నుంచి వస్తున్న సంప్రదాయమే ఇది.

భాద్రపద శుద్ధ చవితి రోజున ప్రణవ స్వరూపుడైన వినాయకుడు మధ్యాన్నం పార్వతీ తనయుడిగా ఆవిర్భవించాడు. ఈ చవితి ఆదివారం గానీ మంగళ వారం గానీ వస్తే ఎంతో ప్రశస్తం. ఆరోజున చంద్ర దర్శనం అయిన దోష పరిహార్ధం వినాయకుడిని పూజించి అక్షతలు శిరస్సున వేసుకోవాలి.

సింహ: ప్రసేన మవధీ: సింహా జాంబవతా హత:
సుకుమారక మారోదీ: తవ హ్యేషస్య మంతక:

అని ఈ శ్లోకం చదివితే చతుర్ధీ చంద్ర దర్శన దోషం పరిహారమవుతుంది.

ఈ కింది విషయం ఇప్పటికే తెలిసినప్పటికీ మరొక్కసారి గుర్తు చేసుకోవడం మంచిదే తప్ప మరొకటి కాదు.

“ఓసారి పార్వతీ దేవి నలుగుపిండితో బొమ్మను చేసి డానికి ప్రాణం పోస్తుంది. అప్పుడు కైలాసంలో శివుడు లేడు. కాస్సేపటికి శివుడు వస్తాడు. శివుడిని ఆ బాలుడు అడ్డుకోవడం, శివుడు కోపంతో బాలుడిని ఖండించడం, మళ్ళీ ఏనుగు శిరస్సు అమర్చి ఆ బాలుడికి ప్రాణం పోయడం, ముల్లోకాలను కనుసైగలతో నడిపించగలిగే తనకే ఈ బాలుడు విఘ్నం కలిగించాడు కనుక విఘ్నేశ్వరుడు అని నామకరణం చేస్తాడు. వినాయకుడికి ఉన్న అనేక పేర్లలో ఇదొకటి….”

అంతేకాదు ఎవరు ఏ కార్యం తలపెట్టినా ఆ పనిలో ఏ విఘ్నమూ కలగకుండా వినాయకుడికి పూజ చేస్తే ఆ పనిలో ఎలాటి ఆటంకమూ కలగకుండా ఉంటుందని శివుడు విఘ్నేశ్వరుడిని దీవిస్తాడు.

ఈ విధంగా నాటి నుంచి పూజలందుకుంటున్న వినాయకుడిని ప్రత్యేకించి భాద్రపద శుద్ధ చవితి నాడు భక్తితో పూజించడం సంప్రదాయంగా వస్తోంది.

ఆరోజు వినాయకుడి వ్రత కథను చదువుకుని అక్షింతలు శిరస్సుపై వేసుకుంటే నీలాప నిందలు రావు.

వినాయకుడి పూజలో ప్రధానమైనది పత్ర పూజ. మాచపత్రి, మునగ పత్రి, గారిక గడ్డి, తులసి పత్రి, మామిడి పత్రి, గన్నేరు పత్రి, ఉత్తరేణి, దేవదారు పత్రి, ఇలా 21 రకాల పత్రాలను ఉపయోగిస్తారు. గణపతికి సంఖ్యా శాస్త్రం ప్రకారం 21 సంఖ్యా అంటే ఎంతో ప్రీతికరం. అందుకే గణపతిని 21 రకాల ఆకులతో, గరికపోచలతో పూజిస్తారు. పువ్వులు సరేసరి, గణపతిలో గణం అంటే సమూహం అని అర్థం.

శ్రీ తత్వ నిధి అనే గ్రంథంలో బాల గణపతి ఇత్యాది వినాయకులు ఉన్నారు. వైవర్త పురాణం గణపతిని శ్రీకృష్ణుడి అంశగా వివరించింది.

వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు, లడ్డు అంటే మహా ప్రీతీ. వీటిని నైవేద్యంగా పెట్టడం ఆచారం.

వినాయకుడికి పూజించిన తర్వాత అరటిపళ్ళు, నెయ్యి, పంచదార, దక్షిణ ఒక బ్రాహ్మణుడికి తాంబూలంగా ఇవ్వాలి.

ఇలా ఉండగా గణపతి రూపాన్ని మట్టితో చేసిన డానికి పూజలు చేయడం మంచిది. రానురాను మట్టి విగ్రహాలను కొనుగోలు చేసి ఆ విగ్రహానికే పూజ చేయడం అనేదానిపై విశేష ప్రచారం చేయడమూ ఎక్కువైంది. మట్టి గణపతిని తయారు చేయడానికి అవసరమైన మట్టిని ఎక్కువగా బెంగాల్ నుంచి తెప్పిస్తారు. నిజానికి గట్టి సంకల్పం మట్టిలోని దైవత్వంలోనే ఉందని తెలుసు కోవడం ప్రధానం గణేష్ మహరాజుకీ జై!!!
– మహిమ

Send a Comment

Your email address will not be published.