ఆర్తి అకాల మరణం

“ఓవర్ నైట్ స్టార్”గా వినుతికెక్కిన ప్రముఖ నటి ఆర్తీ అగర్వాల్ జీవితానికి తెర పడింది. ఆమె గుండెపోటుతో మరణించినట్టు చెప్తున్నా బరువు తగ్గడానికి చేయించుకున్న ఆపరేషన్ వల్లే చనిపోయారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆమె వయస్సు 31 సంవత్సరాలు. ఆమె కొంత కాలంగా స్థూలకాయం, శ్వాసకోశ అనారోగ్యంతో బాధపుతున్నారు. ఆమె కొన్ని రోజుల క్రితం ఆమె బరువు తగ్గడం కోసం ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే ఆ ఆపరేషన్ వికటించి గుండెపోటుకు గురై మరణించినట్టు అనుమానిస్తున్నారు.

ఆర్తీ అగర్వాల్ 1984 మార్చి 5వ తేదీన న్యూ జెర్సీలో స్థిరపడిన ఓ గుజరాతీ కుటుంబంలో పుట్టిన ఆర్తీ బాలీవుడ్ లో నటించడం ద్వారా చలనచిత్ర రంగప్రవేశం చేశారు. ఆమె నటించిన మొదటి హిందీ సినిమా పాగల్ పన్. అప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్ళు. కరణ్ నాథ్ జోడీగా నటించారు. అయితే ఆ సినిమా కన్నా ఆమెకు టాలీవుడ్ లోచేసిన సినిమాలతో మంచి పేరే వచ్చింది. టాలీవుడ్ లో ఆమె చేసిన మొదటి సినిమా నువ్వు నాకు నచ్చావ్. అందులో ఆమె ప్రముఖ హీరో వెంకటేష్ సరసన నటించారు. ఈ చిత్రం అనంతరం ఆర్తీ 2002 లో 5 సినిమాలు (బాబీ, నీ స్నేహం, ఇంద్ర, అల్లరి రాముడు, నువ్వు లేక నేను లేను), 2003 లో మూడు సినిమాలు (వీడే, వసంతం, పల్నాటి బ్రహ్మనాయుడు), 2004లో రెండు సినిమాలు (నేనున్నాను, అడవి రాముడు), 2005 లో అయిదు సినిమాలు (నరసింహుడు, సోగ్గాడు, సంక్రాంతి, బంబారా కన్నాలే – తమిళం, చత్రపతి), 2006 లో అందాల రాముడు , 2008 లో రెండు సినిమాలు (దీపావళి, గోరింటాకు), 2009 లో పోసాని జెంటిల్మాన్, 2015 లో రణం 2 సినిమాల్లో నటించారు. ఆమె అకాల మరణానికి ముందు రోజే రణం – 2 విడుదల అయ్యింది.

పదిహేనేళ్ళు సాగిన తన సినీ కెరీర్ లో ఆమె చేసిన మరో రెండు సినిమాలు విడుదల కావలసి ఉన్నాయి. ఆమె నిజ జీవితంలో చెడు అనుభవాలు చవిచూశారు. 2005 లో ఆమె ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు. ప్రేమ విఫలమైనందు వల్లే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. ఆమె క్లీనింగ్ సొల్యూషన్ పుచ్చుకున్నట్టు తెలిసింది. నటుడు తరుణ్ తో వ్యవహారం వాళ్ళ అని అనుకున్నారు. మరోవైపు ఈ వ్యవహార విషయమై తండ్రితో గొడవపడటం వల్లే  ఆత్మహత్యకు ప్రయత్నించారని కూడా వార్తలు వచ్చాయి.

ఇక 2006 ఫిబ్రవరిలో మరో సంఘటన జరిగింది. తన ఇంట్లోనే ఆమె మెట్లపై నుంచి జారిపదిపోయారు. అంతే మరుక్షణంలో వదంతులు మొదలయ్యాయి. ఆర్తీ అగర్వాల్ మళ్ళీ ఆత్మహత్యకు యత్నించారని. అయితే అప్పుడు ఆమె తండ్రి ఆ వదంతులను ఖండించారు. తన కూతురు మెట్ల మీద నుంచి జారిపడింది తప్ప అది ఆత్మహత్యా యత్నం కాదని ఆయన చెప్పారు. ఆమెను సీరియస్ కండిషన్ లో ఆసుపత్రిలో చేర్చారు. ఆ వెంటనే రంగంలో దిగిన పోలీసులు ఆర్తీ మొత్తం ఫ్యామిలీ తాగిన మత్తులో ఉన్నారని నిర్ధారించారు. అంతే కాదు ఆరోజు కూడా తండ్రీ కూతుళ్ళ మధ్య వాదోపవాదాలు జరిగాయని చెప్పారు.

ఇక 2007 నంబర్ లో ఆమె ఒక ఎన్ ఆర్ ఐ ని పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె భర్త పేరు…ఉజ్వల్ అగర్వాల్. వీరి పెళ్లి హైదరాబాదులో జరిగింది. అయితే రెండు సంవత్సరాల తర్వాత వీరు విడిపోయారు. ఇదిలా ఉండగా, ఆమె ఆరోజుల్లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మీద వచ్చే వదంతులను పట్టించుకోవడం మానేసినట్టు తెలిపారు. ఉన్నవీ లేనివీ రాసే వార్తలకు దూరంగానే ఉంటున్నానని కూడా చెప్పారు. తన సినీ కెరీర్ మానెయ్యాలని ఆయన చెప్పారు. కానీ నేను అందుకు సమ్మతించలేదు. దానితో తేడాలు వచ్చి విడాకులు తీసుకున్నామని ఆమె చెప్పుకున్నారు. అంతదాకా ఎందుకు, ఒక సారి నేను మా సోదరుడితో కలిసి ఎక్కడికో వెళ్తే ఒక పత్రిక ఆర్తీ అగర్వాల్ కొత్త బాయ్ ఫ్రెండ్ అని ఒక వార్త రాసింది. ఇటువంటి వార్తలు తనను ఎంతో ఇబ్బంది పెట్టాయని. తర్వాత్తర్వాత అలాంటి వార్తలను పట్టించుకోవడం మానేసినట్టు ఆర్తీ చెప్పారు.

చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు తదితరులతో కలిసి నటించిన ఆర్తీ కెరీర్ అకాల మరణంతో ముగియడం విచారకరం.

– సమీరా సంధ్య

Send a Comment

Your email address will not be published.