ఆలయ సంపదపై సర్కారు కన్ను

ఒక పక్క రూపాయి విలువ పతనంతోనూ, ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతోనూ ఆర్థికంగా నానా అవస్థలూ పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా దేశంలోని సంపన్న ఆలయాల బంగారం మీద కూడా కన్ను వేసింది. తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాల వివరాలను వెంటనే తెలియజేయాల్సిందిగా ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ దేశంలోని సుమారు 200 సంపన్న ఆలయాలకు లేఖలు రాసింది. ఇటువంటి లేఖలు తిరుమల, తిరువంతపురం వంటి ఆలయాలకు కూడా వచ్చాయి. ఇటీవల తిరువంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఏడు గదుల బంగారు ఆభరణాలు వెలుగు చూశాయి.

నిజానికి, తిరుమల ఆలయం అధికారులు గతంలోనే సుమారు 200 కోట్ల రూపాయల విలువయిన ఆభరణాలను బాంకుల్లో నిలవ ఉంచి ప్రభుత్వానికి తెలియజేశారు. ఆలయాలలోని ఆభరణాలు భక్తులకు చెందినవనీ, వాటిని ఏవిధంగానూ ప్రభుత్వానికి అందజేయడం కుదరదనీ వివిధ ఆలయాల అధికారులు ప్రభుత్వానికి జవాబు ఇచ్చారు. పైగా ఈ ఆభరణాలతో భక్తుల సెంటిమెంట్లు ముడిపడి ఉన్నాయని కూడా తెలిపారు. తిరుమల ఆలయం అధికారులు కూడా దాదాపు అటువంటి జవాబునే పంపినట్టు తెలిసింది. దేశంలోని మొత్తం ఆలయాలలోని బంగారం విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. వాటిని తాకట్టు పెట్టి ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కాలన్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరక పోవచ్చు.

Send a Comment

Your email address will not be published.