ఆస్ట్రేలియాకు శ్రీ శ్రీ ద్వయం

ఆస్ట్రేలియాకు శ్రీ శ్రీ ద్వయం

ఒకరు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు బావుటాను రెపరెపలాడించిన ఘనుడు. ఒకరు తెలుగు కళామతల్లి సేవలో తరించి భావజాలాన్ని నిర్వచించిన నిపుణుడు. ఒకరు రంగస్థల వేదికను శాసించిన సైనికుడు. మరొకరు వెండితెరపై తన మధుర స్వర గానామృతాన్ని అందించిన గాయకుడు. ఒకరు హాస్య రసాన్ని లాలిత్యంతో కుండపోతగా కురిపించగల ధ్వన్యావధాని. మరొకరు సంగీత స్వరాలతో ప్రేక్షకుల మనసులను దోచుకునే ముని. తమ తమ రంగాలలో నిష్ణాతులైన ఇద్దరు తెలుగు బిడ్డలు ఆస్ట్రేలియా లోని మూడు (సిడ్నీ, బ్రిస్బేన్, మెల్బోర్న్) నగరాల్లో వారి మాటల మూటలతో గారడీలు చేసి మన తరతరాల తెలుగు దివిటీలతో ఈ దీపావళిని చిరస్మరణీయంగా తీర్చి దిద్దడానికి వస్తున్నారు. వారే శ్రీ వందేమాతరం శ్రీనివాస్ మరియు శ్రీ మిమిక్రీ శ్రీనివాస్.

వందేమాతరం శ్రీనివాస్

ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పటినుండి పాటలు వినడం, పాడడం నేపధ్యంలో పెరిగి ఒక అసామాన్యమైన ఎత్తుకు ఎదిగిన శ్రీనివాస్ గారు అసలు ఇంటి పేరు “కన్నెవయసు”. ప్రముఖ దర్శకులు శ్రీ టి.కృష్ణ గారి దర్సకత్వంలో వెలువడిన ఆణిముత్యం “వందేమాతరం “ సినిమాలో డా.సి.నా.రె. గారు వ్రాసిన “వందేమాతర గీతం వరుస మారుతున్నది” గీతాన్ని ఆలపించిన తరువాత ఇంటిపేరు “వందేమాతరం “ గా మారిపోయింది.

తాను పాడిన చాలా గీతాలు వినేవారికి భావోద్వేగం కలిగిస్తాయనడంలో సందేహం లేదు. వారి స్వరానికి అంతటి పట్టు వుంది. ఒక గాయకుడిగా చిత్ర పరిశ్రమలో పరిచయమై ఎర్ర సైన్యం, దండోరా, లాల్ సలాం, ఒసే రాములమ్మ, ఎంకౌంటర్, అడవి చుక్క, తెలుగోడు, మిస్సమ్మ మొదలైన చిత్రాలలోని పాటలకు స్వరకల్పన చేసి సంగీత దర్శకుడుగా, నటుడుగా, చిత్ర దర్శకుడుగా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పటికి షుమారు 200 పైగా చిత్రాలలో పని చేసారు. ప్రముఖ గాయకులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర దర్శకులు శ్రీ దాసరి నారాయణ రావు, ప్రముఖ కవి జ్ఞానపీఠ బహుమతి గ్రహీత డా.సి.నా.రె. గార్లతో కలిసి గత 20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో అహర్నిశలూ పని చేసి పలుమార్లు నంది బహుమతులను అందుకున్న శ్రీ శ్రీనివాస్ గారికి మనందరం స్వాగతం పలుకుదాం.

మిమిక్రీ శ్రీనివాస్

64 కళల్లో అనుకరణ అనేది ఒక విలక్షణమైన కళ. మిమిక్రీలో అంతర్జాతీయ స్థాయిలో జేజేలు అందుకున్న శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారి ప్రియ శిష్యుడు, ఆ కళలో అంతటి ఉత్తమ ప్రదర్శనలిచ్చిన శ్రీ మిమిక్రీ శ్రీనివాస్ తన పదిహేనవ ఏటనే మొదటి ప్రదర్శన ఇచ్చి అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన కృషీవలుడు. ధ్వన్యనుకరణ ( వెంట్రిలాక్విజం ) ను చెన్నై లోని ప్రొ. ఎమ్. ఎమ్. రాయ్ గారి వద్ద నేర్చుకుని, అమెరికా లోని కొలరాడో లోని మహేర్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ వెంట్రిలాక్విస్ట్స్ నుంచి పట్టా పొందారు.

శ్రీ శ్రీనివాస్ గారు కూడా తాను ప్రదర్శించే కళనే ఇంటి పేరుగా మార్చుకోవడం వారికి తన కళపై నున్న ప్రేమాభిమానాలకు నిదర్శనం.

దేశ విదేశాల్లో షుమారు 7000 కి పైగా ప్రదర్శనలిచ్చిన శ్రీనివాస్ బహుభాషల్లో తెలుగు, ఆంగ్లము, హిందీ, ఉర్దూ మరియు తమిళ భాషల్లో ప్రదర్శనలివ్వడం ముదావహం. తెలుగులో అవధాన ప్రక్రియ ఒక ప్రత్యేకమైనది. మిమిక్రీ శ్రీనివాస్ అనుకరణలో కూడా ‘ధ్వన్యావధానం ‘ అనే నూతన ప్రక్రియను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. “అద్భుతమైన ధారణా శక్తితో, సమయ స్పూర్తితో శ్రీనివాస్ మిమిక్రీ కళా చరిత్రలో నూతన శకం ప్రారంభించారని” శ్రీ నారాయణ రెడ్డి గారు ప్రశంసించారు. వీరికి “ధ్వన్యవధాన సామ్రాట్” అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. ఆ ఏడాదిలోనే త్యాగరాయ గాన సభలో 32 గంటలు ఏకబిగిని ప్రదర్శననిచ్చి రికార్డుకెక్కారు. ఆస్ట్రేలియా తెలుగువారి తరఫున శ్రీ శ్రీనివాస్ గారికి స్వాగతం.

వచ్చే నెల 7 వ తేదీన బ్రిస్బేన్ నగరంలో, 14 న సిద్నీలోనూ, 15 న మెల్బోర్న్ నగరంలో వీరిద్దరితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

వివరాలకు:

బ్రిస్బేన్: శ్రీ సుదర్శన్ కంటాడి క్వీన్స్ ల్యాండ్ తెలుగు సంఘం అధ్యక్షులు 0423289873

సిడ్నీ: శ్రీ శివశంకర్ పెద్దిభొట్ల సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు 0430190012

మెల్బోర్న్: శ్రీ అనిల్ బైరెడ్డి 0425198252

 

Send a Comment

Your email address will not be published.