ఆస్ట్రేలియాలో ఉగాదికి ప్రత్యెక అతిధులు

తెలుగువారి ఉగాది పండగ గత 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ప్రతీ ఏటా ఒక వినూత్న పద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహించడం సిడ్నీ తెలుగు అసోసియేషన్ ప్రత్యేకత. ఈ దుర్ముఖి నామ సంవత్సరం మరో అడుగు ముందుకు వేసి సిడ్నీలోని తెలుగు సమితితో కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంతో చేయడం ముదావహం. అంతే కాకుండా భారతదేశం నుండి పలువురి కళాకారులను రప్పించి వారిచే సిడ్నీతో పాటు, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా మరియు బ్రిస్బేన్ నగరాల్లో చక్కని కార్యక్రమాలు అందివ్వడానికి సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ శివ పెద్దిభొట్ల నడుం కట్టారు.

చరిత్ర పుటల్లో…
వేప పూవు, మామిడి పిందెలు, వెలగ పండు, కొత్త బెల్లం, చక్కెర, ఉప్పు ఇలా షడ్రుచులు గల ఉగాది పచ్చడి జీవితంలోని పలు భావాలు, ఆలోచనలకు ప్రతిబింబం. సనాతన ధర్మాలకు సాంప్రదాయ పద్ధతులకు జీవితపు విలువలకు అభిముఖంగా నిలచిన మన తరతరాల సంస్కృతికి ఉగాది పండగ ఆయువుపట్టు.

శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. పచ్చగా కళకళలాడుతుంటాయి. రుతువుల్లో వసంతం మనోహరమైనదీ ఆహ్లాదకరమైనదీనూ. రుతువుల్లో వసంతరుతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే సంవత్సర ఆరంభానికి దీన్నే కాలమానంగా తీసుకుని తొలి రుతువుగానూ చెబుతారు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే అంటోంది బ్రహ్మపురాణం. అదే యుగాది. అన్నీ తొలిగా వచ్చే ఆ రోజే తెలుగువారి తొలిపండగ… ఉగాది!

రామపట్టాభిషేకం జరిగిందీ , శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ , కలియుగం ప్రారంభమైందీ ఆ రోజేనని పండితులు చెబుతారు. ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలిమాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడూ , ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడూ సింహాసనాన్ని అధిష్ఠించిందీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్రశుద్ధపాడ్యమినే నూతన సంవత్సర ఆరంభదినంగా కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకుంటారు. సౌరమానాన్ని పాటించే తమిళులు, మలయాళీలు, బెంగాలీలు, సిక్కులు చేసుకునే ఉగాది కూడా వసంతంలోనే రావడం విశేషం.

ప్రత్యేక అతిధులు:
ఈ ఏడాది ప్రత్యేకంగా వచ్చే అతిదుల్లో ప్రముఖ సినీ గీత రచయిత శ్రీ అనంత్ శ్రీరాంతో పాటు గాయక, గాయనీ మణులు, ధనుంజయ్ మరియు లిప్సిక ఈటీవి జబర్దస్త్ కార్యక్రమ హాస్య నటులు రచ్చ రవి, అదిరే అభి, రాము, మిర్చీ భార్గవి వస్తున్నారు.

అనంత శ్రీరామ్
ప్రముఖ సినీ గీత రచయిత. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. ప్రాథమిక విద్య దొడ్డిపట్ల లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడ లోనూ, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశారు. 12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించారు. మొదటిసారిగా కాదంటే ఔననిలే చిత్రంలో అవకాశం లభించింది. ఇప్పటి వరకు షుమారు 200 చిత్రాలకు 600 పాటలను వ్రాసారు. వీరికి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి పాటలంటే చాలా ఇష్టం.

2012 లో ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రానికి వ్రాసిన పాటకు ఫిలిం ఫేర్ అవార్డునందుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు చిత్రానికి గాను 2014 లో సీమా అవార్డునందుకున్నారు.

అభినయ కృష్ణ :
డా.సినారె హరి కృష్ణ గౌడ్ అభినయాన్ని చూసి మురిసిపోయి తనలోని కళాతృష్ణకు తగ్గట్టుగా పేరుంటే బాగుంటుందని “అభినయ కృష్ణ” గా పునః నామకరణ చేసారు. ఒక జ్ఞానపీఠ పురస్కార గ్రహీతకి నాట్యాభినయనం ద్వారా ఆకట్టుకుని 3.56 సెకండ్ల కాలంలో 24 మంది కళాకారులను అభినయించి లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో పేరుగాంచిన అభినయ్ కొన్ని సినిమాల్లోనూ, భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా తన సత్తాను చాటిచెప్పిన ఘనుడు.

ధనుంజయ్:
చదివింది కెమిస్ట్రీ అయినా చిన్నప్పటినుండీ మనసు సంగీతం పైనే. సినిమా పాటలు పాడితే ఒక హుందా, హోదా. కానీ తరతరాల మన శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంటే ఎలాంటి పాటలనైనా అల ఓకగా పాడే అవకాశం ఉంటుందన్నది తన ఉద్దేశ్యం. యుగలగీతాల నుండి జావళీల వరకు పిన్న వయసులోనే పాడిన ధనుంజయ్ ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. వారి కుటుంబం శాస్త్రీయ సంగీతానికి పుట్టినిల్లైన విజయనగరంలో ప్రస్తుతం నివాసం వుంటున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ అనూప్ రూబెన్స్ తనకి వెండి తెర గురువుగా ప్రశంసించారు. కొన్ని దైవ సంబంధమైన పాటలకు స్వంతంగా బాణీ కట్టి ఆల్బమ్స్ కూడా విడుదల చేసారు.

లిప్సిక:
గాయని మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ లిప్సిక ఇప్పటివరకూ 150 చిత్రాల్లో పాటలు పాడి ఒక అద్భుత గాయనిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సినీ రంగంలో తారా స్థాయికి ఎదిగారు. చదివింది MBA అయినా కళాభిరుచి కలిగి ఉండడం వలన ఈ రంగంలో గత పదేళ్లుగా స్థిరపడ్డారు. ఎప్పటికైనా ఒక సంగీత కళాశాల స్థాపించాలన్నదే తన ఆశయం. ఈ ఆశయం నెరవేరుతుందనే ఆశిద్దాం.

బ్యాండ్ బాజా భార్గవి:
పేరే చెబుతుంది ఎంత మంది అభిమానులు ఉన్నారో! రేడియో మిర్చిలో అత్యంత ప్రాచుర్యం పొందిన భార్గవి బహుముఖ ప్రజ్ఞాశాలి. మిమిక్రీ ఆర్టిస్టుగా, సినిమా నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, కూచిపూడి నృత్య కళాకారిణిగా – ఇలా ఎన్నో రకాలుగా పేరొందిన భార్గవి ప్రేక్షకులే తన కుటుంబమని వారి ఆదరణే తనను ముందుకు తెస్సుకేళ్తుందనీ నమ్ముతుంది.

రచ్చ రవి:
జబర్దస్ట్ కార్యక్రమంలో రచ్చ రవి పేరు ఎరుగని వారుండరు. తన నటనతో హాస్య బ్రహ్మలను మరిపిస్తాడు. తన మాటలతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాడు. వేయి అబద్దాలు, కళ్యాణ వైభోగమే, దృశ్య కావ్యం మొదలైన షుమారు 7 సినిమాల్లో నటించాడు. అంతర్జాతీయ వేదికలపై తన అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. జబర్దస్త్ లో జబర్దస్త్ గా రాణించాడు.

యక్కయ్య:
నృత్య కళాకారుడుగా మొదలై పదేళ్ళ అనుభవంతో ఐదు సినిమాల్లోనూ, వందల కొలది జబర్దస్త్ ఎపిసోడ్స్ లోనూ, జీ టీవి, స్టేజి షోస్ లోనూ నటించి రాణించిన యక్కయ్య వరంగల్ నివాసి.

Send a Comment

Your email address will not be published.