ఆస్ట్రేలియాలో భానోదయం

జనపదాల జానపదుల భానోదయం
బుల్లితెర వెండితెరలకు ఉదయ కిరణం
అచ్చమైన తెలుగు ఉచ్చరించే మధుస్వరం
ప్రజా హృదయాలను దోచుకునే ప్రణవనాదం

తెలంగాణా ముద్దు బిడ్డ, మాటల మూటలతో గారడీ చేసే మధుమతి, బుల్లితెరపై మకుటంలేని మహారాణి, బస్తీ మే సవాల్ అంటూ నిగ్గుతీసి అడిగే కొండ వీటి సింహం, తెలుగు కవిత్వపు కొసమెరుపులు తుది మెరుపులుగా దిద్దిన కవయిత్రి, గాయని – మొట్టమొదటి సారిగా పతీ సమీతంగా ఆస్ట్రేలియా తెలంగాణా అసోసియేషన్ బతుకమ్మ సంబరాలులో పాల్గొనడానికి ఆస్ట్రేలియా గడ్డపైకి వచ్చిన శ్రీమతి ఉదయ భాను గారికి తెలుగుమల్లి పలకరించింది. ఆస్ట్రేలియా తెలంగాణా అసోసియేషన్ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు.

సవ్యసాచిగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీమతి ఉదయభాను గారు తన తల్లే స్పూర్తి అని వారు వ్రాసిన పాటలు, కవితలు తను నిర్వహించే కార్యక్రమాలకు ఎంతో సహకరిస్తాయని చెప్పారు. తెలుగు సినిమా, టివి పరిశ్రమకు వచ్చేటప్పుడు కొంత కష్టపడాల్సి వచ్చినా తరువాత నిలదొక్కుకోవడం జరిగిందనీ చెప్పారు.

సినిమా పరిశ్రమలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు – దర్శకులు, రచయితలు, నటులు, గాయకులతో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు శ్రీమతి ఉదయభాను గారు చెప్పారు. వీరిలో ముఖ్యంగా శ్రీ గోరేటి వెంకన్న గారి గురించి ప్రత్యేకించి ప్రస్తావించడం జరిగింది.

ముందు ముందు రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన వుందా అన్న ప్రశ్నకు ప్రస్తుతం ఆ ఆలోచన ఏమీ లేదని, భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది చెప్పలేనని చెప్పారు. గత ఏడాది ఎలక్షన్ లో మూడు పార్టీలవారు మద్దతివ్వాలని కోరారనీ అయితే రాజకీయ రంగం గురించి ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదని వారికి చెప్పినట్లు తెలిపారు.

ప్రముఖ తెలుగు టివిల్లో ఉదయభాను గారు నిర్వహించి అత్యంత ప్రాచుర్యం పొందిన కార్యక్రమాలు – హార్లిక్స్ హృదయాంజలి మొదలుకొని, ఒన్స్ మోర్ ప్లీజ్, రేలారే రేలా, సాహసం చేయరా డింభకా, జాణవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం కాను, డీ మొదలైన కార్యక్రమాల్లో ఆంకర్ గా నిర్వహణ బాధ్యతలు చేపట్టి వెండితెరపై తెలుగు కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. వాటిలో ముఖ్యమైనవి ఎర్ర సైన్యం, ఆపద మొక్కులవాడు, పోలీస్ నెంబర్ 1, లీడర్, జులాయి.

తెలంగాణా జానపదాలు పాడడం, వ్రాయడమే కాకుండా అభినయించడం కూడా శ్రీమతి ఉదయ భాను గారి ప్రత్యేకత. వారు బుల్లి తెరపై ఎంతో ప్రజాదరణ పొందిన తరువాత జనసమ్మతమైన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది.

Send a Comment

Your email address will not be published.