ఇక ఆశల పల్లకీలు

తెలంగాణా రాష్ట్ర ఏర్పడబోతోందని నిర్ధారణ కావడంతో తెలంగాణా రాష్ట్ర సమితి కొత్త పాటను అందుకుంది. ఈ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావును ఆ పార్టీ నాయకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయనను తెలంగాణా పితగా అభివర్ణిస్తున్నారు. ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, ఎన్ని నిందలు వస్తున్నా చలించకుండా రాత్రీ పగలు కష్ట పడడం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యం అయిందని ఆ పార్టీ నాయకులు రోజుకో సమావేశం పెట్టి చెబుతున్నారు. వాస్తవానికి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం ప్రారంభం అయినప్పుడు చంద్రశేఖర్ రావు తనకు పదవుల మీద ఆశ లేదనీ, ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, సింగపూర్ మాదిరిగా చయడమే తన ఆశయమనీ చెప్పేవారు. తనను ఎంత బలవంతం పెట్టినా పదవులను ఆశించే ప్రసక్తే లేదని కూడా ఆయన గతంలో చెప్పారు. ఓ వెనుకబడిన లేదా బడుగు వర్గాలకు చెందినా వ్యక్తిని అధికారంలో కూర్చోబెట్టడమే తన ధ్యేయమని ఆయన అనేక పర్యాయాలు చెప్పారు.

అయితే తన తెలంగాణా రాష్ట్ర కల సాకారం అయిన తరువాత ఆయనలో పునరాలోచన ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది. ఆయన మేనల్లుడు హరీష్ రావు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఒక్క చంద్రశేఖర్ రావు చేతుల్లో మాత్రమే రాష్ట్ర ఇతోధికంగా అభివృద్ధి చెందుతుందని, ఆయన ఒక ద్రష్ట అనీ పదే పదే చెబుతున్నారు. ఆయన లేకపోతే తెలంగాణా లేనే లేదనీ, ఆయనే ముఖ్యమంత్రి కావాలనీ నొక్కి చెబుతున్నారు. చంద్రశేఖర్ రావు స్వయంగా ఆయనతో ఈ మాటలు అనిపిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. ఆ పదవి మీద ఆశతోనే రావు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఇష్టపడడం లేదని కూడా వారు విమర్శిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.